logo

AP News: ‘ప్రేమ వివాహం.. పిల్లలు పుట్టాకఇబ్బందులకు గురిచేస్తున్నారు’

తనను ప్రేమ వివాహం చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఇబ్బందులకు గురిచేస్తూ ఇప్పుడు ఇంట్లోకి రానీయడం లేదని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ఏడో వార్డుకు చెందిన వైష్ణవి గురువారం భర్త ఇంటి ఎదుట మౌనపోరాటం చేసింది.

Updated : 28 Jan 2022 09:53 IST

వివాహిత మౌనపోరాటం

పిల్లలతో వైష్ణవి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: తనను ప్రేమ వివాహం చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఇబ్బందులకు గురిచేస్తూ ఇప్పుడు ఇంట్లోకి రానీయడం లేదని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక ఏడో వార్డుకు చెందిన వైష్ణవి గురువారం భర్త ఇంటి ఎదుట మౌనపోరాటం చేసింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. నాలుగో వార్డుకు చెందిన గోళ్ల మణికంఠ 2020 నవంబర్‌ 5న వైష్ణవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత భర్త అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఇటీవల ఆత్మహత్మ చేసుకోబోయిన వైష్ణవిని బంధువులు పుట్టింటికి తీసుకెళ్లారు. అప్పటికే గర్భవతిగా ఉన్న వైష్ణవికి కవల పిల్లలు జన్మించగా వారితోపాటు పుట్టింట్లోనే ఉంటున్నారు. అప్పుడు కూడా భర్త, భర్త తరఫువారు తమను చూడటానికి రాలేదని వైష్ణవి చెప్పింది. ఈ పరిస్థితిలో గురువారం ఉదయం పిల్లలతోపాటు వైష్ణవిని ఆమె తల్లిదండ్రులు అత్తవారింటికి తీసుకురాగా అత్త ఆమెను ఇంట్లోకి రావడానికి వీలులేదని అడ్డుకుంది. గత్యంతరం లేని వైష్ణవి అత్తవారి ఇంటి ఎదుట అరుగుపై ఇద్దరు పిల్లలతో కూర్చొని మౌన పోరాటం చేసింది. పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. ఉభయ వర్గాలను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కోడల్ని ఇంట్లోకి రావడానికి అత్త అనుమతించడంతో ఆమెను ఇంటికి పంపించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేయలేదన్నారు. మణికంఠ గ్రామంలో లేకపోవడం చర్చనీయాంశమైంది. భార్య పుట్టినింటికి వెళ్లినప్పటి నుంచి భర్త వేరే గ్రామంలో ఉద్యోగానికి వెళ్లినట్లు అతని బంధువులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని