ఏకే రావు మృతి కేసులో వీడని గుట్టు

కన్నడ, తెలుగు నేపథ్య గాయని హరిణిరావు తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. ఆయన మృతదేహానికి సంబంధించిన శవపరీక్ష నివేదిక కోసం రైల్వే పోలీసులు ఎదురుచూస్తుంటే..

Published : 28 Nov 2021 09:48 IST

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కన్నడ, తెలుగు నేపథ్య గాయని హరిణిరావు తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. ఆయన మృతదేహానికి సంబంధించిన శవపరీక్ష నివేదిక కోసం రైల్వే పోలీసులు ఎదురుచూస్తుంటే.. ఆయనపై వంచన కేసులు నమోదు చేసుకున్న బెంగళూరు ఆగ్నేయ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆగ్నేయ డీసీపీ శ్రీనాథ్‌ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏకే రావు పేరిట ఉన్న లోన్‌ కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా రుణాలిస్తామని నమ్మించిన ఫైనాన్షియర్లు డేనియల్‌ ఆమ్‌స్ట్రాంగ్‌, వివేకానంద కుమార్‌, రవి రాఘవన్‌ కలిసి బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పి.గిరీష్‌ నుంచి రూ.2.3 కోట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యాపారి తరమ్‌ నుంచి రూ.3.6కోట్లు వసూలు చేశారు.ఆ తర్వాత వారి నుంచి స్పందన లేకపోవటంతో బాధితులు ఏకే రావును నిలదీశారు. ఈ విషయంలో తానూ మోసపోయానని రావు చెప్పినా, వినని బాధితులు ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకేరావు, ఆయన మిత్రుడు మరాళి, 22న విచారణకు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు ఉదయమే ఏకేరావు మృతి చెందారు.

కూతురు ఇంటికని చెప్పి

ఈ నెల 8న బెంగళూరుకు వచ్చిన ఏకేరావు, జీఎం పాళ్యలోని తన చిన్న కుమార్తె శాలినీరావు ఇంట్లో 13వ తేదీ వరకు ఉన్నారు. అనంతరం రెసిడెన్సీ రోడ్డులోని చాన్సరీ పెవిలియన్‌ హోటల్‌లో దిగారు. అక్కడి నుంచే, మరాళితో కలిసి సుద్దగుంట పాళ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు. 22న విచారణ ముగియగా, అదే రోజు రాత్రి కుమార్తె వద్దకని చెప్పి యలహంకకు క్యాబ్‌లో వెళ్లారు. ఏకే రావు యలహంకకు వెళ్తాడన్న సంగతి తనకు తెలియదని మరాళి పోలీసులకు చెప్పారు. సోమవారం శవపరీక్ష నివేదిక వచ్చే అవకాశం ఉందని యలహంక రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ వివరించారు. ఏకే రావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే హత్య కేసు నమోదు చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు