logo
Updated : 28/11/2021 05:52 IST

జీఎమ్మార్‌ సెజ్‌లో రూ.50 లక్షల విలువైన యంత్రాలు మాయం

శంషాబాద్‌: విమానాల మరమ్మతుల కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ యంత్రాలు మాయమైన ఘటన విమానాశ్రయం జీఎమ్మార్‌ సెజ్‌లో శనివారం బయటపడింది. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శంషాబాద్‌ విమానాశ్రయంలో టర్బోజెట్‌ ఇంజిన్‌ సంస్థ సిబ్బంది విమానాల చక్రాలు, బ్రేక్‌లు, బ్యాటరీల మరమ్మతులు చేస్తుంటారు. బిహార్‌కు చెందిన కుమార్‌, మణిపూర్‌కు చెందిన ప్రతాప్‌లు ఆ సంస్థలో మేనేజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నెల క్రితం ఇద్దరూ సెలవుపై స్వస్థలాలకు వెళ్లారు. గడువు ముగిసినా వారు విధులకు హాజరు కాలేదు. ఫోన్లలో సంప్రదించినా వారిద్దరూ స్పందించడం లేదు. అనుమానం వచ్చి టర్బో జెట్‌ ఇంజిన్‌ వర్క్‌షాప్‌ భద్రత విభాగాలను పరిశీలించగా విమానాలను మరమ్మతులు చేయడానికి ఉపయోగించే రూ.50 లక్షల విలువైన అత్యాధునిక యంత్రాలు మాయమయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

శంషాబాద్‌: గల్ఫ్‌ నుంచి రహస్యంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రయాణికుడు దుబాయ్‌ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో స్వదేశానికి వచ్చాడు. 410గ్రాముల బంగారాన్ని కరిగించి సుగంధ ద్రవ్యాల బాక్సుల్లో, సూట్‌కేసుకు ఫ్రేమ్‌లా మార్చి తీసుకొచ్చాడు. విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేసి, ప్రయాణికుడిని అరెస్టు చేశారు. రూ.20.30 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.


కొడుకును విచక్షణారహితంగా కొట్టిన తండ్రిపై కేసు

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: మానవత్వం మరిచి కన్న కొడుకును విచక్షణారహితంగా కొట్టిన తండ్రిపై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ అబ్దుల్‌ ఖాదర్‌ జిలాని కథనం ప్రకారం.. లాల్‌దర్వాజాకు చెందిన వ్యక్తి(35) ఎలక్ట్రికల్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. ఆయనకు కుమారుడు(8), కుమార్తె సంతానం. కొడుకు అల్లరి ఎక్కువ చేస్తున్నాడని పక్కింటివారు ఫిర్యాదు చేయడంతో శనివారం కర్రతో తీవ్రంగా కొట్టాడు. కుమార్తెకు ఫోన్‌ ఇచ్చి వీడియో తీయించాడు. భార్య, కుమారుడు వద్దని ప్రాథేయపడినా వినకుండా కర్ర విరిగేలా చితకబాదాడు. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని