logo
Published : 28/11/2021 05:35 IST

అస్వస్థతకు కలుషిత జలాలే కారణం

సరూర్‌నగర్‌, న్యూస్‌టుడే: సరూర్‌నగర్‌ జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలో కలుషిత జలాల కారణంగానే విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. నాలుగు రోజులుగా వసతి గృహంలో తాగునీరు కలుషితమవుతోందని, పాడైన కూరగాయలతో ఆహారం తయారు చేస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. పాఠశాలలో నీటిని శుద్ధిచేసే యంత్రం పాడైంది. శుక్రవారం మరమ్మతు చేసి బోరు నుంచి వచ్చే నీటిని విద్యార్థులకు సరఫరా చేశామని వసతి గృహం ఆర్‌సీఓ ప్రభాకర్‌ తెలిపారు. ఆ నీరు తాగడంతో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నారు. వసతి గృహాన్ని జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలల కార్యదర్శి మల్లయ్య భట్టు, జాయింట్‌ సెక్రటరీ రమణారెడ్డి సందర్శించారు. మల్లయ్య భట్టు మాట్లాడుతూ.. కలుషిత జలాల సమస్యను వెంటనే పరిష్కరించామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. సరూర్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణిఅంజన్‌ విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించి, నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.

సందర్శించిన వైద్యాధికారులు

గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి భోజనానంతరం విద్యార్థులకు ఎదురైన ఆరోగ్య సమస్యలపై ప్రచారం కావడంతో శనివారం రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు వసతి గృహాన్ని సందర్శించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వినోద్‌కుమార్‌, మండల వైద్యాధికారిణి అర్చన ఇతర వైద్యాధికారులు.. విద్యార్థులను, నిర్వాహకులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. వారంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థులు తాగిన నీటిని పరీక్ష నిమిత్తం నారాయణగూడ ఐపీఎంకు తరలించామని తెలిపారు.

‘ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయాలి’

వసతిగృహం నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పాఠశాల ఆవరణలో ధర్నా చేశారు. లింగంగౌడ్‌, మహేశ్‌ యాదవ్‌, సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.


చిన్నారులను పరామర్శించిన ఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌, సభ్యులు

బాలుడితో మాట్లాడుతున్న జస్టిస్‌ చంద్రయ్య, ఆనందరావు. చిత్రంలో డా.మురళీకృష్ణ, డా.లాలూప్రసాద్‌ రాథోడ్‌

రెడ్‌హిల్స్‌: అస్వస్థతకు గురై నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ గుండా చంద్రయ్య, సభ్యులు ఆనందరావు శనివారం రాత్రి పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్‌, డ్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ జగదీష్‌తో మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వసతి గృహంలో నీరులేక స్నానం చేసి నాలుగు రోజులైందని, రాళ్ల బియ్యంతో వండిన భోజనం పెడుతున్నారని పిల్లలు చెప్పడంతో నిర్వాహకుల పట్ల కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ.. ‘960 మంది విద్యార్థులున్న గురుకుల పాఠశాలలో 24 గంటల నిఘా ఉండాలి. పిల్లల ఆరోగ్యం, అక్కడి సౌకర్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇది అధికారుల నిర్లక్ష్యంగా కమిషన్‌ భావిస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి. దీన్ని ఉదాహరణగా తీసుకొని అధికారులు గురుకుల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి’ అన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని