విధులు మరిచి.. వసూళ్లకు మరిగి!

బాధ్యత గల పోలీసు వృత్తిలో ఉండి.. ఓ కేసు నుంచి నిందితుణ్ని తప్పించి డబ్బు వసూలు చేసిన హోంగార్డు, మాజీ హోంగార్డుతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి

Updated : 29 Nov 2021 04:34 IST

కేసు కాకుండా నిందితుణ్ని తప్పించి డబ్బు

తీసుకున్న హోంగార్డు బృందం రిమాండ్‌

శివ                 శ్రీను                బాలరాజు

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: బాధ్యత గల పోలీసు వృత్తిలో ఉండి.. ఓ కేసు నుంచి నిందితుణ్ని తప్పించి డబ్బు వసూలు చేసిన హోంగార్డు, మాజీ హోంగార్డుతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ పురపాలిక పరిధిలోని ద్వారకానగర్‌లో ఉంటున్న బండారపు శివ(44) ఘట్‌కేసర్‌ ఠాణాలో హోంగార్డు. పోలీసు పెట్రోల్‌ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఘట్‌కేసర్‌ బాలాజీనగర్‌కు చెందిన మాజీ హోంగార్డు ఎల్లిజర్ల బాలరాజు(35), అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ డి.శ్రీను(36).. శివ స్నేహితులు. ఈనెల 25న రాత్రి వరంగల్‌ జాతీయ రహదారి ఎన్‌ఎఫ్‌సీనగర్‌ వంతెన వద్ద ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఆటోడ్రైవర్‌ మృతి చెందాడు. హోంగార్డు శివ ఘటనా స్థలికి చేరుకుని ఇసుక లారీని దూరం పంపించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు ఉన్నతాధికారులకు తెలిపాడు. తన స్నేహితులను రప్పించాడు. శివ సూచన మేరకు వారు ఇసుక లారీ డ్రైవర్‌ నరసింహ వద్దకు వెళ్లి తాము పోలీసులమని కేసు నుంచి తప్పిస్తామని చెప్పి రూ.20 వేలు తీసుకున్నారు. రూ.15 వేలు శివకు ఇచ్చారు.

తెలిసిందిలా... గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లుగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా అనుమానంతో ఇసుక లారీ డ్రైవర్‌ నరసింహను అదుపులోకి తీసుకున్నారు. కేసు నుంచి తప్పిస్తామని ఇద్దరు వ్యక్తులు డబ్బులు తీసుకున్నారని అతను చెప్పాడు. ఆధారాలు సేకరించిన పోలీసులు హోంగార్డు శివతోపాటు బాలరాజు, డి.శ్రీనుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని