logo
Updated : 29/11/2021 05:27 IST

ఆకాశ మార్గం.. అందనంత దూరం!

 స్కైవాక్‌ల నిర్మాణంలో హెచ్‌ఎండీఏ నిర్లక్ష్యం

గడువు దాటినా సగమూ పూర్తవని పైలట్‌ ప్రాజెక్టులు

 ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

మెహిదీపట్నంలో పునాదిలోనే ఆగిపోయిన పనులు

హైదరాబాద్‌ మహానగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న వ్యక్తిగత వాహనాలతో రోడ్లపై రద్దీ ఎక్కువవుతోంది. కాలు కదిపే సందూ కనిపించని దారులపై వాహనదారుల సమస్యలు అటుంచితే పాదచారుల పరిస్థితి మరీ ఘోరం. దీనికి పరిష్కారంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకాశ మార్గాలు(స్కైవాక్‌) నిర్మించేందుకు హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రణాళికలు రూపొందించింది. ఎక్కువ రద్దీ ఉండే మెహిదీపట్నం, ఉప్పల్‌ కూడళ్లలో పైలట్‌ ప్రాజెక్టుగా వీటి నిర్మాణం చేపట్టింది. ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులప్పగించింది. ఇది ఆరంభశూరత్వంగానే మిగిలి గడువు పూర్తయినా పనులు సగం కూడా పూర్తవకపోవడంపై ఇప్పుడు జనం మండిపడుతున్నారు. ఓచోట రాజకీయ కారణాలతో పనులు ఆగినట్లు విశ్వసనీయ సమచారం అందగా.. మరోచోట పనుల జాప్యంపై అధికారులు వివిధ కబుర్లు చెబుతుండటం గమనార్హం.

గాల్లో మేడలు..

ఓవైపు రద్దీ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తూనే.. మరోవైపు అక్కడ అందుబాటులో ఉన్న స్థలంలోనే బస్సులు వచ్చిపోయేందుకు షెల్టర్లు నిర్మించడంతోపాటు ప్రయాణికుల షాపింగ్‌కు వీలుగా వాణిజ్య సముదాయాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. రూ.61.80కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణాలు పూర్తయితే ఆయా ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని.. గ్రాఫిక్స్‌లో అద్భుతమైన బొమ్మలు చూపించారు. 2021 నవంబరు మొదట్లోనే ఇవి పూర్తయి అందుబాటులోకి వస్తాయనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. తీరా చూస్తే మెహిదీపట్నం వద్ద పునాది వద్దే ఆగిపోగా.. ఉప్పల్‌ వద్ద స్కైవాక్‌ పిల్లర్ల దాకా చేరి నత్తనడకన పనులు సాగుతున్నాయి.


‘‘తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ 2020-21 వార్షిక నివేదికలోనూ హైదరాబాద్‌ మౌలిక సదుపాయల కల్పన విభాగంలో.. రూ.61.8కోట్ల వ్యయంతో ఉప్పల్‌, మెహిదీపట్నం ప్రాంతాల్లో రెండు స్కైవాక్‌ల పనులు పురోగతిలో ఉన్నాయని.. నవంబరులో ఇవి అందుబాటులోకి వస్తాయని పేర్కొనడం గమనార్హం.’’


మెహిదీపట్నం ప్రాజెక్టు

అంచనా వ్యయం: రూ.36.80కోట్లు
ఎంత పూర్తయింది: భూమిలో పునాదులు వేసి మళ్లీ పూడ్చేశారు. పైన ఒక్క శాతం కూడా పని జరగలేదు. తాత్కాలికంగా ఆగిపోయాయి.
ఎందుకు జాప్యం: స్టీల్‌ ఫ్యాబ్రికేషన్‌ వేరేచోట చేయిస్తున్నామని, 4నెలల్లో పూర్తవుతుందని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కానీ, ఆటోలు నిలిపేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని ఓ పార్టీకి చెందిన నేతలు స్కైవాక్‌ ప్రణాళికే మార్చాలని ఒత్తిడి చేస్తున్నట్లు వినికిడి.
నిర్మాణం ఎలా: గుడిమల్కాపూర్‌కు వెళ్లే చౌరస్తా నుంచి మెహిదీపట్నం బస్టాండ్‌ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే ఫ్లైఓవర్‌ కింది నుంచి మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్‌ వరకు 380 మీటర్లు పొడవు, 3.6 మీటర్ల వెడల్పుతో నిర్మాణం ఉంటుంది. రైతుబజార్‌ నుంచి మెహిదీపట్నం బస్టాండ్‌ వరకు మరో స్కైవాక్‌తో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి వచ్చే స్కైవాక్‌తో కలిపి అన్ని వైపులా వెళ్లేందుకు నడకదారి నిర్మిస్తారు.


ఉప్పల్‌ ప్రాజెక్టు

ఉప్పల్‌ స్కైవాక్‌ నమూనా

అంచనా వ్యయం: రూ.25.39కోట్లు
ఎంత పూర్తయింది: పిల్లర్ల నిర్మాణం జరిగింది. పైభాగంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఎందుకు జాప్యం : స్టీల్‌ ఫ్యాబ్రికేషన్‌ పనుల్లో ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు.
ఎలా కడుతున్నారు: నాలుగు వైపులా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఆరు ప్రాంతాల్లో స్టెయిర్‌ కేసులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి అనుసంధానంగా 660 మీటర్ల పొడవు, 6.15 మీటర్ల ఎత్తు, 4మీటర్ల వెడల్పుతో నడక దారి, దుకాణాలు, కియోస్క్‌ల నిర్మాణంతో పాటు ఉప్పల్‌ కూడలిలోని మెట్రో స్టేషన్‌ మొదటి అంతస్తుకు అన్నివైపులా చేరుకునేలా నేరుగా వాక్‌వే అనుసంధానం చేస్తారు.

 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని