logo
Updated : 30/11/2021 03:13 IST

సంక్షిప్త వార్తలు

18న గ్రేటర్‌ పాలక మండలి సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: పది నెలలుగా పాలకమండలి సమావేశం ప్రత్యక్షంగా నిర్వహించక పోవడంపై ఇటీవల భాజపా కార్పొరేటర్లు చేపట్టిన నిరసనపై జీహెచ్‌ఎంసీ స్పందించింది. మేయర్‌ కార్యాలయం ముట్టడిపై చట్టపరంగా ముందుకెళుతూనే, డిసెంబరు 18న పాలకమండలి సమావేశం నిర్వహించాలని సోమవారం నిర్ణయించారు. దానికి ముందే కొత్తగా ఎన్నికైన స్థాయీ సంఘం సభ్యులతో డిసెంబరు 8న సమావేశం నిర్వహించాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి  ఆదేశించారు. చాలా రోజులుగా బల్దియాలో స్థాయీ సంఘం  లేక ఎక్కువ వ్యయంతో చేపట్టే పనుల ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని ఈ సమావేశంలో ఆమోదింపజేసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


మూత్రపిండాల్లో అరుదైన క్యాన్సర్‌ కణితి తొలగింపు

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: ఓ మహిళకు మూత్రపిండంలో దాదాపు 20సెంటీమీటర్లు పెరిగిన అరుదైన క్యాన్సర్‌ కణితిని మినిస్టర్‌ రోడ్డులోని కిమ్స్‌ వైద్యులు రాడికల్‌ నెఫ్ట్రెకమీ శస్త్రచికిత్స చేసి తొలగించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ(46) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. ఆమె కడుపులో పెద్ద కణితి ఉందన్న అనుమానంతో కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రి యూరాలజిస్టు ఉపేంద్రకుమార్‌ పరీక్షలు నిర్వహించి మూత్రపిండాల్లో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. ఇది మూత్రపిండాల లోపల మొదలై బయటకు వస్తూ ప్రధాన రక్తనాళాలు, చుట్టుపక్కల ముఖ్యమైన ప్రాంతాలను తాకుతూ ఉంది. ఆమెకు రాడికల్‌ నెఫ్రెక్టమీ శస్త్రచికిత్స చేసి విజయవంతంగా దానిని తొలగించారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేల జరిమానా

పరిగి: ప్లాస్టిక్‌ కవర్లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే వ్యాపారులకు రూ.5వేల నుంచి రూ.10వేల జరిమానా విధిస్తామని పురపాలక సంఘం కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని పలు దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ కవర్లను వినియోగించాలని సూచించారు. మున్సిపల్‌ మేనేజరు నరేష్‌ పాల్గొన్నారు


విదేశాల్లో చదువులకు ప్రభుత్వ ఆర్థిక సాయం

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: సీఎం విదేశీ (ఓవర్సీస్‌) ఉపకార వేతనాల కోసం అర్హులైన విద్యార్థులు డిసెంబర్‌ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిణి డి.సుధారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే అల్ప సంఖ్యాక వర్గాల వారికి ఆర్థిక సహాయాన్ని అందచేస్తారన్నారు. దరఖాస్తులను జిల్లా పాలనాధికారి కార్యాలయం గది నంబరు 6లో అందజేయాలని సూచించారు. వివరాలను చరవాణి నంబరు 7993357103లో సంప్రదించాలన్నారు.


వృత్తి విద్యా కోర్సులో ఉచిత శిక్షణ

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా నిర్వహిస్తున్న వృత్తి, విద్యా శిక్షణ కోర్సుల్లో చేరి సద్వినియోగం చేసుకోవాలని తాండూరు తహసీల్దారు చిన్నప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐదు నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌ వంటి చదువులు పూర్తి చేసుకున్న 18-45 సంవత్సరాల్లోపు వయస్సున్న యువతకు 63 కోర్సుల్లో శిక్షణ లభిస్తుందన్నారు. టైలరింగ్‌, కంప్యూటర్‌ విభాగాలకు వికారాబాద్‌లోని దుర్గాబాయ్‌ మహిళా శిశు వికాస కేంద్రంలో, ఇతర కోర్సులను హైదరాబాద్‌లోనూ నిర్వహిస్తారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సదుపాయాల్ని కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు విద్యార్హత, కుల, ఆదాయ ధ్రువ పత్రాలతోపాటు ఆధార్‌ ప్రతులతో ఎంపీడీఓ, మున్సిపల్‌, ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయాల్లో వారం రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని