logo
Published : 30/11/2021 08:30 IST

గజాల్లో అమ్మకం..గుంటల లెక్క రిజిస్ట్రేషన్లు

జిల్లాలో అనధికార వ్యవసాయ క్షేత్రాల తీరు
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

నవాబుపేట మండలంలో పొలానికి వెళ్లేందుకు నిర్మిస్తున్న రోడ్డు

* వికారాబాద్‌ మండలం పీరంపల్లిలో అనుమతులు లేకుండా వ్యవసాయ క్షేత్రాల లేఅవట్‌ వేస్తున్నారని గుర్తించిన పంచాయతీ అధికారులు సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. వారి నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. అయినా చర్యలు తీసుకునేందుకు పంచాయతీ, రెవెన్యూ అధికారులు వెనుకాడుతున్నారు. ఇదే మండలం సిద్దులూరు, ద్యాచారంలో అనధికారికంగా ఏర్పాటవుతున్న ఫాం లేఅవుట్లపై అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్కడా ఇదే పరిస్థితి.

* నవాబుపేట మండలం సుమారు 30 ఎకరాల్లో లే అవుట్‌ వేశారు. దీనికి సంబంధించి అనుమతులు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తే మా సొంతానికి వేసుకుంటున్నామని సమాధానం వచ్చింది. వాస్తవానికి అర్ధఎకరం నుంచి రెండు ఎకరాల వరకు ప్లాట్లుగా మార్చి వ్యవసాయ క్షేత్రాలుగా విక్రయిస్తున్నారని సమాచారం.

* వికారాబాద్‌ మండలం లాల్‌సింగ్‌ తండాకు ఆనుకుని ఏర్పాటైన వెంచరులో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ గతంలో అధికారులు నోటీసులు జారీ చేసి, అనంతరం కూల్చివేశారు.

లాల్‌సింగ్‌ తండాలో అనధికార నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు

వ్యవసాయ పొలంలో విశాలమైన రహదారులు నిర్మిస్తున్నారు. అత్యాధునిక హంగులతో కూడిన అతిథి గృహాలు సిద్ధమవుతున్నాయి. వ్యవసాయ భూమిని ఎలాంటి నాలా (నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌)గా మార్చాల్సిన అవసరం లేకుండా గజాల చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ వరకు వచ్చే సమయంలో గుంటల (వ్యవసాయ భూమిగానే)లెక్కన దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన పంచాయతీ అధికారులు సదరు నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేస్తున్నా, అనంతరం చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారు. ఇదేమంటే తమపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 571 పంచాయతీలున్నాయి. ఇందులో వికారాబాద్‌, నవాబుపేట, పూడూరు, మోమిన్‌పేట్‌, మర్పల్లి, ధారూర్‌, పరిగి, కుల్కచర్ల తదితర మండలాల్లో వ్యవసాయ క్షేత్రాల (ఫాం లే అవుట్స్‌)ను ఇష్టానుసారం ఏర్పాటు చేస్తున్నారు. వీటికి   అనుమతులు తీసుకోవడంలేదు మరో వైపు ఈ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వారికి రైతు బంధు సొమ్ము వస్తుందని సమాచారం. నిబంధనల ప్రకారం లేఅవుట్‌ వేసినపుడు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా(నాలా) మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో రెవెన్యూ యంత్రాంగం తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది.


నేరుగా అమ్మకాలు..

నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లింపు, రహదారులు, పార్కులకు కొంత స్థలాన్ని పంచాయతీకి రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా 25 శాతం భూమిని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలి. ఉదాహరణకు ప్రస్తుతం ఎకరం రూ.కోటి వరకు ధర పలుకుతోంది. అంటే కనీసం రూ.25 లక్షల విలువైన భూమిని పంచాయతీకి అప్పగించాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా నేరుగా వ్యవసాయ భూమిగానే అమ్మకాలు చేయడంతో ఒక్క గజం భూమిని ఎవరికి అప్పగించాల్సిన అవరం లేకుండా వంద శాతం భూమిని అమ్ముకుంటున్నారు. రహదారులు వేసిన భూములు సైతం కొనుగోలుదారు పేరుమీదే ఉంటున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే చూపిస్తున్నారు. దీంతో రైతులతో సమానంగా అన్ని రకాల ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు వస్తున్నాయి. జిల్లాలో ఇటువంటి లే అవుట్లపై దృష్టిసారించిన అధికారులు నోటీసులతో సరిపెట్టేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇందులో పంచాయతీలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు లాభపడుతున్నారని సమాచారం.


నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదు
- మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి.

నధికార వ్యవసాయ క్షేత్రాలను గుర్తించాం. పంచాయతీ నుంచి రెండు నుంచి మూడు సార్లు నోటీసులు ఇచ్చాం. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

బిజినెస్

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం