logo
Published : 30/11/2021 03:34 IST

రైల్వే లైన్ల సర్వేలో ఎన్‌జీఆర్‌ఐ

హెలిబోర్న్‌ సాంకేతికత వినియోగం

హెలికాప్టర్‌తో తలస్సేరి -మైసూర్‌ రైల్వే లైన్‌ సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: నీటి జాడలు కనుగొనేందుకు మాత్రమే కాదు.. నూతన రైల్వే లైన్ల సర్వే పనులను జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) చేపట్టింది. కొంకణ్‌ రైల్వే ఈ సంస్థ సేవలను వినియోగించుకుంటోంది. అత్యాధునిక హెలిబోర్న్‌ జియోఫిజికల్‌ మ్యాపింగ్‌తో ఈ ప్రాజెక్టును మొదలెట్టింది. కొండలు, గుట్టల మధ్యలోంచి రైల్వే లైన్లు వేయాల్సిన చోట ఎన్‌జీఆర్‌ఐ అధ్యయనం కీలకం కానుంది.

హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెలిబోర్న్‌ జియోఫిజికల్‌ మ్యాపింగ్‌ టెక్నిక్‌ను అభివృద్ధి చేసింది. హెలికాప్టర్‌కు వేలాడదీసిన ఎలక్ట్రో మాగ్నటిక్‌ పరికరం సాయంతో 50 మీటర్ల ఎత్తులో సర్వే చేస్తారు. భూమి లోపల 500 మీటర్ల లోపల వరకు ఏమున్నాయో ఇది గుర్తిస్తుంది. చాలా స్పష్టమైన త్రీడీ చిత్రాలతో చూపిస్తుంది. కరవు ప్రాంతాల్లో నీటి జాడలను గుర్తించేందుకు మొదటగా దీన్ని ఉపయోగించారు. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ప్రస్తుతం సర్వేలు కొనసాగుతున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో రైల్వే మార్గాలను సర్వే చేస్తున్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల్లో ప్రభుత్వాలు ఎన్‌జీఆర్‌ఐ హెలిబోర్న్‌ సాంకేతికతను వినియోగించుకున్నాయి.


టన్నెల్స్‌ తవ్వకాలకు...

ప్రతిపాదిత రైల్వే మార్గంలోని భూగర్భంలో మట్టి, రాళ్లు, భూగర్భ నీటి వనరులు, ఇతరత్రా వివరాలన్నీ హెలిబోర్న్‌ సర్వేలో స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. శీతాకాల వాతావరణం అనుకూలంగా ఉండటంతో దశలవారీగా రైల్వే లైన్‌ సర్వే మొదలెట్టారు. ప్రతిపాదిత తలస్సేరి -మైసూర్‌ రైల్వే లైన్‌ను తొలుత సర్వే చేస్తున్నారు. దాదాపు 18 వేల కిలోమీటర్ల సర్వే చేసిన అనుభవం ఎన్‌జీఆర్‌ఐ బృందానికి ఉంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రైల్వే లైన్ల కోసం టన్నెల్స్‌ ఎక్కడ అనుకూలమో హెలిబోర్న్‌ టెక్నిక్‌ సాయంతో గుర్తించవచ్చునని ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ వి.బి.తివారీ అన్నారు. గతంలో హిమాలయాల్లో 120 కి.మీ. చేసినట్లు చెప్పారు. ‘కేరళలోని తిరుస్సేరి నుంచి కర్ణాటకలోలోని మైసూర్‌ వరకు 240 కి.మీ. ప్రతిపాదిత రైల్వే లైన్‌ మార్గం ఎక్కువగా పశ్చిమ కనుమల మీదుగా వెళ్లనుంది. ఇక్కడ కొన్నిచోట్ల కిలోమీటర్‌ ఎత్తులో కొండలు ఉన్నాయి. రాతి నిర్మాణంలో లోపాలతో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉంది. హెలిబోర్న్‌ సర్వేలో వీటన్నింటిని గుర్తించి అనువైన చోట టన్నెల్స్‌ నిర్మాణం చేపట్టేందుకు దోహదం చేస్తుంది’ అని సాంకేతికత అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్‌ సుభాష్‌ చంద్ర ‘ఈనాడు’తో పేర్కొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని