logo

భర్తను కడతేర్చిన భార్య

ప్రతి రోజూ వేధిస్తున్న భర్త పీడ వదిలించుకోవాలని భావించిన భార్య కుమార్తె, మరో వ్యక్తితో కలిసి అతని ప్రాణాలు గాలిలో కలిపింది. ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినా

Published : 05 Dec 2021 00:36 IST

కుమార్తె, మరొకరితో కలిసి హత్య

అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు

నిందితులను చూపుతున్న అల్లాదుర్గం సీఐ జారి, పేట ఎస్‌ఐ నరేందర్‌

పెద్దశంకరంపేట, న్యూస్‌టుడే: ప్రతి రోజూ వేధిస్తున్న భర్త పీడ వదిలించుకోవాలని భావించిన భార్య కుమార్తె, మరో వ్యక్తితో కలిసి అతని ప్రాణాలు గాలిలో కలిపింది. ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినా పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి రావడంతో కటకటాల పాలైంది. అల్లాదుర్గం సీఐ జార్జి, పెద్దశంకరంపేట ఎస్‌ఐ నరేందర్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని మల్కాపురం గ్రామానికి చెందిన ఎరుకల వెంకయ్య (44) భార్య శ్యామలతో కలిసి పందులు మేపుకోవడంతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యను అనుమానించిన వెంకయ్య ఆమెతో పాటు 11 ఏళ్లున్న కూతురిని సైతం వేధించసాగాడు. దీంతో భర్త పీడ వదిలించుకోవాలని భావించిన భార్య శ్యామల నవంబరు 29న తనకు ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లాలని చెప్పి భర్త, కూతురును సైతం వెంటబెట్టుకుని పెద్దశంకరంపేటకు వచ్చారు. ప్రణాళిక ప్రకారం పొరుగింట్లో ఉంటున్న వడ్డె మల్లయ్యను పిలిపించుకున్నారు. ఆస్పత్రిలో వైద్యం అనంతరం కుమార్తె వెంట రాగా ముగ్గురు కలిసి కల్లు తాగారు. తర్వాత మద్యం సీసాలు తీసుకుని అదే రోజు కాలినడకన మల్కాపురానికి బయలుదేరారు. మార్గమధ్యలో గురుపాద గుట్ట వద్ద ఆగారు. అక్కడ వెంకయ్యకు అతిగా మద్యం తాగించారు. స్పృహ తప్పి పడిపోగానే శ్యామల వెంట తెచ్చుకున్న తాడుతో కుమార్తె, మల్లయ్యల సాయంతో గొంతుకు బిగించి హత్య చేశారు. తర్వాత వెంకయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పేందుకు అతను కట్టుకున్న పంచెతో సమీపంలోని విద్యుత్తు టవర్‌కు ఉరేసుకున్నట్లు చిత్రీకరించి ఏమి తెలియనట్లు రాత్రికి ఇల్లు చేరారు. తెల్లవారిన తరువాత భర్త కనిపించడం లేదని మామకు చెప్పడంతో ఇరుగు పొరుగు కలిసి వెతకగా విగతజీవిగా కనిపించాడు. తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. శవపరీక్షలో గొంతుపిసికి హత్య చేసినట్లుగా గుర్తించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన భార్య శ్యామలను తమదైన శైలిలో విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు సీఐ వివరించారు. ఈ మేరకు వెంకయ్యను హత్య చేసిన భార్యతో పాటు కుమార్తె, వడ్డె మల్లయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని