logo

భూ దస్త్రాల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

తమ భూదస్త్రాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్‌ కార్యాలయాన్ని ముట్టడించి, తహసీల్దారును నిలదీసిన ఘటన అల్లాదుర్గంలో శనివారం చోటుచేసుకుంది.

Published : 05 Dec 2021 00:36 IST

పురుగు మందు తాగేందుకు యత్నించిన రైతు

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కర్షకులు

అల్లాదుర్గం, న్యూస్‌టుడే: తమ భూదస్త్రాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్‌ కార్యాలయాన్ని ముట్టడించి, తహసీల్దారును నిలదీసిన ఘటన అల్లాదుర్గంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 312, 325లలో 750 ఎకరాలు ఉంది. ఈ భూమికి సంబంధించిన పట్టాలు రెడ్డిపల్లి, కాయిదంపల్లి గ్రామాలకు చెందిన నిరుపేద రైతులకు గతంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. అయితే ధరణి పోర్టల్‌లో వీరి వివరాలు పొందుపర్చలేదు. ఈ మేరకు సదరు సమస్య పరిష్కరించాలని తహసీల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ మేరకు తహసీల్దారు, సర్వేయర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల వివరాలు సేకరించి కొంతమందివి ఆన్‌లైన్‌ పూర్తిచేశారు. 100 మంది ఇంకా వివరాలు నమోదు చేయాల్సి ఉంది. దీంతో వారు పండించిన ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు రైతుబంధు, తదితర పథకాలు కూడా వర్తించడం లేదు. ఇక చివరకు శనివారం ఆయా రైతులందరూ కలిసి తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాన్సువాడ కిష్టయ్య నేను చచ్చేదే మేలంటూ పురుగు మందు సీసా తీసి తాగడానికి యత్నించాడు. అక్కడున్న వారు గమనించి వెంటనే పురుగు మందు సీసాను లాక్కోని పడేశారు. అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లి తహసీల్దారు సాయాగౌడ్‌ను నిలదీశారు. డబ్బిచ్చిన వారివే ఆన్‌లైన్‌ చేశారంటూ ఆరోపించారు. దీనికి ఎవరి వద్ద డబ్బు తీసుకోలేదని, నేను రాకముందే రైతుల వివరాలు సేకరించారని గుర్తుచేశారు. కొందరు వారి కుటుంబీకుల పేర్లు నమోదు చేయాలని అర్జీలు ఇవ్వడంతో పార్ట్‌-బీలో పెట్టామని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కర్షకులు ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని