logo

రోడ్లు, కాలుష్య సమస్యలపై జనాగ్రహం

తాండూరులో అధ్వానంగా మారిన రహదారులు, తీవ్ర కాలుష్య సమస్యలపై జనం రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు రాజకీయాలకు

Published : 05 Dec 2021 00:36 IST

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ● ఎమ్మెల్యే హామీతో విరమణ

ధర్నా చేస్తున్న స్థానికులు

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: తాండూరులో అధ్వానంగా మారిన రహదారులు, తీవ్ర కాలుష్య సమస్యలపై జనం రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాలు, విద్యార్థి, వ్యాపార, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నాయకులు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ ఆందోళనను శాంతియుతంగా నిర్వహిస్తామని అనుమతి ఇవ్వాలని రెండు రోజుల కిందట పోలీసులను కోరినా స్పందించక పోవటంతో ధర్నాకు దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. శిబిరంలో పలువురు మాట్లాడారు. రోడ్లు పాడై పోయి ప్రమాదకరంగా మారి దుమ్ము ధూళి, వాతావారణ కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు.

తీవ్ర వాగ్వాదం: ఆందోళనచేస్తున్న వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. తమను బలవంతగా తరలించారని ఆయా సంఘాల ప్రతినిధులు అక్కడా ఆందోళన కొనసాగించారు. మిగతా వారు సమీపంలోని ఇందిరా గాంధీ కూడలిలో మళ్లీ ఆందోళన చేపట్టారు. స్టేషన్‌కు తీసుకు వెళ్లిన వారిని వెంటనే వదిలి పెట్టాలని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని ఇక్కడికి రప్పించాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో స్టేషన్‌ నుంచి ప్రతినిధులను తీసుకు రావాలని ఆయన పోలీసులను ఆదేశించారు. వారిని వెంటనే వదిలి పెట్టారు. ఆందోళనను విరమించటానికి జనం ససేమిరా అన్నారు. రోడ్డు మీద వచ్చి పోయే వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేయటంతో మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, చించోళి మార్గంలో రాకపోకలు స్తంభించి పోయాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిలోగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని