logo
Published : 05/12/2021 00:36 IST

మెరిసిన పల్లె కుసుమాలు

జాతీయ స్థాయి కళాఉత్సవ్‌ పోటీలకు పలువురు ఎంపిక

న్యూస్‌టుడే, మెదక్‌, చేగుంట, శివ్వంపేట, హత్నూర, వికారాబాద్‌ టౌన్‌

అభిరుచికి ప్రతిభ తోడైతే గెలుపు ఇట్టే సాధ్యం.. ఇష్టమైన రంగంలో రాణించాలంటే ఎంతో శ్రమ అవసరం.. ఈ దిశగా అడుగేసి విజేతలుగా నిలవడం విశేషం. ఇటీవల కళాఉత్సవ్‌ పోటీలను వివిధ స్థాయిలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. ముందుగా మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. గత నెలలో సదరు పోటీలు జరగ్గా ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో వారిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

దరువు వేశారంటే..

ఆ విద్యార్థిని దరువు వేయడంలో మంచి నేర్పరి. అందులో తనకు తానే సాటి. ఎలాంటి దరువునైనా అవలీలంగా మోగించడం ఆమెకు సులువే. ఎడమ చేతివాటంతో వాయిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. చిన్నతనంలో ఏర్పడిన ఇష్టంతో ముందడుగు వేసి రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ విద్యార్థినే నర్సాపూర్‌ మండలం జాన్‌ఖాన్‌పేటకు చెందిన మన్నె జగన్‌, శశికళ దంపతుల కుమార్తె అక్షయ. ప్రస్తుతం ఈ కుటుంబం హత్నూర మండలం దౌల్తాబాద్‌లో నివాసముంటోంది. అక్షయ హత్నూర కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నారు. ఆమెలోని తృష్ణను గుర్తించిన ఉపాధ్యాయులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించారు. దీంతో కళా రంగంలో తన ప్రతిభను చాటుతూ ఎదుగుతున్నారు. దరువుకు అనుగుణంగా అడుగులేస్తూ వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. గత నెలలో సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి పొటీల్లో జడ్జిల ప్రశంసలు అందుకొని జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఉపాధ్యాయుల కృషి, ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో ఈ స్థానానికి చేరానని, జాతీయ స్థాయిలో ఇదే స్ఫూర్తిగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని చెబుతున్నారు అక్షయ.


ఆసక్తితో అడుగేసి..

శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కర్రె సందీప్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇతడి తల్లిదండ్రులు రేణుక, బాబు. వీరికి ముగ్గురు సంతానం కాగా, కూతురు మీన, కుమారులు సందీప్‌, నిఖిల్‌. అమ్మానాన్నలు కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జానపద వాయిద్యం డప్పు కొట్టడమంటే సందీప్‌కు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఆ ఆసక్తితో ముందుగా సొంతంగా నేర్చుకున్నాడు. ఇతడి అభిరుచిని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరాజయ్య, ఉపాధ్యాయురాలు ఇందుమతి మరింత ప్రోత్సహించారు. ఇదే క్రమంలో గజ్వేల్‌కు చెందిన డోలక్‌ యాదయ్య వద్ద శిక్షణ ఇప్పించారు. అందుకు వారే ఆర్థిక సాయం చేయడం గమనార్హం. ఇలా వారి సహకారంతో మెలకువలు నేర్చుకున్న సందీప్‌.. చిన్నశంకరంపేట ఆదర్శ పాఠశాలలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు. తద్వారా జాతీయ స్థాయికి ఎంపికై తన ప్రతిభ చాటడం విశేషం.


సుమధుర గాయని ‘శర్వాణి’

శర్వాణి.. పాట పాడిందంటే అక్కడి నుంచి కదలకుండా వినాల్సిందే. నిరంతర సాధన, ఆసక్తితో ఈ దిశగా అడుగేసిన ఈ అమ్మాయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈమె స్వగ్రామం మెదక్‌ జిల్లా నార్సింగి. తల్లిదండ్రులు సరస్వతి, లక్ష్మణాచారి. తల్లి గృహణి కాగా, తండ్రి టీవీ మెకానిక్‌. శర్వాణికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రస్తుతం రామాయంపేటలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మూడో తరగతి నుంచి పాటలు పాడటం నేర్చుకున్న ఈ గాయని వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నారు. గత నెలలో చిన్నశంకరంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్‌ పోటీలో పాల్గొని మంత్రముగ్ధుల్ని చేసి ఏకంగా జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బాలగాయనిగా రాణిస్తున్న సమయంలో ఈమెను ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. 2018లో ‘ఈటీవీ’ పాడుతా తీయగా కార్యక్రమంలో పాటలు పాడి గానగంధర్వుడు ఎస్పీ బాలు ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ సంగీత శిక్షకులు రామాచారి శిష్యరికంలో మరింత రాటుదేలారు. వీణ వద్ద కర్ణాటక, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. ఇల్లు కూడా సరిగా లేకపోవడంతో కొత్త ఇంటి నిర్మాణానికి రామాచారి ఆర్థిక సాయం చేశారు. ఇటీవల శర్వాణి పాడిన ఓ పాటను విన్న మంత్రి కేటీఆర్‌ ప్రశంసిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, ఎస్‌ఎస్‌ తమన్‌కు ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన దేవిశ్రీప్రసాద్‌ ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమంలో పాడే అవకాశం ఇచ్చారు. త్వరలోనే ఆయన సంగీత దర్శకత్వంలో పాట పాడనున్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహం, గురువుల సహకారంతో మరింత ముందుకు సాగుతానని, సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా సత్తా చాటుతానని చెబుతున్నారు ఈ గాయని.


నృత్యం అదరహో..

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఈ గిరి పుత్రిక. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎన్‌.సవితకు నృత్యం అంటే ఎంతో ఆసక్తి. ఇష్టంతో నేర్చుకొని ముందుకు సాగారు. ఉపాధ్యాయుల సహకారంతో జిల్లా కేంద్రం వికారాబాద్‌ డైట్‌ కళాశాలలో నవంబరు 23 నుంచి 26 వరకు జరిగిన రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గన్నారు. లంబాడీ నృత్యంతో అదరగొట్టాడారు. ఇలా జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. మరోవైపు చదువులోనూ ఈ విద్యార్థిని ముందు స్థానమే కావడం గమనార్హం. మారుమూల గ్రామం చాకల్‌పల్లి తండా ఈమె స్వగ్రామం. రవాణా సౌకర్యం సరిగా లేని ఈ ప్రాంతం నుంచి కాలినడకన బడికి వచ్చి వెళ్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని చెబుతున్నారు ఈ విద్యార్థిని.


 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని