logo

అక్రమ నిర్మాణాలపై కన్నెర్ర

దాదాపు రూ.300 కోట్ల విలువైన ప్రాజెక్టు.. 300 పైగా విల్లాలున్నాయి. పంచాయతీ నుంచి నిర్మాణ అనుమతి తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. ఇందులో కొన్ని చెరువు బఫర్‌ జోన్‌లో ఉన్నాయి.

Published : 05 Dec 2021 01:50 IST

260 విల్లాలు సీజ్‌ చేసేందుకు కలెక్టర్‌ ఆదేశం

నలుగురు పురపాలక కమిషనర్లపై చర్యలకూ సిఫార్సు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, దుండిగల్‌, న్యూస్‌టుడే

మల్లంపేటలో నిర్మించిన విల్లాను సీజ్‌ చేసిన అధికారులు

దాదాపు రూ.300 కోట్ల విలువైన ప్రాజెక్టు.. 300 పైగా విల్లాలున్నాయి. పంచాయతీ నుంచి నిర్మాణ అనుమతి తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. ఇందులో కొన్ని చెరువు బఫర్‌ జోన్‌లో ఉన్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.హరీశ్‌ సమగ్ర విచారణ చేయించగా.. అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చింది.

పంచాయతీ అనుమతుల పేరుతో..

2018 సంవత్సరానికి ముందు మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. 2018-19లో దుండిగల్‌ పురపాలక సంఘం ఏర్పడగా అందులో భాగమైంది. ఆ సమయంలో మల్లంపేటలో ఓ స్థిరాస్తి సంస్థ 15 ఎకరాల్లో విల్లాలు మొదలుపెట్టింది. 65 విల్లాలకు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని మరో 260 అక్రమంగా మొదలుపెట్టింది. కత్వ చెరువు ఎఫ్‌టీఎల్‌లో రోడ్లు, బఫర్‌ జోన్‌లో కొన్ని విల్లాలు నిర్మించినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. సాగునీటి శాఖ ఈఈ విచారణ చేపట్టి, దుండిగల్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు.

కలెక్టర్‌ రంగప్రవేశంతో...

పోలీసులు, పురపాలిక అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మేడ్చల్‌ కలెక్టర్‌ హారీశ్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన విచారణ చేయగా ఏడు విల్లాలు చెరువు బఫర్‌ జోన్‌లో ఉన్నట్లు తేలింది. వాటి కూల్చివేతలు చేపట్టగా స్థిరాస్తి సంస్థ కోర్టు నుంచి స్టే తెచ్చుకొంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ హరీష్‌, మేడ్చల్‌ జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, డివిజనల్‌ పంచాయతీ అధికారి స్మిత తదితరులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు. పంచాయతీ అనుమతులూ నకిలీవని, అప్పట్లో ఉన్న పంచాయతీ అధికారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించినట్లు తేల్చారు. తక్షణం అనుమతులు లేని 260 విల్లాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు. శనివారం దుండిగల్‌ పురపాలక కమిషనర్‌ భోగిశ్వర్లు, పట్టణ ప్రణాళిక ఇన్‌ఛార్జి సాయిబాబా ఆధ్వర్యంలో సిబ్బంది 100 విల్లాలను సీజ్‌ చేశారు. మిగిలిన వాటిని ఆది, సోమవారాల్లో సీజ్‌ చేస్తామన్నారు. ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఉన్న నలుగురు మున్సిపల్‌ కమిషనర్లపై శాఖాపరమైన చర్యలు, అంతకు ముందున్న పంచాయతీ కార్యదర్శులపై శాఖాపరమైన, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. విల్లాలు కొనుగోలు చేసిన అనేక మంది ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని