logo

కొత్త కారు.. అమ్మకాల జోరు

గ్రేటర్‌లో వాహన విక్రయాల జోరు పెరిగింది. కొవిడ్‌తో 2020లో మందగించిన కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలు కొన్ని నెలలుగా భారీగా పెరిగాయి. దీంతో కొవిడ్‌కు ముందున్న పరిస్థితులు తిరిగి

Published : 05 Dec 2021 01:50 IST

ఫీజుల రూపంలో ఆర్టీఏకు కాసుల పంట

ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌లో వాహన విక్రయాల జోరు పెరిగింది. కొవిడ్‌తో 2020లో మందగించిన కార్లు, ద్విచక్ర వాహనాల విక్రయాలు కొన్ని నెలలుగా భారీగా పెరిగాయి. దీంతో కొవిడ్‌కు ముందున్న పరిస్థితులు తిరిగి నెలకొంటున్నాయి. కొన్ని నెలలుగా రవాణాశాఖకు పెరుగుతున్న ఆదాయమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది అక్టోబరు వరకు గ్రేటర్‌లో మూడు జిల్లాల పరిధిలో రవాణాశాఖ ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే భారీగా పెరిగింది. రంగారెడ్డి రవాణాశాఖకు అత్యధికంగా రూ.470.41 కోట్లు సమకూరింది. ఆదాయంలో ప్రధానంగా జీవితకాల పన్నులు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, సేవా రుసుంలు, జరిమానాలదే ఎక్కువ శాతం. రెండో దశ తగ్గిన తర్వాత నెమ్మదిగా వాహన మార్కెట్‌ పుంజుకుంది. కరోనాతో చాలామంది ప్రజారవాణా కంటే వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపించడం కూడా వాహనాల అమ్మకాల పెరుగుదలకు కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. అద్దె కార్లలో తిరిగే కంటే ఈఎంఐతో కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే అప్పులు ఇచ్చేందుకు ముందుకు వస్తుండటంతో చాలామంది కార్లు కొనుగోలు చేస్తున్నారని ఓ అధికారి తెలిపారు.

కారణాలివే.. గతంలో ప్రధాన నగరంలో ఎక్కువ ఆదాయం సమకూరేది. ప్రస్తుతం శివార్లలో ఉన్న అత్తాపూర్‌, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌, షాద్‌నగర్‌ ఇతర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. శివార్లలో భూముల ధరలు పెరగడం ఒక కారణమైతే చాలామంది విల్లాలు, వ్యక్తిగత గృహాలు కొనుగోలు చేస్తున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వచ్చేందుకు తప్పనిసరిగా వ్యక్తిగత వాహనాల అవసరం ఉంది. దీంతో కార్లు కొనుగోలు చేస్తున్నారు.

లగ్జరీ వాహనాలు, నంబర్లకు..

ఇక గ్రేటర్‌లో లగ్జరీ కార్ల వాడకం గతంతో పోల్చితే పెరిగిందని అధికారులు చెబుతున్నారు. సినిమా, రాజకీయ, స్థిరాస్తి, ఉన్నత సంస్థల్లో పనిచేసే వారు ఎక్కువ శాతం లగ్జరీ కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. కొన్ని అరుదైన విదేశీ కార్లు సైతం నగరంలో అమ్ముడు పోతున్నాయి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం రూ.10 లక్షల విలువ దాటిన కారుకు 14 శాతం పన్ను చెల్లించాలి. ఇక రూ.10 లక్షల కంటే తక్కువ ఉంటే 12 శాతం కట్టాలి. ఫ్యాన్సీ నంబర్ల పేరుతో భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇటీవలి ఓ కుర్ర హీరో 9999 నంబరు కోసం ఏకంగా రూ.10 లక్షలు వెచ్చించారు. కార్ల విలువ పెరిగే కొద్దీ పన్నులు, ఫ్యాన్సీ నంబర్ల పేరుతో ఆర్టీఏకు కాసుల పంట పండుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని