logo
Published : 06/12/2021 02:27 IST

పట్టు సాధించు... ఉపాధి చేపట్టు..!

ఆంగ్లం, కంప్యూటర్‌ పరిజ్ఞానంపై అవగాహన
ఈడబ్ల్యూఆర్‌సీ ఆధ్వర్యంలో శిక్షణ
గ్రామీణ యువతకు అవకాశం

తరగతుల నిర్వహణ

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: ‘మంచి ఉద్యోగంలో చేరాలి.. జీవితంలో తొందరగా స్థిరపడాలి..’ ఇదే నేటి యువత లక్ష్యం. దీన్ని చేరుకోవాలంటే ఉన్నత చదువులు కూడా ఉండాలి. అదే సమయంలో ఉద్యోగ సాధనలో వెనుకబడకూడదు. జీవనోపాధి కోసం ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటే కుదరదు. ప్రైవేటులో లేదా స్వయం ఉపాధి రంగాన్నయినా ఎంచుకోవాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యానికే ప్రాధాన్యం.  ఉద్యోగం దక్కించుకోవాలంటే నైపుణ్యాభివృద్ధికి శిక్షణ తీసుకోవడం తప్పనిసరి. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో ఉపాధికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ విషయంలో పట్టణ, నగర యువత ఒకడుగు ముందుంటున్నా గ్రామీణ యువత దగ్గరకు వచ్చే సరికే అసలు సమస్య ఎదురవుతోంది. అటు ఇంగ్లిష్‌పై పట్టు లేకపోవడం, కంప్యూటర్‌, ఇతర సాంకేతిక విభాగాల్లో తగిన నైపుణ్యం పొందక పోవడం వంటి కారణాలతో ఉద్యోగ సాధనలో వెనుకబడి పోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

పాత డీఆర్‌డీఏ కార్యాలయంలో...

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ద్వారా సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో ‘ఇంగ్లిష్‌ వర్క్‌ రెడీనెస్‌ అండ్‌ కంప్యూటర్‌ శిక్షణ (ఈడబ్ల్యూఆర్‌సీ) కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత శిక్షణ పొందేందుకు అర్హులు. పదో తరగతి విద్యార్హత ఉండాలి. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తారిక్కడ. వయస్సు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.  

కంప్యూటర్‌ శిక్షణలో..

ఇప్పుడు తప్పనిసరి అయ్యాయి

ఆంగ్లంపై పట్టు...కంప్యూటర్‌ పరిజ్ఞానం.. ఇవి రెండూ ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా తప్పనిసరి. వీటిలో నైపుణ్యం ఉన్న వారికి ఉపాధికి ఇబ్బంది లేదు. ఈడబ్ల్యూఆర్‌సీలో ఇదే చేస్తున్నారు. ఈ కేంద్రంలో చేరిన అభ్యర్థులకు ఆంగ్లంపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. ఆంగ్లంలో మాట్లాడటం, రాయడంలో మెలకువల్ని నేర్పిస్తున్నారు. పరీక్షలు సైతం నిర్వహిస్తూ వారిని ప్రతిభాన్వితులుగా తీర్చిదిద్దుతున్నారు. కంప్యూటర్‌ వినియోగంపై కూడా శిక్షణ ఇస్తున్నారు. పరిశ్రమలు, సంస్థల అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్‌లో వివరాల నమోదు, గణాంకాలు ఎలా అన్న అంశాలను వివరిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు సైతం కల్పిస్తున్నారు.

బాలికల వసతి.. ఇక్కడే ప్రత్యేకం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈడబ్ల్యూఆర్‌సీ శిక్షణ కేంద్రాలు ఉన్నా ఎక్కడా బాలికలకు సరైన వసతి సదుపాయాలు లేవు. సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో బాలికల వసతికి అవసరమైన సదుపాయాలన్నీ ఉండటం విశేషం. దీంతో ఇక్కడ చేరేందుకు ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు వికారాబాద్‌కు చెందిన వారు సైతం ఆసక్తి చూపుతున్నారు. శిక్షణకు ఎంపికైన వారికి వసతితోపాటు దుస్తులు, విద్యా సామగ్రి, భోజనం తదితరాలు ఉచితంగానే అందిస్తున్నారు.

నైపుణ్య పెంపుదలకు ప్రాధాన్యం : శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సంగారెడ్డి

ఈడబ్ల్యూఆర్‌సీలో శిక్షణకు ఎంపికైన వారికి నైపుణ్యాల మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కోర్సులో భాగంగా ఆంగ్లంపై పట్టు సాధించేలా చూస్తున్నాం. కంప్యూటర్‌పై పనిచేయడంలో కావాల్సిన మెలకువలపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో 100 పనిదినాలు పూర్తిచేసుకున్న కుటుంబాలకు కూడా ఉన్నతి పేరుతో శిక్షణ ఇస్తున్నాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని