logo

కంప్యూటరు తరగతి.. ప్రారంభిస్తే పురోగతి

సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు తెలియాలంటే ప్రాథమిక దశ నుంచే వారికి విగణితలపై అవగాహనతోపాటు, ఆంగ్లబోధన ఎంతో అవసరం. పేదలు సైతం తమ పిల్లలకు కంప్యూటరు రావాలని అభిలషిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం ఎంపీ లాడ్స్‌ ఇతర పథకాల

Updated : 06 Dec 2021 06:40 IST

చిట్యాల పాఠశాలలో నిరుపయోగంగా..

న్యూస్‌టుడే,పరిగి: సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు తెలియాలంటే ప్రాథమిక దశ నుంచే వారికి విగణితలపై అవగాహనతోపాటు, ఆంగ్లబోధన ఎంతో అవసరం. పేదలు సైతం తమ పిల్లలకు కంప్యూటరు రావాలని అభిలషిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం ఎంపీ లాడ్స్‌ ఇతర పథకాల కింద కోట్లాది రూపాయలను వెచ్చించి పంపిణీ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్వహణ లోపం ప్రధాన అవరోధంగా మారింది. ఎప్పకటిప్పుడు పర్యవేక్షిస్తూ సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు వాటి గురించి విస్మరించారు. ఈ పథకాన్ని గాడిన పెట్టేందుకు అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విద్యాశాఖ గతేడాది వాటి పనితీరును తెలుసుకునేందుకు పాఠశాలల వారీగా సమాచార సేకరణ చేపట్టింది. మరమ్మతుకు అయ్యే ఖర్చెంత? లేదా కొత్తవి పంపిణీ చేయాలా అన్న కోణంలో పరిశీలించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కరోనా నేపథ్యంలో వాటి విషయం మళ్లీ మరుగున పడింది.

తాండూరు, పరిగి, కొడంగల్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో 748 ప్రాథమిక, 118 ప్రాథమికోన్నత, 156 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆరు గురుకులాలు, 11 ఎయిడెడ్‌, 9 ఆదర్శ, మరో మూడు మైనార్టీ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో 95వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కంప్యూటర్ల వినియోగం, మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం వెనుకబడినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక గతంలోనే వెల్లడించింది. కనీసం ఇప్పుడైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.

మరమ్మతుకు రూ.1.37కోట్లు

జిల్లాలో 18 మండలాల్లోని 160 పాఠశాలలకు గతంలో కంప్యూటర్లు పంపిణీ చేశారు. బోధకుల నియామకం లేకపోవడం, వినియోగించకపోవడంతో అవన్నీ ఉపయోగంలో లేకుండా పోయాయి. ఒక్కో కంప్యూటరుకు ప్రభుత్వం రూ.50వేల వరకు ఖర్చు చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న వాటి సంఖ్యను వేళ్లమీద లెక్కించాల్సిందే. కొన్నిచోట్ల కీబోరుల్డు, సీపీయూ, మదర్‌బోర్డు, ర్యాంలు, మౌస్‌లు పనిచేయడం లేదు. జిల్లా విద్యాశాఖ వాటిని బాగు చేసేందుకు దాదాపు రూ.1.37 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. మరమ్మతు చేసినా, కొత్త వాటిని సరఫరా చేసినా వాటి నిర్వహణే ప్రధానం. కంప్యూటరు విద్యను ప్రారంభించిన మొదట్లో విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకున్నారు. వారికి ఆసక్తి ఉన్నా ప్రోత్సాహలేమి వారిని తీవ్ర నిరాశ,నిస్పృహలకు గురిచేస్తోంది. ల్యాబ్‌లు దుమ్ము పట్టిపోతున్నాయి. అదే ప్రైవేట్‌ పాఠశాలల్లో మాత్రం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులను కంప్యూటరు విద్యపై ఆకర్షితులను చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటోంది.

ఇలా చేస్తే బాగు

* పాఠశాలల వారీగా బోధకులను నియామకం ః వారికి క్రమం తప్పకుండా గౌరవ వేతనం  

 * ప్రతి పాఠశాలకు అంతర్జాల సదుపాయం 

 * కనీసం రోజుకు ఒక గంట పాటు బోధన 

 * పాత వాటి నిర్వహణ కన్నా, కొత్తవి పంపిణీ చేయడం 

* ల్యాబ్‌ల్లో సదుపాయాల కల్పన

* గ్రామీణ యువత ఆధ్వర్యంలో నిర్వహణ.

ఇవిగో ఉదాహరణలు

* పరిగి జడ్పీహెచ్‌ఎస్‌ నం.1 పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 545. పంపిణీ అయిన కంప్యూటర్లు 20. పనిచేస్తున్నవి 2.

* చిగురాల్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 137 మంది విద్యార్థులు. ఐదు కంప్యూటర్లలో ఒక్కటీ పనిచేయడం లేదు.

* ఇబ్రహీంపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలకు ఐదు కంప్యూటర్లు పంపిణీ చేయగా వీటిలో రెండు గడిసింగాపూర్‌ ఉన్నత పాఠశాలకు రెండింటిని తీసుకువెళ్లారు. మిగతావి మరమ్మతుకు గురయ్యాయి.

* ఖుదావంద్‌పూర్‌ పాఠశాలలో 92 మంది విద్యార్థులు. ఐదు కంప్యూటర్లు ఉన్నా ఏవీ పనిచేయడం లేదు.

* మిట్టకోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండు ఉన్నా ప్రయోజనం శూన్యం.

* చిట్యాల ఉన్నత పాఠశాలలో 11 విగణితలు ఉండగా మూడేళ్లుగా ఒక్కటీ పనిచేయడం లేదు.

* రాపోల్‌ ఉన్నత పాఠశాలలో రెండు వృథాయే.

ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి: హరిశ్చందర్‌, ఎంఈఓ, పరిగి

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేస్తున్న ఎంఐఎస్‌ల ద్వారా అప్‌డేట్‌ చేస్తాం. వారి సహకారంతో పాఠశాలల్లో కంప్యూటర్లు వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని