logo

పత్తి రైతుకు నిరాశ

జిల్లాలో పత్తి కొనుగోలు విషయంలో వ్యాపారులు సిండికేట్‌గా మారారు. వారు ఎంత చెబితే అంత ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే మంటే మీకు ప్రభుత్వం ప్రకటించిన రూ.6,025 మద్దతు ధర కంటే ఎక్కువే చెల్లిస్తున్నామని దబాయిస్తున్నారు.

Published : 06 Dec 2021 02:27 IST

ధర తగ్గించిన వ్యాపారులు


పెద్దేముల్‌ తండాలో నిల్వ చేసిన పత్తి సంచులు

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో పత్తి కొనుగోలు విషయంలో వ్యాపారులు సిండికేట్‌గా మారారు. వారు ఎంత చెబితే అంత ధరకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే మంటే మీకు ప్రభుత్వం ప్రకటించిన రూ.6,025 మద్దతు ధర కంటే ఎక్కువే చెల్లిస్తున్నామని దబాయిస్తున్నారు. నాణ్యత నామమాత్రంగా ఉన్న క్వింటా పత్తికి నెల రోజుల కిందట దళారులు రూ.8,000 నుంచి రూ.8,300 వరకు తీసుకున్నారు. ఈ పరిణామం ప్రయోజనకరంగా ఉందని రైతులు భావించారు. ఎక్కువ ధర వస్తే తమ ఇబ్బందులు తీరుతాయని సంతోషించారు. తీరా పూర్తిగా తగ్గించడంతో నిరాశకు గురవుతున్నారు.

రెండోసారి నాణ్యంగా ఉన్నా..: మొదటి సారి ఏరిన పత్తి కంటే ప్రస్తుతం రెండో విడతలో తీస్తున్నది నాణ్యతగా ఉంది. దీనికే ఎక్కువ ధర పలకాలి. అయితే వ్యాపారులు ఒక్కటై పోవడంతో చెప్పిన ధరకే రైతులు విక్రయించక తప్పడం లేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3లక్షల నుంచి 6 లక్షల క్వింటాళ్ల తెల్లబంగారాన్ని విక్రయించారు. మొదట్లో తొంబై వేల నుంచి లక్ష క్వింటాళ్ల వరకు మంచి ధరనే ఇచ్చారు. ఇది మంచి పరిణామమని నాణ్యమైన పత్తికి మరింత ధర పలుకుతుందని భావించి, చాలా మంది రైతులు ఇళ్లల్లో నిల్వ చేశారు. వ్యాపారులు ఒక్కటి కావడంతో, ధర పెరగక పోగా, తగ్గుతుండంతో నిల్వ చేసినా ప్రయోజనం లేదని తరలిస్తున్నారు.

తాండూరు విపణిలో..: తాండూరు వ్యవసాయ విపణి పరిధిలో రైతులు శుక్రవారం 2000 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. ఇందులో ఎక్కువ శాతం రూ.6,310 నుంచి రూ.7,736 ధర లభించింది. పరిమిత క్వింటాళ్లకు మాత్రమే వ్యాపారులు రూ.8,000 చొప్పున చెల్లించారు.

అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నా..: అంతర్జాతీయంగా పత్తికి ఈ సారి మంచి డిమాండే ఉంది. ఒక్కో బేల్‌ ధర రూ.60,000 పైనే పలుకుతోంది. ఇలాంటి పరిస్థితిలో రైతుల నుంచి కొనుగోలు చేసేదానికి ఎక్కువ ధర పలకాలి. కాని అది జరగడం లేదు. వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ లాభంతో గుజరాత్‌, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు. ప్రారంభంలో పోటీ పడిన వ్యాపారులు, ఇపుడేమో తాము చెప్పిన ధరకే అమ్మాలని స్పష్టం చేస్తున్నారు. చేసేది లేక వారు నిర్ణయించిన ధరకే అమ్ముతున్నారు.

డిమాండ్‌ సప్లయ్‌ని బట్టే ఉంటుంది: రాజేశ్వరీ, తాండూరు విపణి ప్రత్యేక శ్రేణి కార్యదర్శి

పత్తికి డిమాండ్‌ సప్లయ్‌ని బట్టే వ్యాపారులు ధర నిర్ణయిస్తున్నారు. ఎక్కువగా ఉన్నపుడు ధర అధికంగా ఉంటోంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతికి లేనపుడు తగ్గుతున్నాయి. ఇది రైతులు విక్రయించే పత్తిపై ప్రభావం చూపుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని