logo

అప్పుల బాధతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు, యువకుడి బంధువుల వివరాల మేరకు... కర్ణాటకకు చెందిన అవినాష్‌ ఖర్గే(26) కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితం శివరాంపల్లికి వచ్చి స్థిరపడ్డారు.

Published : 06 Dec 2021 07:07 IST

26న పెళ్లి అంతలోనే అనంతలోకాలకు..

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు, యువకుడి బంధువుల వివరాల మేరకు... కర్ణాటకకు చెందిన అవినాష్‌ ఖర్గే(26) కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితం శివరాంపల్లికి వచ్చి స్థిరపడ్డారు. ముగ్గురు సోదరులతో పాటు తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నారు. అవినాష్‌ ఖర్గే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 26వ తేదీన అవినాష్‌కి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతడు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడు. నాలుగు నెలలుగా వాటిని సక్రమంగా చెల్లించట్లేదు. బ్యాంకుల నుంచి రుణం చెల్లించాలని ఒత్తిడి వస్తోంది. ఈ విషయంపై తన సోదరుడి దగ్గర వాపోయాడు. పెళ్లి తరువాత బ్యాంకు రుణాల గురించి చర్చిద్దామనుకున్నారు. ఈలోపే ఒత్తిడి తట్టుకోలేక అవినాష్‌ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చాక గమనించిన కుటుంబ సభ్యులు.. రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అన్న సంతోష్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఊళ్లోనే బతుకుదామన్న భార్య.. భర్త కాదనడంతో బలవన్మరణం

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ గృహిణి కన్నుమూసింది. మారేడుపల్లి ఠాణా ఎస్సై రవికుమార్‌ వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన నాగేశ్వర్‌రావు, దేవి(26) దంపతులు కుమార్తె శ్రావ్య(4) కుమారుడు సాత్విక్‌(15నెలలు)తో కలిసి ఏడాదిగా వెస్ట్‌ మారేడుపల్లిలో ఉంటున్నారు. వీరి పెద్దకుమార్తె వైష్ణవి స్వగ్రామంలోని తాతయ్య వద్ద ఉంటోంది. వీరి పక్కింట్లోనే దేవి అక్క నందిని, బావ శ్రీను ఉంటున్నారు. నాగేశ్వర్‌రావు స్థానికంగా ఓ కంటి ఆసుపత్రిలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. దేవి గృహిణి. కొద్దిరోజులుగా ఆమె స్వగ్రామానికి వెళ్లి అక్కడే ఏదో పనిచేసుకొని బతుకుదామని పట్టుపడుతోంది. భర్త నిరాకరించడంతో గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమె మనస్తాపానికి గురవుతోంది. శనివారం ఉదయం భర్త 9:30 గంటల ప్రాంతంలో విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దేవి ఇంట్లోకి వెళ్లి గడియవేసుకుంది. పక్కింట్లో ఉన్న నందిని చూసి నిద్రపోవడానికి వెళ్లిందేమో అనుకుంది. కొంతసేపటికి సాత్విక్‌ ఏడుపు వినిపించడంతో కిటికీలోంచి చూసేసరికి దేవి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంటూ కనిపించింది. నందిని అరుపులు విన్న శ్రీను తలుపులు బద్ధలుగొట్టి దేవిని కిందకు దింపారు. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.


భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: భవనంపై ప్రకటనల బోర్డు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పిర్జాదిగూడకు చెందిన వీరస్వామి(35) ఆదివారం ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌లోని ఓ భవనం మొదటి అంతస్తుపై ప్రకటన బోర్డు బిగిస్తుండగా కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఇతడిని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. యజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణమని, పని చేస్తున్న చోట రక్షణ చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోయారు. వీరస్వామి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని