Ts News: తెలంగాణలో ఉద్యోగుల విభజన ప్రక్రియకు విధివిధానాలు ఖరారు

కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ

Published : 06 Dec 2021 15:16 IST

ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ

హైదరాబాద్‌: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన జరగనుంది. ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా శాఖల జిల్లా అధిపతులను సభ్యులుగా నియమించింది. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల కార్యర్శులు, శాఖాధిపతులు, ఆర్థికశాఖ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇతర సీనియర్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకొని సీనియారిటీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టనున్నారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉంటుంది. ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతానికి పైగా సమస్య ఉన్న దివ్యాంగులకు, పిల్లల్లో మానసిక దివ్యాంగులు ఉన్న ఉద్యోగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ ప్రారంభించనున్న ప్రభుత్వం.. మిగతా జిల్లాల్లో కోడ్ అనంతరం ప్రక్రియ చేపట్టనుంది. విభజన, కేటాయింపులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాలు రెండు చొప్పున పాత జిల్లాల నుంచి ఏర్పడ్డాయి. జోనల్, మల్టీజోనల్‌కు సంబంధించి కూడా ఈ తరహా అంశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేటగిరీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ విధివిధానాలను ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని