logo
Published : 07/12/2021 01:22 IST

మురుగులో కాసుల వేట!

సిబ్బందే గుత్తేదారులుగా మారుతున్న వైనం
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

వికారాబాద్‌ అగ్నిమాపక కేంద్రం ఎదుట మరమ్మతు చేపడుతున్న సిబ్బంది

* వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధి భూగర్భ మురుగు నీటి సరఫరా వ్యవస్థలో మ్యాన్‌హోల్‌ మూతల మరమ్మతుకు పారిశుద్ధ్య కార్మికులతో పనులు చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ డ్రిల్లింగ్‌ యంత్రాలను వినియోగించి, గుత్తేదారుని పేరిట ఎంబీలు రాయిస్తున్నారు. ఇలా పనులను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలుగా విభజించి సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


* మరో కాలనీలో మున్సిపల్‌ సిబ్బందితో 50 మీటర్ల మురుగు పైపులైన్‌ పనులు చేయించారు. దీనికీ బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.


* ఏడాదిన్నర కిందట వికారాబాద్‌ ఓ కాలనీలో భూగర్భ మురుగు నీటి పైపులైన్‌ వేయడానికి సిబ్బంది, పైపులు, జేసీబీ ఇతర అన్ని రకాలుగా మున్సిపాలిటీకి చెందిన వాటిని వినియోగించుకుని రూ.1.25 లక్షల వరకు బిల్లు చేసుకోవాలని ప్రయత్నించారు. ఈ విషయమై ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావడంతో నిలిపివేశారు.

చేసే పనులు పురపాలక సంఘానివే.. అక్కడ పనిచేసే సిబ్బందికి వేతనాలు చెల్లించేది మున్సిపాలిటీయే.. ఉపయోగించే పరికరాలూ ప్రభుత్వానివే.. అయినా బిల్లుల చెల్లించాలంటూ ఉద్యోగులే గుత్తేదారుగా మారారు. ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చినట్లు.. వారే పనులు చేసినట్లు నకిలీ బిల్లులు రికార్డు చేసి అందినంత జేబులో వేసుకుంటున్నారు. ఈ తతంగం అధికారులకు తెలిసినా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదంతాజిల్లా కేంద్రమైన వికారాబాద్‌ పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న కొంత మంది సిబ్బంది మాయాజాలం.

వికారాబాద్‌ పురపాలక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం శాటిలైట్‌ టౌన్‌షిప్‌గా గర్తించింది. భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరాకు రూ.190 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. టెండర్‌ దక్కించుకున్న సంస్థ పూర్తి స్థాయిలో పనులు చేపట్టకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం భూగర్భ మురుగు నీటి వ్యవస్థ నిర్వహణ పేరు చెప్పి కొంత మంది సిబ్బంది జేబులు నింపుకొంటున్నారు. ఇటీవల పట్టణంలో మ్యాన్‌హోళ్ల మరమ్మతు చేపట్టారు. ఈ సమయంలో పురపాలక యంత్రాలు ఉపయోగించి, సిబ్బందే పనులు చేశారు. రికార్డుల్లో మాత్రం గుత్తేదారు చేపట్టినట్లు ఎంబీలు రికార్డు చేసి, సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

భూగర్భ మురుగు నీటి పారుదల పైపులైన్‌ వేస్తూ..

పనుల్లో నాణ్యతా అంతంతమాత్రమే...
రాతి పొడి వాడటం వల్ల అవి నెల రోజులే బూడిద తొలగి గుంతలు పడుతున్నాయి. మరో వైపు సెప్టిక్‌ ట్యాంకుల నిర్వహణ, వాహనాల పనితీరులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రోజు ఎన్ని ట్యాంకులను శుభ్రం చేసినా, రెండు నుంచి మూడు చలానాలను పురపాలక సంఘానికి చెల్లించి, మిగతావి జేబులో వేసుకుంటున్నారని సమాచారం. చెత్త సేకరణ ఆటోల విషయంలో రోజు దస్త్రాల్లో చూపించే ఖర్చు, వాస్తవాలకు వ్యత్యాసం కనిపిస్తోంది. వాహనాలు నడిపించకుండానే డీజిల్‌ బిల్లులు తీసుకుంటున్నారని తెలుస్తోంది.


బిల్లులు నిలిపివేస్తాం
శరత్‌చంద్ర, పురపాలక సంఘం కమిషనర్‌

ఈ విషయమై విచారణ జరిపిస్తాం. పురపాలక సిబ్బందితో పనిచేసి పనులకు బిల్లులు పెట్టినట్లు గుర్తిస్తే, వాటిని రద్దు చేస్తాం. బాధ్యులైన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని