logo

కామాంధుడికి యావజ్జీవం

పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారిని కిడ్నాప్‌ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతి, లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం..

Published : 07 Dec 2021 01:22 IST

హైదరాబాద్‌: పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న చిన్నారిని కిడ్నాప్‌ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్జీ శివమారుతి, లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ కుటుంబం కూలీపని చేసుకుంటూ, లంగర్‌హౌస్‌లోని ప్రశాంత్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆ కుటుంబంలోని బాలిక(5), బాబు(9) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 2019 జులై 10న రాత్రి 8 గంటలకు బాలిక తల్లి ఠాణాకు వచ్చి.. పాఠశాలకు వెళ్లిన తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లంగర్‌హౌస్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. బాలికను ఓ వ్యక్తి తీసుకెళుతున్నటు స్పష్టంగా కనిపించింది. స్థానికులను విచారించగా.. సదరు వ్యక్తి వికారాబాద్‌ జిల్లా, కొడంగల్‌ మండలం, అంగడి రాయచూరు గ్రామానికి చెందిన ఫకీరప్ప(38) అని తేలింది. అతను కొద్ది రోజులుగా లంగర్‌హౌస్‌ పరిసరాల్లోని పాదబాటపై ఉంటున్నట్లు చెప్పారు. పోలీసులు వెంటనే అంగడి రాయచూరు గ్రామానికి చేరుకుని ఫకీరప్ప ఇంటిపై దాడి చేసి, బాలికను రక్షించారు. నిందితుడిపై అప్పటి ఎస్సై డి.శ్రీను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏసీపీ నరసింహారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, డీఐ యాదగిరిగౌడ్‌, ఎస్సైలు బాలస్వామి, నరేందర్‌ నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. అనంతరం పోలీసులు నాంపల్లిలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెష్షన్‌ జడ్జి కోర్డులో ఛార్జీషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం ఫకీరప్పకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.28వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బి.సురేష్‌ సోమవారం తీర్పుచెప్పారు. కోర్టులో ప్రభుత్వం తరఫున గంగాజీ కేసు వాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని