logo

సైనిక సంక్షేమ నిధి..చేయూత మన విధి

కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృ భూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజా క్షేమం కోసం నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శత్రు సైన్యం భారత

Published : 07 Dec 2021 01:22 IST

నేడు సాయుధ దళాల పతాక దినోత్సవం

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌ టౌన్‌, సిద్దిపేట టౌన్‌

విరాళాలు సేకరిస్తున్న ఎన్‌సీసీ వలంటీర్లు

కన్నవారికి.. ఉన్న ఊరికి దూరంగా ఉంటూ.. మాతృ భూమి రక్షణకు నిరంతరం సేవలందించేది సైనికులే. ప్రజా క్షేమం కోసం నిఘా నేత్రంతో విధులు నిర్వహిస్తారు. శత్రు సైన్యం భారత భూ భాగంలో అడుగు పెట్టకుండా పగలూ రాత్రి అనే తేడాలేకుండా శ్రమిస్తారు. యుద్ధం వస్తే శత్రు మూకలకు ఎదురొడ్డి పోరాడతారు. ఈ యజ్ఞంలో కొందరు కాళ్లు, చేతులు పోగొట్టుకుని దివ్యాంగులవుతారు. కొందరు కంటిచూపు కోల్పోతారు. మరికొందరు తమ ప్రాణాలనే త్యాగం చేస్తారు. దేశం కోసం ఇంత చేసిన వారికి చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. యుద్ధ భూమి నుంచి తిరిగి వచ్చిన సైనికులకు, వితంతువులు, వారి పిల్లలకు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఏర్పడిందే సైనిక సంక్షేమ నిధి. నేడు ‘సాయుధ దళాల పతాక దినోత్సవం.’ ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

1948లోనే శ్రీకారం
మాజీ సైనికులు, వారి పిల్లల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీనికి అన్ని ప్రాంతాల నుంచి విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఏటా డిసెంబరు 7న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నారు. సైనిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి 1948లోనే శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు.  

సంగారెడ్డి కలెక్టరేట్‌లో ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయం

ఏం చేస్తారంటే..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి అధ్యక్షుడిగా, సభ్యులుగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ, నావికా, వాయుసేన దళాల సైన్యాధ్యక్షులు ఉంటారు. రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా, వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీరమరణం పొందిన సైనికులతోపాటు సమస్యల్లో ఉన్న వారి కుటుంబీకులకు, క్షతగాత్రులైన సైనికులకు అండగా ఉండేందుకు విరాళాలు సేకరిస్తారు.

వికారాబాద్‌లో పద్మనాభ కళాశాల విద్యార్థులు...
అర్మీ జవానుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ కమ్యూనల్‌ ఆర్మీ (ఎన్‌ఎఫ్‌సీహెచ్‌) నిధిని సేకరిస్తున్నారు. దీన్లో భాగంగా జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని శ్రీ అనంత పద్మనాభ అర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు వారం రోజులపాటు పట్టణంలోని వివిధ వార్డులు తిరుగుతూ విరాళాలను సేకరించే వారు. ఇలా మూడేళ్ల క్రితం వరకూ చేశారు. కరోనా తదితర కారణాలతో వాయిదా పడింది. ఈ విద్యా సంవత్సరం మళ్లీ విరాళాలను సేకరిస్తామని కళాశాల ఎన్‌సీసీ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.  

సిద్దిపేటలో డిగ్రీ కళాశాల..
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు (కేడెట్లు) సామాజిక అంశాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు సైనిక సంక్షేమంలోనూ భాగస్వామ్యులవుతున్నారు. కళాశాల స్థాయిలో 160 మందితో ఎన్‌సీసీ కొనసాగుతోంది. ఎన్‌సీసీ కేర్‌ టేకర్‌ మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో నిత్యం విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఏటా నిర్వహించే సేవా శిబిరాలకు వెళ్తున్నారు. ఏడాదిలో ఒకరోజు సైనికుల సంక్షేమ నిధిని సేకరిస్తున్నారు. ఈ మొత్తాన్ని బెటాలియన్‌ ద్వారా వారికి అందేలా చొరవ చూపుతున్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు.. రాయితీలు
గ్రూప్‌ 2, గ్రూప్‌ 4 ఉద్యోగాల్లో రిజర్వేషన్లు.
వివాహం కోసం ఆర్థిక సాయం రూ.40వేలు (ఇద్దరు కుమార్తెల వరకు)
మాజీ సైనికుడు మరణిస్తే కుటుంబానికి రూ.10వేలు, భార్య, కుమారుడు, కూతురు మరణించినా అంతే మొత్తం అందజేస్తారు.
స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం పావలా వడ్డీపై రుణ సదుపాయం.
ఇళ్ల స్థలాలు కేటాయింపు.
సీఎస్‌డీ క్యాంటిన్‌ ద్వారా వ్యాట్‌ మినహాయింపుపై సరకుల పంపిణీ.

అందరూ బాసటగా నిలవాలి: కెప్టెన్‌  శ్రీనివాసులు, ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి, సంగారెడ్డి
సైనికులు, వారి కుటుంబాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విరాళాలు ఇవ్వడం ద్వారా వారికి చేయూతనిచ్చిన వారమవుతాం. మా శాఖ తరఫున సేవలందిస్తున్నాం. ప్రభుత్వ పరంగా వారికి ఉన్న పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.


మేము సైతం...
రేగోడ్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఉన్న మాజీ సైనికులతో ఏర్పడిన పారా మిలటరీ రిటైర్డ్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌   సభ్యులు బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తున్నారు. రేగోడ్‌కు చెందిన మాజీ సైనికుడు రాజశేఖర్‌ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి కుటుంబానికి సంఘం తరపున తమ వంచేసేందుకు రేగోడ్‌లో సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. రూ.50 వేల చెక్కును అందించారు.

సామాజిక సేవతోపాటు కుటుంబాలకు భరోసా
- సంగమేశ్వర్‌, పారామిలటరీ రిటైర్డ్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు

విధి నిర్వహణలో ఉన్న సైనికుల కుటుంబాలు, విశ్రాంత సైనికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు పేద ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొదిస్తున్నాం. అందుకోసం జిల్లాలోని మాజీ, ప్రస్తుత సైనికుల కుటుంబాలను గుర్తిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని