logo

అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల అరెస్టు

ఇద్దరు అంతర్‌రాష్ట్ర దోపిడీ దొంగలతో పాటు, మహిళలను నమ్మించి మోసం చేస్తున్న వ్యక్తిని తూర్పుమండలం టాస్క్‌ఫోర్స్‌, నల్లకుంట, మారెడ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.24 లక్షల విలువ చేసే 430

Published : 07 Dec 2021 02:38 IST

స్వాధీనం చేసుకున్న సొత్తు పరిశీలిస్తున్న సీపీ అంజనీకుమార్‌, డీసీపీ జి.చక్రవర్తి

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఇద్దరు అంతర్‌రాష్ట్ర దోపిడీ దొంగలతో పాటు, మహిళలను నమ్మించి మోసం చేస్తున్న వ్యక్తిని తూర్పుమండలం టాస్క్‌ఫోర్స్‌, నల్లకుంట, మారెడ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.24 లక్షల విలువ చేసే 430 గ్రాముల బంగారు నగలు, 2.163 కేజీల వెండి వస్తువులు, రూ.20 వేల నగదు, రెండు చరవాణులు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ జి.చక్రవర్తి, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డిలతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. పహాడీషరీఫ్‌లో నివాసముంటున్న మహారాష్ట్ర యావత్మాల్‌కు చెందిన షేక్‌ మొబీన్‌ ఆలియాస్‌ మొహీన్‌ (27), బోరబండ అల్లాపూర్‌ కూడలిలో నివాసముంటున్న అదే రాష్ట్రానికి చెందిన అవినాష్‌ అమన్‌ జోగ్డేకర్‌(27) స్నేహితులు. మొబీన్‌, అవినాష్‌ రైల్వే ట్రాక్‌ల పక్కన తాళం వేసి ఉండే ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. ఒక ఇంటిని లక్ష్యంగా ఎంచుకొని, రాత్రి వరకు స్థానిక రైల్వే స్టేషన్‌లో కాలక్షేపం చేస్తారు. రాత్రి 11 తరువాత ఇంటి వద్దకు చేరుకొని ఇనుపరాడ్‌తో తాళాలు పగులగొట్టి దొరికినంత దోచుకుపోతారు. నల్లకుంట ఠాణా పరిధిలో మాజీ కార్పొరేటర్‌ వనం రమేష్‌ ఇంటిలో ఇలాగే చోరీ చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అరెస్టు చేశారు. నిందితులపై నల్లకుంట, కామారెడ్డి ఠాణాల్లో రెండేసి, సైబరాబాద్‌ పరిధి చందానగర్‌, ఆదిలాబాద్‌లలో ఒక్కో కేసులున్నాయి. మొబీన్‌, అవినాష్‌లపై గతంలో 14 కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇళ్లలో పని ఇప్పిస్తానని..
సైదాబాద్‌లో ఉండే పండ్ల వ్యాపారి అఫ్తాఫ్‌ అహ్మద్‌ షేక్‌ అలియాస్‌ అఫ్తాఫ్‌ ఉపాధి అవకాశాల కోసం వెదుకుతున్న ఒంటరి మహిళలను గుర్తించి ఆర్థికంగా ఉన్న వారి ఇళ్లలో వంట, ఇంటి పని ఉందని చెప్పి తన ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తాడు. ఏదో ఒక ఇంటి ముందు వాహనాన్ని ఆపి, సదరు ఇంట్లో పని ఇస్తారని, మెడలో నగలతో వెళితే అడిగినంత జీతం ఇవ్వరని, వాటిని తీసి తనకు ఇచ్చి లోపలికి వెళ్లాలని చెబుతాడు. నగలు ఇచ్చి లోపలికి వెళ్లి వచ్చేలోగా అక్కడి నుంచి జారుకొంటాడు. బాధితుల ఫిర్యాదుతో నిఘా ఉంచి నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. 2006 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ, మహారాష్ట్రల్లో ఇతడిపై 41 కేసులు నమోదయ్యాయి. గతంలో అత్యాచారం కేసులో కొల్హాపూర్‌లో జైలులో శిక్ష అనుభవించాడు. అయినా తీరు మార్చుకోలేదు. కామారెడ్డి జిల్లా దేవన్‌పల్లి, నిజామాబాద్‌ పట్టణ 6వ టౌన్‌, హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి, మహారాష్ట్ర ఔరంగాబాద్‌లలో కేసులు ఉన్నట్లు వివరించారు. సమావేశంలో తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వి.సుబ్బారావు, సౌత్‌జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర, నల్లకుంట, మారేడ్‌పల్లి అదనపు ఇన్‌స్పెక్టర్లు డి.కిషన్‌, ఎస్‌.విజయ్‌, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని