logo

దూరానికి దూరం.. లేదు కరోనా భయం

ఓ వైపు కొవిడ్‌ కొత్తరకం ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్నా జూనియర్‌ కళాశాలలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. తరగతి గదుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి.  

Published : 07 Dec 2021 02:38 IST

ఇంటర్‌ కళాశాలల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులు

ఓ కళాశాలలో బెంచీకి ముగ్గురేసి చొప్పున కూర్చున్న విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఓ వైపు కొవిడ్‌ కొత్తరకం ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్నా జూనియర్‌ కళాశాలలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. తరగతి గదుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నాయి.  

1.9లక్షల మంది.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విభాగంలో కలిపి దాదాపు 870 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. 1.90 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మూడు జిల్లాల్లో 42 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ఈ ఏడాది 18,500 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవు. ఈ ఏడాది పదో తరగతిలో విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికంగా విద్యార్థులు ఇంటర్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. ఒక్క ప్రభుత్వ కళాశాలల్లోనే గతేడాది పోల్చితే 4,500 మంది విద్యార్థులు అధికంగా చేరారు. నగరంలోని మహబూబియా, నాంపల్లి, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్‌, హుస్సేనీఆలం, సైదాబాద్‌ కళాశాలల్లో ఒక్కో బెంచీకి నలుగురు చొప్పున కూర్చుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు ప్రభుత్వ కళాశాలల్లో ఉదయం ఇంటర్‌, సాయంత్రం డిగ్రీ తరగతులు జరుగుతున్నాయి.

శానిటైజేషన్‌ ఎక్కడ.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో తరగతులు ముగిశాక శానిటైజేషన్‌ చేయాలి. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత కారణంగా జరగకపోగా.. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. నారాయణగూడ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌ ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నారు.


ఇలా అడ్డుకుంటున్నాయ్‌
కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో నగరంలో కాలనీలు, గేటెడ్‌  కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల సముదాయాల సంక్షేమ సంఘాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించి వ్యాప్తిని అడ్డుకుందామని తమ సభ్యులకు సూచిస్తున్నాయి. ‘మా కమ్యూనిటీలో మొన్నటి వరకు ఒక కేసు లేదు. ప్రస్తుతం మూడు కేసులున్నాయి. అప్రమత్తం చేస్తూ అందరికి సంక్షిప్త సందేశాలు పంపించాం’ అని గచ్చిబౌలిలోని గేటెడ్‌ కమ్యూనిటీ సంక్షేమ సంఘం ప్రతినిధి తెలిపారు. ః మాస్క్‌లులేని, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోని డెలివరీ బాయ్స్‌ను, వెండర్లను లోపలికి అనుమతించవద్దని సూచించాయి.

- ఈనాడు, హైదరాబాద్‌


బూస్టర్‌కు పయనం!
ఒమిక్రాన్‌ అలజడి నేపథ్యంలో బూస్టర్‌ డోసు తెరపైకి వచ్చింది. కొందరు వైద్యులను సంప్రదించి ప్రైవేటు కేంద్రాల్లో మూడోదఫా టీకా వేయించుకుంటున్నారు. గతంతో పోల్చితే తొలి, రెండు, మూడో డోసుల కోసం వచ్చేవారితో ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాలు రద్దీగా కన్పిస్తున్నాయి.

బూస్టర్‌ డోసుపై ఐసీఎంఆర్‌, డబ్ల్యూహెచ్‌వో నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో వైద్యులు కచ్చితంగా సూచించలేకపోతున్నారు. వివిధ దేశాలకు సంబంధించి పలు సంస్థల పరిశోధన పత్రాల ఆధారంగా మాత్రమే తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

 రెండు డోసు వేయించుకున్న కనీసం ఆరు నెలలు గడిచాకే బూస్టర్‌ డోసు తీసుకోవాలని కాంటినెంటల్‌ ఆసుపత్రి క్రిటికల్‌ కేర్‌ వైద్యులు డాక్టర్‌ గోపాల్‌ పాలెపు సూచించారు.

- ఈనాడు, హైదరాబాద్‌


శుభ్రత చర్యలు చేపట్టాలి
- పి.శ్రీహరి, ఏబీవీపీ కేంద్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు

ఇంటర్‌ కళాశాలల్లో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తూ పరిశుభ్రత పాటించాలి. తరగతి గదుల సంఖ్య పెంచి విద్యార్థులను దూరంగా కూర్చొపెట్టాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు శుభ్రత చర్యలు చేపట్టాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని