logo

అమ్యామ్యాల పర్వం.. వాటాలే సర్వం

లంచావతారుల బాగోతాల్ని బట్టబయలు చేసేలా అనిశా దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. ఏదో ఒక విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడుతున్నా.. భయపడకుండా బరితెగిస్తున్నారు. తాజాగా కరీంనగర్‌ బల్దియాను కుదిపేసేలా ఈఈ స్థాయి అధికారి రూ.17వేలు తీసుకుంటూ దొరికిపోవడం కలకలం సృష్టించింది. ఇక్కడి కార్యాలయంలో ఏడేళ్ల కిందట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పట్టుబడగా.. మళ్లీ కీలకమైన హోదాలో ఉన్న అధికారి అనిశాకు దొరకడం విస్మయాన్ని కలిగిస్తోంది.

Published : 19 Jan 2022 02:22 IST

రూ.17 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఈఈ
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ న్యూస్‌టుడే- కార్పొరేషన్‌, నేరవార్తలు

పట్టుబడిన ఈఈ రామన్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

లంచావతారుల బాగోతాల్ని బట్టబయలు చేసేలా అనిశా దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. ఏదో ఒక విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడుతున్నా.. భయపడకుండా బరితెగిస్తున్నారు. తాజాగా కరీంనగర్‌ బల్దియాను కుదిపేసేలా ఈఈ స్థాయి అధికారి రూ.17వేలు తీసుకుంటూ దొరికిపోవడం కలకలం సృష్టించింది. ఇక్కడి కార్యాలయంలో ఏడేళ్ల కిందట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పట్టుబడగా.. మళ్లీ కీలకమైన హోదాలో ఉన్న అధికారి అనిశాకు దొరకడం విస్మయాన్ని కలిగిస్తోంది.

ప్రతి పనికి ఓ రేటు..!
ఎవరు కాదన్నా.. అవునన్నా..! జిల్లాలోని ఇంజినీరింగ్‌ పనుల్లో కచ్చితంగా ప్రతి పనికి ఇంత రేటు ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే.! ముఖ్యంగా అభివృద్ధి పనులను చేపట్టే గుత్తేదారులు రాజకీయ నాయకులతోపాటు పనుల్ని పర్యవేక్షించే యంత్రాంగానికి ఆయా స్థాయిని బట్టి ఎంతోకొంత ముట్టచెప్పనిదే దస్త్రం కదలదనేది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఏఈ స్థాయి నుంచి ఎస్‌ఈ స్థాయి వరకు ఈ కమీషన్‌ల గోల నడుస్తూనే ఉంది. 1 నుంచి 3శాతం వరకు ఈ చెల్లింపులు ఉంటున్నట్లు తెలిసింది. చాలా సందర్భాల్లో పనులు చేసే గుత్తేదారుకు, వీటిని గమనిస్తున్న అధికారికి మధ్య సయోధ్య కారణంగా వీరి మధ్య జరిగే ఇచ్చిపుచ్చుకోవడాలు బయటపడవు. చాలా తక్కువ సందర్భాల్లోనే వీరు బయటపడుతుంటారు. పైగా కొందరు అధికారుల వ్యవహారం శ్రుతిమించినట్లు ఉండటంతోపాటు ప్రతిపనిలో ఇబ్బందులు పెడుతున్న సమయంలోనే బాధితులు అనిశా అధికారుల్ని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా లక్షలు వెచ్చించి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయించే క్రమంలో విపరీత జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. చేసిన ఖర్చులు చేతికి రాక బాధితులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సంఘటనలు ఇదివరకు జిల్లాలో కనిపించాయి. కొన్ని నెలల కిందట హుజూరాబాద్‌ నియోజకవర్గంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఓ అధికారి సతాయిస్తున్నాడని గుత్తేదారు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.!

బాధితుడి నుంచి వివరాలు తీసుకుంటున్న అనిశా సిబ్బంది


ఈ ఏడాదిలో తొలికేసు..

లంచంగా తీసుకున్న నగదుతో ఈఈ రామన్‌

లంచం తీసుకుంటూ నగరపాలక సంస్థ ఈఈ పట్టుబడిన సంఘటన మంగళవారం కరీంనగర్‌లో జరిగింది. అనిశా డీఎస్సీ భద్రయ్య తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పీవీ రామన్‌ గుత్తేదారు మధుకర్‌ నుంచి రూ.17వేలు లంచంగా తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీలో నిర్మించిన పార్క్‌, 17,18 డివిజన్లలో హరితహారం కింద తీసిన గుంతలకు సంబంధించిన బిల్లు, పూడిక తీసిన పనులకు రూ.17,20,546 వరకు బిల్లులు రావడంలో ఆలస్యమైందని.. సంబంధిత దస్త్రాలు ముందుకు కదిలించాలంటే తనకు మొత్తం పనుల్లో ఒక్క శాతం కమీషన్‌ ఇవ్వాలని ఈఈ డిమాండ్‌ చేశారని తెలిపారు. ఈఈతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కార్యాలయం ఆవరణలో డబ్బుల్ని ఇస్తుండగా అనిశా పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని ఓ పార్క్‌ అభివృద్ధితోపాటు హరితహారం గుంతలు, మురుగు కాలువలో పూడికతీతకు సంబంధించిన బిల్లులు గుత్తేదారుకు ఇప్పించడంతో జాప్యం వల్లనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడని డీఎస్పీ తెలిపారు.మరోవైపు పట్టుబడిన ఈఈ నివాసముంటున్న జగిత్యాల, హైదరాబాద్‌, కరీంనగర్‌లోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.

కొత్త సంవత్సరంలో పట్టుబడిన కేసులలో కార్పొరేషన్‌ది మొదటిది. గతేడాది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గతేడాది నవంబరు 30వ తేదీన రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్‌గా ఉన్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్‌ కూడా ఇదే తరహాలో లక్ష రూపాయల్ని తీసుకుంటూ పట్టుబడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని