logo

మృత్యు మలుపు

ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నేరెల్ల పసులపాపన్న గుట్ట వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌, స్థానికుల వివరాల

Published : 19 Jan 2022 02:22 IST

అదుపుతప్పిన ద్విచక్రవాహనం
ఇద్దరు యువకుల మృతి

ధర్మపురి గ్రామీణం, న్యూస్‌టుడే : ద్విచక్రవాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నేరెల్ల పసులపాపన్న గుట్ట వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌, స్థానికుల వివరాల మేరకు.. ధర్మపురి మండలం కొరండ్లపల్లెకు చెందిన కంది హరీష్‌, బుద్దేశ్‌పల్లెకు చెందిన జనగామ రాజ్‌కుమార్‌, తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన లింగం సురేష్‌ ముగ్గురు ద్విచక్ర వాహనంపై నేరెల్ల వైపు నుంచి ధర్మపురి వైపు వెళ్తున్నారు. నేరెల్ల మూలమలుపులో ద్విచక్రవాహనం అదుపుతప్పి గుట్టను అతివేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా కంది హరీష్‌(27), జనగామ రాజ్‌కుమార్‌(26) మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ లింగం సురేష్‌ను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. హరీష్‌ ఎలక్ట్రిషియన్‌గా పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితమే వివాహమైంది. రాజ్‌కుమార్‌ పీజీ పూర్తిచేసి ఇటీవలే ఓ లారీని కొనుగోలు చేసి వ్యాపారం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. 108 వాహనం ఆలస్యం కావడంతో ప్రమాద స్థలం వద్ద తీవ్రంగా గాయపడ్డ లింగం సురేష్‌ రోదనలు పలువురిని కలిచివేశాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సురేష్‌ను, అచేతనావస్థలో పడి ఉన్న హరీష్‌ను ఓ ప్రైవేట్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్‌ వాహనంలో నుంచి మార్గంమధ్యలో ఇద్దరిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదకరంగా పసులపాపన్న గుట్ట మూలమలుపు

తరచూ ప్రమాదాలే..
ధర్మపురి : పసులపాపన్న గుట్ట వద్ద మూలమలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. జాతీయ రహదారి ఇక్కడ ఇరుకుగా, కుడివైపు మూల మలుపు ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలోని రహదారిని మరింత వెడల్పు చేయడంతో పాటు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అమలు కాలేదు. అలాగే ఆకుసాయిపల్లె లోలెవల్‌ కాజ్‌వే వద్ద రహదారి ప్రమాదకరంగా ఉంటోంది. నెలకో ప్రమాదం జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. లోలెవల్‌ కల్వర్టును తొలగించి హైలెవల్‌ వంతెన నిర్మించడానికి రూ.కోటి వ్యయంతో గతంలోనే జాతీయ రహదారి అధికారులు ప్రతిపాదించారు. నిధులు మంజూరు కాలేదు. ఈ మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న వాహనాలు ఢీ కొట్టడంతోనే ప్రమాదాలు జరిగి, మృత్యువాత పడుతున్నారు. మూల మలుపును పూర్తిగా మార్చివేసేలా డిజైనింగ్‌ చేయాలని గతంలోనే ప్రతిపాదించారు. జాతీయ రహదారి అధికారులు దీనిపై దృష్టిపెట్టడం లేదు. పూర్తి స్థాయిలో ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని