logo

గర్భం రాకుండానే వచ్చినట్లు నమ్మించి...

కరీంనగర్‌ జిల్లా  ఇల్లందకుంట మండలం బూజునూరు చెందిన ఓ వివాహిత  తొమ్మిది నెలలుగా గర్భం దాల్చకున్నా గర్భం వచ్చినట్లు నమ్మించగా...  చివరికి అసలు విషయం బయటపడడంతో ఈ విషయం

Published : 19 Jan 2022 02:22 IST

తొమ్మిది నెలలు దాటాక వైద్య నిపుణుల సంప్రదించిన భర్త
తప్పుడు రిపోర్టు ఇచ్చిన వైద్యురాలు

హుజూరాబాద్‌ పట్టణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా  ఇల్లందకుంట మండలం బూజునూరు చెందిన ఓ వివాహిత  తొమ్మిది నెలలుగా గర్భం దాల్చకున్నా గర్భం వచ్చినట్లు నమ్మించగా...  చివరికి అసలు విషయం బయటపడడంతో ఈ విషయం వివాదాస్పదమైంది.  ఆసుపత్రి వైద్యురాలు ప్రసూతి తేదీని కూడా నిర్ధారించడం గమనార్హం. వివాహం జరిగి రెండేళ్లు కాగా పిల్లల కోసం స్థానికంగా  ఓ వివాహిత  ఆసుపత్రిలో చూపించుకుంది. తర్వాత వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా అక్కడి వైద్యులు ఇన్‌ఫెర్టిలిటీ ద్వారా అవకాశాలున్నాయని గర్భం దాల్చవచ్చని రిపోర్టు ఇచ్చారు. దీంతో వివాహిత తన భర్తను నమ్మించింది. తాను గర్భవతినని తొమ్మిది నెలల పాటు విశ్రాంతి అవసరమని తన తల్లిగారింటి వద్దనే ఉండాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు  నమ్మకం పెంచింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో హుజూరాబాద్‌ ప్రాంతీయాసుపత్రిలోని గైనకాలజిస్టు డాక్టర్‌ నందితను సంప్రదించింది. సదరు వైద్యురాలు జమ్మికుంటలోని తనకున్న ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్‌, ఇతర పరీక్షలు చేసి ఏకంగా డెలివరీ డేట్‌ను ఇచ్చి పంపించింది. భర్తకు అనుమానం వచ్చి మంగళవారం స్థానిక ప్రాంతీయాసుపత్రికి  వచ్చి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజేందర్‌రెడ్డిని కలిశారు. ప్రసూతి తేదీని ఇచ్చిన మాట వాస్తవమేనని పేషెంట్‌ను చూడకుండా రిపోర్టుల ఆధారంగా డేట్‌ ఇచ్చిన డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే సదరు వైద్యురాలు మాత్రం తన వద్దకు రిపోర్టులతో పాటు వేరే మహిళ(గర్భిణి)ని పంపించారని అందుకే తాను డెలివరీ డేట్‌ను ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో తన తప్పేమీ లేదంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని