logo
Published : 06/12/2021 04:29 IST

ఆర్థిక స్వావలంబన.. ఉపాధి కల్పన

చిట్యాల, నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే


దుస్తుల డిజైన్‌ కటింగ్‌లో మహిళలకు సలహాలిస్తున్న పాపని వనజ

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు మహిళలు. తమకున్న పరిజ్ఞానంతో సొంత వ్యాపారం ప్రారంభించిన మహిళలు వారి కుటుంబానికి ఆర్థిక తోడ్పాటుగా నిలవడంతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. సొంత వ్యాపారంలో రాణిస్తూ మిగిలిన మహిళలకు స్ఫూర్తి నింపుతున్నారు.

దుస్తుల తయారీలో..

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లికి చెందిన పాపని వనజ దుస్తుల తయారీ వ్యాపారం చేపట్టి 45మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తన భర్త వాసుదేవ్‌ సహకారంతో సుమారు 15ఏళ్ల క్రితం వనజ దుస్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి పరిచారు. ప్రస్తుతం ఏటా రూ.50లక్షల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా యువతులకు, మహిళలకు టాప్స్‌, నైటీలతో పాటు బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు, తదితరాలు తయారు చేయిస్తున్నారు. దుస్తుల తయారీకి అవసరమైన వస్త్రాన్ని 15మంది నేత కార్మికులకు ఆర్డర్‌ ఇచ్చి నేయిస్తున్నారు. అలా తీసుకున్న వస్త్రాన్ని 30మది మహిళతో తాము రూపొందించిన డిజైన్లు ఇచ్చి కుట్టిస్తున్నారు. తయారైన దుస్తులను చౌటుప్పల్‌లోని చేనేత సొసైటీతో పాటు భూదాన్‌పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చీరాల, కడప, ఏలూరు వంటి ప్రాంతాల్లోని దుకాణాలకు అందిస్తున్నారు. ఈ పనులతో ఒక్కొక్క నేత కార్మికుడు నెలకు రూ.20వేల వరకు, టైలరింగ్‌ చేసే మహిళలు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ తమ సేవలను అందిస్తున్నారామె.


నెలకు రూ.20 వేలకు పైగా ఆర్డర్లు


పారిశుద్ధ్య వస్తువులు తయారు చేస్తున్న మహిళలు

యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన ప్రవళిక సమభావన సంఘానికి చెందిన ఆరుగురు సభ్యులు స్త్రీ నిధి రుణం రూ.2లక్షల వ్యయంతో రామన్నపేటలో 2017లో పారిశుద్ధ్య ద్రావణాల తయారీని ప్రారంభించారు. టాయిలెట్‌ క్లీనర్‌, ఫినాయిల్‌, హ్యాండ్‌వాష్‌, ఫ్లోర్‌ క్లీనర్‌, డిష్‌వాష్‌ పౌడర్‌ వంటి వస్తువులను తయారు చేస్తున్నారు. వీటి తయారీ పనులతో 10మందికి పైగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన వస్తువులను మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుకాణంతో పాటు పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలకు ఆర్డర్లపై సప్లయ్‌ చేస్తున్నారు. నెలకు రూ.20వేలకు పైగా అర్డర్లను పొందగలుగుతున్నారు. దీంతో ఏ ఇబ్బందుల్లేకుండా కుటుంబం గడవడంతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తూముందుకు సాగుతున్నారు.


ఎరువుల వ్యాపారంలో రాణిస్తూ..


గుజిలాల్‌ రమణ

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరానికి చెందిన గుజిలాల్‌ రమణ అనే మహిళ ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. తాను ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆమె పదో తరగతి వరకు చదువుకున్నారు. శాలిగౌరారంలో 2003లో సుమారు రూ.2లక్షల వ్యయంతో ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా తమ వ్యాపారాన్ని మెరుగు పరుచుకున్నారు. రైతుల అవసరాలను బట్టి నగదు లావాదేవీలను నిర్వహిస్తూ వారికి సహకరిస్తూ వస్తున్నారు. తన వ్యాపార నిర్వహణ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటునివ్వడం తనకు సంతృప్తిగా ఉందని ఆమె పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణలో మరికొందరికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందన్నారు.


చెవులు వినిపిస్తే మాటలొస్తాయి!

పరికరాల కొనుగోలుకు సాయమర్థిస్తున్న కుటుంబం

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు ఎండీ హజ్రా. చిరుమర్తి గ్రామానికి చెందిన హైమత్‌పాషా, గౌస్యాభేగంల రెండో కుమార్తె. ప్రస్తుతం ఏడేళ్ల వయసున్న ఈ చిన్నారికి చిన్నప్పటి నుంచే చెవులు వినిపించవు, మాటలు రావు. తల్లిదండ్రులు ఆమె వైద్యం కోసం పలు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. రూ.లక్షకు పైగా ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. ఇక చేసేదేమి లేక గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్పించారు. తల్లి తోడుగా పాఠశాలలో వదిలి వెళ్తుంది. మళ్లీ సాయంత్రం వచ్చి తీసుకెళ్తుంది. తండ్రి కూలి పనులు చేస్తుండగా.. తల్లి పూర్తిగా పిల్లల సంరక్షణలోనే ఉంటుంది. దివ్యాంగురాలి పింఛన్‌ కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసినా మంజూరు కాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే హజ్రాను వైద్యులకు చూపించినపుడు ఆమెకు చెవులు వినిపిస్తే మాటలు వచ్చే అవకాశం ఉందని చెప్పారని వారు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన శస్త్రచికిత్సతోపాటు అత్యాధునిక వినికిడి పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారని, ప్రభుత్వంగానీ, దాతలుగానీ ముందుకొచ్చి చిన్నారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని వేడుకుంటున్నారు. - మాడ్గులపల్లి, న్యూస్‌టుడే


ఆసరా లేక అనాథ

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు


మేనమామ ఇంటిలో ఉంటున్న అనూష

విధి ఆడిన వింత నాటకంలో ఆ చిన్నారి బలిపశువుగా మారింది. అభం శుభం తెలియని చిన్నారికి పెద్ద కష్టం వచ్చి పడిండి. తను పుట్టగానే ప్రమాదం రూపంలో వచ్చి మృత్యువు తండ్రి రాములును బలితీసుకుంది. ఆమె వయస్సు ఆరు నెలలున్నప్పుడు అనారోగ్యంతో తల్లి బుజ్జిని కోల్పోయి అనాథగా మారింది. దీనికి తోడు పుట్టుకతోనే కుడి చేయి లేకపోవడం, ఆలనాపాలనా చూసే దిక్కులేక నానా అవస్థలు పడింది. ఈ దీనగాథ కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన సంపంగి అనూషది. అప్పటి నుంచి మేనమామ ఇంట్లో పెరిగింది. వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో కష్టపడుతూనే పెంచారు. చిన్నారికి ప్రస్తుతం పదేళ్లు. ఏమనుకుందో ఏమో మేనమామ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు.. పట్టణంలో యాచిస్తోంది. వారు ఉంటున్న ఇళ్లు సైతం ఇబ్బందిగా మారింది. చిన్నపాటి వర్షం వచ్చినా కురుస్తుంది. బాలిక దుస్థితిని చూసి స్థానికులు జాలిపడుతున్నా సాయం అందించే వారు లేరు. ప్రభుత్వ అధికారులు కనీసం ఆమెకు దివ్యాంగ పింఛను మంజూరు చేయాలని కోరుతున్నారు. దాతలు ఆపన్నహస్తం అందిస్తే తోటి విద్యార్థుల మాదిరిగానే చదువుకుంటానని ఆశగా చెబుతోంది. దాయార్థుల సాయం కోసం దీనంగా వేడుకుంటుంది ఆ చిన్నారి. - కోదాడ పట్టణం, న్యూస్‌టుడే

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని