logo

ప్రభుత్వం నుంచి డబ్బులొచ్చాయని వృద్ధురాలికి టోకరా

ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ మహిళకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వచ్చాయని ఆశ చూపి రూ.15 వేలతో దుండగుడు ఊడాయించిన ఘటన మండలంలోని చిన్నకందుకూర్‌లో వెలుగుచూసింది.

Published : 06 Dec 2021 04:29 IST


వృద్ధురాలిని ద్విచ్రవాహనంపై తీసుకెళ్తున్న నిందితుడి సీసీ పుటేజీ

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ మహిళకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వచ్చాయని ఆశ చూపి రూ.15 వేలతో దుండగుడు ఊడాయించిన ఘటన మండలంలోని చిన్నకందుకూర్‌లో వెలుగుచూసింది. సీఐ జానకీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకందుకూర్‌కు చెందిన షేక్‌ మల్లికాబీ (72) వద్దకు శుక్రవారం గుర్తుతెలియని దుండగుడు వచ్చి మైనార్టీ సంక్షేమశాఖ నుంచి ఆమె పేరుపై భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయని ఆశచూపాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని సూచించాడు. ముందుగా మీ సేవలో రూ.15 వేలు డీడీ చెల్లించిన వెంటనే తన ఖాతాలోకి డబ్బులు జమవుతాయని నమ్మబలికాడు. దానికి అధికారినైన తాను పూర్తిగా సహకరిస్తానని ఆమెను ద్విచక్ర వాహనంపై వంగపల్లికి తీసుకెళ్లాడు. ఆమె పోగు చేసుకున్న రూ.8 వేలు అతనికి ఇచ్చి బతిమాలుకోగా, ఇక ఆ డబ్బులు రావని వెళ్లబోయాడు. దీంతో ఆమె తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అప్పగించి, వాటిని అమ్మి చెల్లించాలని కోరారు. ఆ దుండగుడు వాటిని తీసుకొని ఇప్పుడే వస్తానంటూ అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతకీ రాకపోవడంతో, తాను మోసపోయినట్లు గుర్తించి కుటుంబసభ్యులు, గ్రామస్థులతో కలిసి శనివారం యాదగిరిగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఆదివారం వంగపల్లిలోని సీసీ పుటేజీలను పరిశీలించి ఆ వ్యక్తి చిత్రాలు సేకరించామని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని