logo

అంధత్వాన్ని అధిగమిస్తూ.. ఆటల్లో రాణిస్తూ

పేద కుటుంబంలో అంధత్వంతో పుట్టినా ఎలాంటి చింతన చేయకుండా వివిధ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంధత్వాన్ని అధిగమిస్తూ...

Published : 06 Dec 2021 04:29 IST


నల్గొండ అంధుల పాఠశాల నుంచి రాష్ట్రపతిని కలిసిన బృందంలో నితిన్‌ (ఎడమ నుంచి మొదటి వ్యక్తి)

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: పేద కుటుంబంలో అంధత్వంతో పుట్టినా ఎలాంటి చింతన చేయకుండా వివిధ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంధత్వాన్ని అధిగమిస్తూ... అన్నింటిలో రాణిస్తూ.. ముందుకు సాగుతున్నాడు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పుర పరిధిలోని గోవిందపురం గ్రామానికి చెందిన అన్నబత్తులు కృష్ణమూర్తి, శోభ దంపతుల పెద్ద కుమారుడు నితిన్‌. ఆయన నల్గొండలోని స్కూల్‌ ఫర్‌ ద బ్లైండ్‌లో పదో తరగతి వరకు చదివారు. అనంతరం శంషాబాద్‌లో చిన్న జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత్ర విద్యాలయంలో ఇంటర్‌ చేరి అక్కడ వివిధ క్రీడల్లో మెళకువలు నేర్చుకొని చెస్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ, క్రికెట్‌లో రాణిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్తున్నారు. ప్రస్తుతం బీకాం కంప్యూటర్స్‌లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న నితిన్‌ మొదటి సంవత్సరం మొదటి సెమ్‌లో 96.4 శాతం మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచారు.

క్రీడల్లో ప్రతిభ ఇలా...

చెస్‌లో... * 2019లో అంధుల అండర్‌-18 విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో రెండో స్థానం సాధించారు.

* 2019లో ఓపెన్‌ చెస్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు బహుమతి పొంది, దిల్లీలో జరిగిన జాతీయ పోటీలకు ఎంపికై అక్కడ ఐదో స్థానంలో నిలిచారు.

అథ్లెటిక్స్‌లో... * 2019లో రాష్ట్ర స్థాయి పోటీలలో 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు బహుమతి.

* 2020లో జయశంకర్‌ భైపాల్‌పల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా ఒలంపిక్స్‌లో 100 మీటర్ల పరుగు పందెం, షాట్‌ఫుట్‌, డిస్కస్‌త్రోల్లో బంగారు పతకం. దీంతో బెంగుళూరులో జరిగిన జాతీయ పారా ఒలంపిక్స్‌ పోటీల్లో పాల్గొని షాట్‌ పుట్‌, 100 మీటర్ల పరుగు పందెంలో నాల్గో స్థానంలో నిలిచారు.

* కబడ్డీలో... 2020లో దిల్లీలో జరిగిన జాతీయ అంధుల కబడ్డీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

క్రికెట్‌లో...

అంధుల క్రికెట్‌ల్లో పలు మార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటి దిల్లీలో నవంబరు 17 నుంచి 24 వరకు జరిగిన జాతీయ క్రికెట్‌ పోటీల్లో పాల్గొన్నారు.

* 2019, 2020 రిపబ్లిక్‌ డే సందర్భంగా గవర్నర్‌ ఎదుట ఎన్‌సీసీ తరుపున పెరేడ్‌లో పాల్గొన్నారు.


గ్రూప్‌-2 స్థాయి ఉద్యోగం సాధించటమే ఆశయం


అంధుల చెస్‌ పోటీల్లో పొందిన బహుమతితో నితిన్‌

ప్రభుత్వం సహకరించి శిక్షణ ఇస్తే అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తా. డిగ్రీ పూర్తి అయిన తరువాత గ్రూప్‌-2 పరీక్షలకు సంసిద్ధ ఆ స్థాయి ఉద్యోగం సాధించేలానే లక్ష్యంతో ఉన్నా. వైకల్యాలను అధిగమించి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని