logo
Published : 06/12/2021 04:29 IST

ఎగుడుదిగుడు.. నిబంధనలతో చెడుగుడు..!

ఇదీ నకిరేకల్‌- రేణిగుంట జాతీయ రహదారి పనుల తీరు


నకిరేకల్‌- నల్గొండ నడుమ తాటికల్‌ వద్ద జాతీయ రహదారి పనులు

నకిరేకల్‌, న్యూస్‌టుడే: ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిన పనులకు మోక్షం లభించిందన్న ఆనందం ఆవిరవుతోంది. జాతీయ రహదారి నిర్మాణ పనులు అడ్డదిడ్డంగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు పాతరేశారని, పనుల నాణ్యతపైనా అనుమానాలున్నాయని రహదారి వెంటనున్న గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఇదీ నకిరేకల్‌- నల్గొండ- నాగార్జునసాగర్‌ 565వ నంబర్‌ జాతీయ రహదారి పనుల తీరు.

రూ.253 కోట్లతో తాజాగా పనులు

2014లో రూ.189.90 కోట్లతో నకిరేకల్‌- సాగర్‌ మధ్య పనులు చేపట్టారు. 22 కి.మీ. మేర రోడ్డు పనులను పరిహారం చెల్లించకుండానే మొదలుపెట్టారని నకిరేకల్‌ నుంచి నల్గొండ మధ్యలో భూములు కోల్పోతున్న పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. గుత్తేదారు సంస్థ వెనక్కి వెళ్లడంతో ఆరేళ్ల క్రితం పనులు నిలిచిపోయాయి. అడ్డంకులు తొలగిన తర్వాత నకిరేకల్‌- సాగర్‌ మధ్య మళ్లీ నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు ఏడాది క్రితం రూ.329 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. టెండర్లు పిలిచి రూ.253 కోట్లతో గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. నకిరేకల్‌- సాగర్‌ మధ్య నాలుగు పెద్ద, 25 చిన్న జంక్షన్లు, 25 బస్‌షెల్టర్లు, గ్రామాలు, పట్టణాల వద్ద ఆకాశ విద్యుద్దీపాలు, రెండువైపులా భూగర్భ మురుగుకాల్వలు, నల్గొండ పానగల్‌ బైపాస్‌ కూడలిలో ఆరులైన్ల అండర్‌పాస్‌ వంతెన వంటి పనులు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రానికి నకిరేకల్‌-సాగర్‌ హైవే దగ్గరి దారిగా ఉంది. 65వ నంబర్‌ హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి నల్గొండకు వెళ్లేందుకు ప్రమాదాల భయం వెంటాడుతుండటంతో నకిరేకల్‌, సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, తిరుమలగిరి తదితర ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు నకిరేకల్‌- సాగర్‌ రహదారినే ఆశ్రయిస్తుంటారు. నకిరేకల్‌ నుంచి నల్గొండ వెళ్లేందుకు దూరభారం తగ్గనుండటంతో దీనికి ప్రాధాన్యం పెరిగింది.

ఎత్తులో నిర్మిస్తుండటంతో..

రహదారి నిర్మాణ పనులు అడ్డదిడ్డంగా జరుగుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల వద్ద రహదారిని, రెండువైపులా కాల్వలను ఎత్తులో నిర్మిస్తుండటం వల్ల తమ గృహాలు ముంపునకు గురవుతాయంటున్నారు. రహదారికి రెండువైపులా నిర్దేశించిన స్థలాన్ని వదలకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. పాత విద్యుత్తు తీగలు, స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి. కానీ పాత స్తంభాల మధ్యే మురుగుకాల్వలు నిర్మిస్తున్నారు. పనులు జరుగుతున్నట్లు హెచ్చరించే సూచికలు పలుచోట్ల కానరావడం లేదు.

చిన్నసూరారం వద్ద విద్యుత్తు స్తంభాలు తొలగించకుండానే మురుగు కాల్వ నిర్మాణం

ఒక రహదారికి రెండు నంబర్లు

సిరోంచ- రేణిగుంట జాతీయ రహదారి నకిరేకల్‌- నల్గొండ- నాగార్జునసాగర్‌ మీదుగా వెళ్లనుంది. మహారాష్ట్రలోని సిరోంఛ నుంచి మొదలయ్యే జాతీయ రహదారిని సూర్యాపేట, నల్గొండ, గుంటూరు జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లాలోని రేణిగుంట(తిరుపతి) వరకు 643 కి.మీ. పొడవుతో నిర్మిస్తున్నారు. నూతనకల్‌ మండలం బిక్కుమళ్ల వద్ద సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించే జాతీయ రహదారి నాగార్జునసాగర్‌ వరకు 161.57 కి.మీ. పొడవు కలిగి ఉంది. మహబూబాబాద్‌ జిల్లా తానంచర్ల నుంచి నకిరేకల్‌ వరకు 365(ఏ) నంబర్‌, నకిరేకల్‌- నల్గొండ- నాగార్జునసాగర్‌- రేణిగుంట వరకు 565 నంబర్‌ జాతీయ రహదారిగా పరిగణిస్తారు. సిరోంఛ నుంచి రేణిగుంట వరకు ఇది ఒకటే రహదారి అయినా మధ్యలో ఇతర జాతీయ రహదారులను దాటినప్పుడు నంబర్లు మారాయి.

లోపాలు సరిచేస్తాం : - ప్రవీణ్‌రెడ్డి, డీఈ, జాతీయ రహదారుల విభాగం

రహదారి నిర్మాణంలో అక్కడక్కడా ఉన్న లోపాలను సరిచేస్తాం. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతాం. మురుగుకాల్వల మధ్యలోని విద్యుత్తు లైన్లను తొలగిస్తాం. నిబంధనల ప్రకారం వేగంగా పనులు చేస్తున్నాం. రహదారి పనులు పూర్తైన తర్వాత ఐదేళ్ల పాటు గుత్తేదారు సంస్థ దీనిని నిర్వహించనుంది.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని