logo

పట్టు దొరక్క.. గిట్టుబాటు కాక..

తళతళలాడే పట్టు చీరలు నేసే మగ్గాలపై నేత పని నిలిచిపోతోంది. నేతన్నలు ఉపాధి కోల్పోతున్నారు. చీరల తయారీకి ఉపయోగించే మల్బరీ పట్టు గూళ్ల ధర రెట్టింపైంది.

Published : 06 Dec 2021 04:29 IST

ఉపాధి కోల్పోతున్న నేతన్నలు


పట్టుగూళ్ల నుంచి పట్టుదారం ఉత్పత్తి

చౌటుప్పల్‌, చండూరు, న్యూస్‌టుడే: తళతళలాడే పట్టు చీరలు నేసే మగ్గాలపై నేత పని నిలిచిపోతోంది. నేతన్నలు ఉపాధి కోల్పోతున్నారు. చీరల తయారీకి ఉపయోగించే మల్బరీ పట్టు గూళ్ల ధర రెట్టింపైంది. నేసిన చీరలకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 5వేల పట్టు చీరలు నేసే మగ్గాలున్నాయి. వీటిపై ఆధారపడి 20 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి.

అమాంతం పెరిగిన పట్టుదారం ధర

తెలంగాణలో పట్టుగూళ్ల మార్కెట్లు తిరుమలగిరి, జనగామలో ఉన్నాయి. రైతులు తాము పండించిన పట్టుగూళ్లను అక్కడ విక్రయిస్తుంటారు. సిల్క్‌ రీలింగ్‌, ట్విస్టింగ్‌ చేసే పరిశ్రమల నిర్వాహకులు ఈ మార్కెట్ల నుంచి పట్టుగూళ్లను కొంటారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో మార్కెట్లలో పట్టుగూళ్లు కిలోకు ధర రూ.180-200 పలికింది. కనీసం రూ.250- 300 ధర వస్తేనే సెరికల్చర్‌ చేసే రైతులకు గిట్టుబాటవుతుంది. సరైన ధర రావడం లేదని సగానికి పైగా రైతులు మల్బరీ సాగును మానుకున్నారు. మిగిలిన తోటలకు ఇటీవల వర్షాలకు నష్టం జరిగింది. పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. మార్కెట్‌లో పట్టుగూళ్లకు కిలోకు ధర రూ.600కు పైగా పలుకుతోంది. దారం తయారీకి అవసరమైన పట్టుగూళ్ల ఉత్పత్తి తగ్గడంతో మహారాష్ట్ర మార్కెట్‌ నుంచి కొనాల్సి వస్తోంది. కర్ణాటక నుంచి ముడి పట్టుదారాన్ని తెచ్చుకుంటున్నారు. గతంలో చైనా నుంచి పట్టుదారం దిగుమతయ్యేది. అదీ నిలిచిపోయింది. పట్టుచీరల తయారీకి ఉపయోగించే పట్టుదారం ధర రెట్టింపైంది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల చేనేతలకు సరిపడా పట్టుదారం ఉత్పత్తి కావాలంటే నెలకు 210 టన్నుల పట్టుగూళ్లు అవసరం. 15 వేల ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలి.


మగ్గం నేయకపోతే పూట గడవదు

-బత్తుల చంద్రయ్య, చౌటుప్పల్‌

కరోనా మహమ్మారికి ముందు కిలో పట్టుదారం ధర రూ.3,500 ఉండేది. ఇప్పుడు రూ.5,300 అయ్యింది. ఏడు పట్టుచీరల తయారీకి కిలోన్నర నిలువు దారం, 3.7 కిలోల పేక దారం అవసరం. ప్రస్తుత ధర ప్రకారం పట్టుదారానికి రూ.27,340 అవుతుంది. కరోనాకు ముందు రూ.18,500 సరిపోయేది. పట్టుదారం ధర దాదాపు రెట్టింపైనా చీర ధర అంతే ఉంది. మగ్గం నేయకపోతే పూట గడవదు. నేస్తే కనీస కూలి రాని పరిస్థితి నెలకొంది.


మహారాష్ట్ర నుంచి పట్టుగూళ్లు తెస్తున్నా

-గంజి శ్రీహరి, పట్టుదారం ఉత్పత్తిదారు, చౌటుప్పల్‌

5వేల మగ్గాలపై పట్టుచీరలు నేస్తున్నారు. మగ్గానికి నెలకు ఆరు కిలోలు చొప్పున 30వేల కిలోల పట్టుదారం అవసరం. పట్టుగూళ్లను జనగామ, తిరుమలగిరి మార్కెట్ల నుంచి కొంటాం. అక్కడికి సగటున రోజుకు 1,000 నుంచి 1,500 కిలోల పట్టుగూళ్లను రైతులు అమ్మకానికి తెచ్చేవారు. కిలోకు రూ.250 నుంచి రూ.300 ధర చెల్లించి కొంటాం. ప్రస్తుతం 100 కిలోలూ మార్కెట్‌కు రావడం లేదు. ధర కిలోకు రూ.600 అయ్యింది. నా యూనిట్‌కు రోజుకు 400 కిలోల పట్టుగూళ్లు అవసరం. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఉత్పత్తి తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో సెరికల్చర్‌ నిలిచిపోయింది. మహారాష్ట్ర నుంచి పట్టుగూళ్లు రోజుకు 150 కిలోలు తెస్తున్నాం. కర్ణాటక నుంచి ముడి పట్టుదారం తెచ్చి ట్విస్టింగ్‌ చేస్తున్నాం. గతంలో రోజుకు 57 కిలోల పట్టుదారం ఉత్పత్తి చేసేవాళ్లం. ముడి సరుకు కొరతతో 20 కిలోలే ఉత్పత్తి అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని