logo

ఆదరణ కరవు.. కన్నీరే తోడు

సంస్థాన్‌నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన గంగదేవి తిరుమలేష్‌, గంగదేవి హరిణి దంపతులు. పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. వీరికి నలుగురు సంతానం.

Published : 06 Dec 2021 04:29 IST


నలుగురు పిల్లలతో కలిసి విలపిస్తున్న హరిణి

నిలువ నీడ లేదు సరికదా కనీసం తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తున్నారు. పచ్చడి, కారం మెతుకులు తింటూ కాలం వెళ్ల్లదీస్తున్నారు. ఇంటి పెద్ద దిక్కు దూరం కావడంతో తల్లీ, నలుగురు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీరి పరిస్థితిపై న్యూస్‌టుడే కథనం..

- సంస్థాన్‌నారాయణపురం, భువనగిరి, న్యూస్‌టుడే

సంస్థాన్‌నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన గంగదేవి తిరుమలేష్‌, గంగదేవి హరిణి దంపతులు. పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. వీరికి నలుగురు సంతానం. మానస(9), సంతోష్ని(8), మాధురి దీక్షిత్‌(7) చరణ్‌(5). కుటుంబ పోషణ నిమిత్తం తిరుమలేష్‌ హైదరాబాద్‌లో పాఠశాల బస్సు నడిపేవారు. 2017లో జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందారు. దీంతో భార్య హరిణి, నలుగురు పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.

కారం మెతుకులతో వెళ్లదీస్తూ...

భర్త మరణంతో వీరు బతుకు పోరాటం చేస్తున్నారు. గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి రేషన్‌ కార్డు లేదు. ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం కూడా అందడం లేదు. దీంతో బతుకు భారమవుతోంది. ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా.. 5 ఏళ్ల కుమారుడ్ని అంగన్‌వాడీ కేంద్రానికి పంపిస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనంతో చిన్నారులు కడుపు నింపుకుంటున్నారు. ఒక్కో రోజు వంట చేయడానికి బియ్యం లేకుంటే ఇళ్లలో రేషన్‌ బియ్యం తీసుకొచ్చి వంట వండి తన పిల్లలకు కడుపు నింపి తాను పస్తులుంటోంది. ఒక్కో రోజు తిండి లేక ఖాళీ కడుపుతో నిద్రపోయిన సంఘటనలు ఉన్నాయి.


కుమారుడిని చంకనెత్తుకొని పత్తి ఏరుతున్న హరిణి

ఆకలితో ఉలిక్కి పడుతున్నారు: హరిణి

పిల్లలకు సరిగా తిండి పెట్టలేక పోతున్నా. ఒక్కొసారి ఆకలితో నిద్రలో ఉలిక్కి పడుతున్నారు. నాన్న ఎప్పుడు వస్తాడంటూ పిల్లలు అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది. నా నలుగురు పిల్లల కోసమే బతుకుతున్నా. నా ఐదేళ్ల కొడుకును చంకనెత్తుకొని కూలీ పనులకు వెళ్తున్నా. పొద్దంతా పని చేస్తే రూ.300 వస్తాయి. అవి ఏమాత్రం సరిపోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని