logo

స్వచ్ఛతలో మురిస్తే.. ర్యాంకుతో మెరుస్తుందంతే..

కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2022 పోటీలకు పురపాలికలు సన్నద్ధమవుతున్నాయి. స్వచ్ఛతతో మురిపిస్తే ర్యాంకుతో మెరవనున్నాయి.

Published : 06 Dec 2021 04:29 IST


సూర్యాపేటలో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2022 పోటీలకు పురపాలికలు సన్నద్ధమవుతున్నాయి. స్వచ్ఛతతో మురిపిస్తే ర్యాంకుతో మెరవనున్నాయి. మార్చిలో జరిగే సర్వేలో భాగంగా అధికారులు పారిశుద్ధ్యాన్ని పరిశీలించి ర్యాంకులు నిర్ధారించనున్నారు. గతంలో కంటే 1,500 మార్కులు పెంచారు. క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం, యంత్రాల వినియోగం, తడి, పొడి చెత్తను వేరు చేసి చూపించాల్సి ఉంటుంది. గతేడాది వచ్చిన మార్కుల కంటే మెరుగైన ఫలితాలు రాబట్టే దిశగా పుర అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కొత్తగా ఏర్పడిన పురపాలికలకు రూ.10- 25 లక్షలు, లక్ష జనాభా పైచిలుకు కలిగిన నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాలిటీలకు రూ.1- 1.50 కోట్ల వరకు ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది.

పురపాలికల మధ్య పోటీతత్వం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరిట కేంద్రం ర్యాంకులు కేటాయిస్తూ ప్రోత్సాహకంగా మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేస్తున్న మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం సైతం పురపాలికల మధ్య పోటీతత్వం పెంచింది. పట్టణ ప్రగతి పనులను పూర్తి చేసేందుకు ప్రోత్సాహకంగా పురస్కారాలు అందిస్తోంది. సఫాయి మిత్ర, స్వచ్ఛ సర్వేక్షణ్‌, వ్యర్థాల తరలింపు, శుద్ధీకరణకు 900 మార్కులు, చెత్తను వేరు చేసి తరలించేందుకు 900, ప్రాసెసింగ్‌ డిస్పోజల్‌ కోసం 1200 మార్కులతో కలిసి 3 వేల మార్కులు కేటాయించింది. సర్వే మార్చిలో ఉండనుండగా, స్వచ్ఛత యాప్‌లో పౌరుల అభిప్రాయాల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరిలో మొదలుకానుంది.

సేవల ఆధారంగా పురస్కారాలు

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనుల్లో 14 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా నిర్దేశించింది. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ, రీసైక్లింగ్‌, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, మానవ వ్యర్థాలను శుద్ధి కేంద్రానికి తరలించడం, హరితహారంలో మొక్కలు నాటడం, కూడళ్ల అభివృద్ధి, నర్సరీలు పెంచడం, సమీకృత మార్కెట్లను అభివృద్ధిపరచటం, వైకుంఠధామాలు నిర్మించడం, పార్కులు, ఆట స్థలాలు, వెల్‌నెస్‌ కేంద్రాల స్థాపన, చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా జోన్ల ఏర్పాటు, బస్సు షెల్టర్లు, ఓపెన్‌ జిమ్‌ల నెలకొల్పటం, 24 గంటల పాటు తాగునీటి సరఫరా, ఇంకుడు గుంతలు నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. మెరుగైన సేవలు, పనులు చేసిన పురపాలికలు, అధికారులకు పురస్కారాలు అందించనుంది.

జనాభా ప్రాతిపదికన పురపాలికల విభజన

పట్టణ ప్రగతి ద్వారా చేపట్టే పనులను అనుసరించి పురస్కారాలు అందించనుంది. రాష్ట్రంలోని 120పైగా మున్సిపాలిటీలను జానాభా ప్రాతిపదికన విభజించింది. నాలుగు సెగ్మెంట్లుగా విభజించి అవార్డులిచ్చేలా అధికారులు కార్యచరణ రూపొందించారు. మొదటి విభాగంలో 25వేల జనాభా కలిగిన మున్సిపాలిటీలు, రెండో విభాగంలో 25 వేల నుంచి 50 వేల జనాభా, మూడో సెగ్మెంట్‌లో 50వేల నుంచి లక్ష జనాభా, నాలుగో విభాగంలో లక్ష నుంచి 3 లక్షల జనాభాలోపు ఉన్న మున్సిపాలిటీలను ఎంపిక చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని