logo

ఫార్మసీ విద్య.. భవితకు బాట

మినీ ఎంబీబీఎస్‌గా గుర్తింపు పొందిన బి.ఫార్మసీ కోర్సుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ కోర్సు చదివితే ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత భావిస్తున్నారు.

Published : 06 Dec 2021 04:39 IST

విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి.. మొదలైన ప్రవేశాల ప్రక్రియ

ప్రయోగాల్లో ఫార్మసీ విద్యార్థులు

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: మినీ ఎంబీబీఎస్‌గా గుర్తింపు పొందిన బి.ఫార్మసీ కోర్సుపై ఆసక్తి పెరుగుతోంది. ఈ కోర్సు చదివితే ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్నాళ్లుగా పరిశీలిస్తే ఇంటర్‌లో బైపీసీ చదివిన విద్యార్థులు ఫార్మసీ కోర్సువైపు మక్కువ చూపుతున్నారు. దీంతో ఏటికేడు ఈ కోర్సుకు డిమాండ్‌ పెరుగుతుంది. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు జిల్లాలోని ఫార్మా కంపెనీలు, క్లినికల్‌ ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, ఆసుపత్రుల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మరికొంత మంది విద్యార్థులకు ఫార్మా హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. యువతకు ఉద్యోగ వారధిగా ఫార్మసీ విద్య మారింది. ప్రస్తుతం ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా తర్వాత ఈ కోర్సులకు మరింతగా డిమాండ్‌ పెరిగింది.

ఉమ్మడి జిల్లాలో 10 కళాశాలలు..

బి.ఫార్మసీ కళాశాలలు ఉమ్మడి జిల్లాలో 10 వరకు ఉన్నాయి. నల్గొండలో 2, యాదాద్రి, భువనగిరిలో 2, సూర్యాపేటలో ఆరు ఫార్మసీ కళాశాలలున్నాయి. వీటిలో దాదాపు వెయ్యి సీట్లు వరకు ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో 700, మేనేజ్‌మెంట్‌ కోటాలో 300 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి యేటా అక్టోబరులో ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. ఈ ఏడాది వివిధ కారణాల వల్ల ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆలస్యమైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు మొదటి విడత.. 13వ తేదీ నుంచి 15 వరకు రెండో విడత ప్రవేశాల షెడ్యూల్‌ ఖరారు చేశారు. నాలుగేళ్ల ఫార్మసీ కోర్సులో ప్రతి యేటా 10 పేపర్ల చొప్పున మొత్తం నలబై పేపర్లు విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. ప్రథమ సంవత్సరం నుంచే విద్యార్థులతో ప్రయోగాలు చేయించి..వారికి ప్రయోగ పరిజ్ఞానం అందిస్తారు. తృతీయ సంవత్సరం చివరలో ఇంటర్నషిప్‌లో భాగంగా విద్యార్థులు ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు, ఫార్మ ఇండస్ట్రీల్లో శిక్షణ పొంది వారి నుంచి ధ్రువపత్రాలు పొందుతారు. విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రతి ఏటా నవంబర్‌ మాసంలో నిర్వహిస్తారు.


ప్రయోగ పరిజ్ఞానం అవసరం

- కె.ఎన్‌.వి.రావు, ప్రిన్సిపల్‌

మంచి కళాశాలను ఎంచుకుని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. నాలుగేళ్ల కోర్సులో విద్యార్థులు ప్రయోగ పరిజ్ఞానం పొందాల్సి ఉంటుంది. కోర్సులో భాగంగా మందుల తయారీ, వాడకం వంటి విషయాలపై మరింత అవగాహన పెంచుకోవాలి. కోర్సు పూర్తయిన వారికి దేశ, విదేశాల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అనేక ఫార్మ కంపెనీల్లో విద్యార్థులు ఉద్యోగాలు పొందవచ్చు.


ఉపాధి అవకాశాలు త్వరగా లభిస్తాయని

- గాయత్రి, బి.ఫార్మసీ, నాల్గో సంవత్సరం

ఉపాధి అవకాశాలు త్వరగా లభిస్తాయని ఫార్మసీ కోర్సును చదువుతున్నాను. ఈ నాలుగేళ్లలో ఎన్నో విషయాలపై అవగాహన పొందాను. ప్రతి రోజు తరగతులకు హాజరవుతూ...ప్రయోగాలు చేశాను. వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించాను. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నా. ఫార్మసీ విద్యకు రానున్న రోజుల్లో మరింత డిమాండ్‌ పెరుగుతుంది.


సొంత కంపెనీలు స్థాపించుకోవచ్చు

-సీహెచ్‌.సంపత్‌కుమార్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదాద్రి,భువనగిరి జిల్లా

ఫార్మసీ పూర్తిచేసిన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో చిన్న, మధ్య తరహా కంపెనీలు స్థాపించుకోవచ్ఛు పీహెచ్‌సీలు, ఆసుపత్రుల్లో ఫార్మసిస్ట్‌లుగా ఉపాధి అవకాశాలు పొందవచ్ఛుడ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లుగా ఎంపిక కావోచ్ఛు ఫార్మా ల్యాబ్‌ల్లో ఎనలిస్ట్‌గా పనిచేయవచ్ఛు దేశ, విదేశాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. వేతనాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. ఫార్మ కంపెనీల్లో ప్రొడక్షన్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌, రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో మందులు, విటమిన్ల వాడకం పెరిగిన నేపథ్యంలో సొంత మెడికల్‌ డిస్ట్రిబ్యూషన్‌, రిటైల్‌ షాపులు నెలకొల్పి ఉపాధి పొందవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని