logo

తనిఖీలు చేస్తూ.. ఆదాయం పెంచుతూ

ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు వాహనాలు భారీగా గండికొడుతున్నాయి. మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమారు 2 కిలో మీటర్ల దూరం వరకు ప్రైవేటు వాహనాలపై నిషేధం ఉంటుంది.

Published : 06 Dec 2021 04:54 IST

ఆర్టీసీకి రాబడి వచ్చేలా అధికారుల చర్యలు


సూర్యాపేట కొత్త బస్టాండ్‌ జాతీయ రహదారిపై తనిఖీ చేస్తున్న ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు(దాచిన చిత్రం) 

కుడకుడరోడ్డు(సూర్యాపేట), న్యూస్‌టుడే: ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు వాహనాలు భారీగా గండికొడుతున్నాయి. మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమారు 2 కిలో మీటర్ల దూరం వరకు ప్రైవేటు వాహనాలపై నిషేధం ఉంటుంది. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు నవంబరు 24 నుంచి జాతీయ రహదారిపై ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్టాండు సమీపంలోకి ప్రైవేటు వాహనాలు రాకుండా.. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఎక్కించేందుకు ప్రతి రోజు నలుగురు ఉద్యోగులకు రెండు విడతల్లో బాధ్యతలు అప్పగించారు. బహిరంగంగా, బలవంతంగా ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు వాహనాలపై తనిఖీలు చేపడుతున్నారు. ఉపాధి పేరుతో కొంత మంది ప్రైవేటు వాహనాలను నడిపిస్తున్నట్లు చెబుతున్నా. ఈ ముసుగులో కొంత మంది బడా వ్యాపారులు వాహనాలకు డ్రైవర్లను నియమించుకొని ఆర్టీసీ ఆదాయాన్ని రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసి ఆర్టీసీ ఆదాయం పెరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటీకే 447 ప్రైవేటు వాహనాలను తనిఖీ చేసి.. అక్రమంగా రవాణా చేస్తున్న 26 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల ధ్రువపత్రాలు లేని, శిక్షణ లేని 33 ప్రైవేటు వాహనాల ఛోదకులకు రూ.58,887/-లు అపరాధ రుసుము విధించారు.


కఠిన చర్యలు తీసుకుంటాం

- జి.కేశవులు, ఆర్టీసీ, డివిజన్‌ మేనేజర్‌, సూర్యాపేట

ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు వాహనాల యాజమాన్యంపై పోలీసు, ఆర్టీఏ శాఖ సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఆర్టీఏ యాక్ట్‌ ప్రకారం ప్రైవేటు వాహనాలు బస్టాండ్‌కి 2 కిలో మీటర్ల దూరంలో ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కిస్తున్న ప్రైవేటు వాహనాలపై జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని