logo

నుడా ఏర్పాటుకు కసరత్తు షురూ

నీలగిరి పట్టణ విస్తరణకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కొత్తగా నల్గొండ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా)ఏర్పాటకు కసరత్తు ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో గడియారం కేంద్రాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని నలు దిశలా 14 కి.మీ మేర

Published : 06 Jan 2022 02:50 IST

మారనున్న నీలగిరి రూపురేఖలు
నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే

అధికారులు ప్రతిపాదించిన నుడా విస్తరణ చిత్రం

నీలగిరి పట్టణ విస్తరణకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. కొత్తగా నల్గొండ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా)ఏర్పాటకు కసరత్తు ప్రారంభించారు. నల్గొండ పట్టణంలో గడియారం కేంద్రాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని నలు దిశలా 14 కి.మీ మేర పరిధిలో ఉన్న గ్రామాలను నుడా కిందకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మరో పక్క నల్గొండ పట్టణ రూపురేఖలు మార్చేందుకు పుర యంత్రాంగం కుస్తీ పడుతుంది. ప్రధాన రహదారుల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనల తయారు చేసే పనిలో నిమగ్నమైంది నుడా పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కొత్త వెంచర్లు వేసి పట్టణాభివృద్ధికి నిధులు సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించే పనిలో యంత్రాంగం దృష్టి సారించింది.  

615 చదరపు కి.మీ పరిధితో..

పట్టణాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పట్టణాన్ని నలుదిశలా అభివృద్ధి చేసేందుకు నూతనంగా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని తెర మీదకు తీసుకొచ్చింది. నల్గొండ మున్సిపాలిటీలోని 48 వార్డులతోపాటు నల్గొండ, తిప్పర్తి, కట్టంగూరు, నార్కట్‌పల్లి మండలాల పరిధిలోని 26 గ్రామాలను కలుపుకొని నుడా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ప్రస్తుతం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 105 చ.కి.మీ వైశాల్యం విస్తరించి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం నల్గొండ చుట్టు 14 కి.మీ మేర విస్తరించాలని ప్రతిపాదనలు తయారు చేశారు. 6 కి.మీ పరిధి పరిగణనలోకి తీసుకుంటే నుడా విస్తీర్ణం 113.04 చ.కి.మీ పెరుగుతుంది.  8 కి.మీ పరిధి పరిగణనలోకి తీసుకుంటే 200 చ.కి.మీ, 10కి.మీ పరిధిలో చూస్తే 341 చ.కి.మీ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 14కి.మీ పరిధి పరిగణలోకి తీసుకుంటే 615 చ.కి.మీ వైశాల్యం పరిధిలో పరిశీలిస్తే నల్గొండ, తిప్పర్తి, కట్టంగూరు, నార్కట్‌పల్లి మండలాల పరిధిలోని గ్రామాలు కంచనపల్లి, మేళ్ల దుప్పలపల్లి, చందనపల్లి, ముషంపల్లి, అప్పాజిపేట, రాములబండ, కాకుల కొండారం, కనగల్‌, చర్లగౌరారం, పగడిమర్రి, దోరపల్లి, పర్వతగిరి, ధర్వేశిపురం, తొర్రగల్‌, పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, సూరారం, బొల్లెపల్లి, కట్టంగూరు, యల్లారెడ్డిగూడెం, కంకణాపల్లి, కొర్రివానిగూడెం, మద్దివాణిగూడెం, రామాలింగాలగూడెం, జంగమదేవిగూడెం, మల్లెపల్లివారిగూడెం వరకు నుడాను విస్తరించే అవకాశం ఉన్నట్లు  తెలిసింది. నుడా కార్యరూపం దాల్చితే త్వరలో అమల్లోకి రానున్న కొత్త మాస్టర్‌ప్లాన్‌లో గ్రామాల చేర్పుల మూలంగా మరింత ఆలస్యంఅయ్యే అవకాశం ఉంది.


ఛైర్మన్‌ కుర్చీపై ఆశలు

ల్గొండ నుడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో సంస్థ ఛైర్మన్‌ కుర్చీపై అప్పుడే అధికారపార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు  పైరవీలు ప్రారంభించినట్లు ప్రచారం సాగుతోంది. మరో పక్క కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడిని తెరాసలో తీసుకొచ్చి నుడా ఛైర్మన్‌ పదవి అప్పగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార పార్టీ నాయకులే మాట్లాడుకోవడం చర్చనీయాశంగా మారింది.


విస్తరించనున్న పట్టణ రహదారులు

పట్టణంలో రహదారులు ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు గమనించిన మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు రోడ్లను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ముందుగా నల్గొండ పట్టణంలోని మాస్టర్‌ ప్లాను ప్రకారం ఏడు మార్గాల్లో రోడ్లను 12 జంక్షన్లు విస్తరించాలని  ప్రతిపాదనల రూపొందించారు. అందులో తొలిదశ ఆరు జంక్షన్లు, హైదరాబాద్‌రోడ్డు, దేవకొండరోడ్డు, కలెక్టరేట్‌రోడ్డు మార్గాలను విస్తరించాలని నిర్ణయించారు. రెండో విడతలో మిగతా పనులు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. నుడా ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించడంతో నల్గొండ చుట్టూ  స్థిరాస్తి వ్యాపారం పుంజుకునే అవకాశంఉంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని