logo

కాపు కాసి...జీవాలు మాయం చేసి

తెల్లవారు జామున ఇన్నోవాలో జాతీయ రహదారిపై వారు కాపు కాస్తారు. గొర్రెలను తీసుకొని మార్కెట్లో అమ్మడానికి వెళుతున్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుంటారు. అలాంటి వ్యక్తలు కనిపించగానే పోలీస్‌ సైరన్‌ మోగిస్తూ వాహనాన్ని అడ్డుకుంటారు. ‘గొర్రెలను ఎక్కడికి తీసుకెళుతున్నారు.

Published : 19 Jan 2022 01:11 IST

 ఖాజా వహబుద్దీన్‌ ముఠాను పట్టుకున్న పోలీసులు
 పిస్టల్‌, ఏడు బుల్లెట్లతో పాటు కత్తులు, నగదు స్వాధీనం
ఈనాడు, సంగారెడ్డి

దొంగల ముఠాతో పోలీసులు

తెల్లవారు జామున ఇన్నోవాలో జాతీయ రహదారిపై వారు కాపు కాస్తారు. గొర్రెలను తీసుకొని మార్కెట్లో అమ్మడానికి వెళుతున్న వాహనాలనే లక్ష్యంగా చేసుకుంటారు. అలాంటి వ్యక్తలు కనిపించగానే పోలీస్‌ సైరన్‌ మోగిస్తూ వాహనాన్ని అడ్డుకుంటారు. ‘గొర్రెలను ఎక్కడికి తీసుకెళుతున్నారు. వాహనానికి అన్నిరకాల పత్రాలున్నాయా’.. అంటూ హడావుడి చేస్తారు. వారు గందరగోళంలో పడగానే... తమ వాహనంలో ఎక్కించుకెళతారు. కొంత దూరం వెళ్లాక వారిని బెదిరించి ఉన్నదంతా దోచుకొని రోడ్డుపై విడిచిపెడతారు. ఈలోగా మిగతా ముఠా సభ్యులు గొర్రెల వాహనాన్ని తీసుకెళ్లి అమ్మేస్తారు.  ఇదీ 52 కేసులున్న ఖాజా వహబుద్దీన్‌ ముఠా నేరాలు చేసే తీరు. ఇటీవల ఈ తరహా దోపిడీలకు సంబంధించి రెండు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీసులు తక్కువ వ్యవధిలో వారిని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.


స్వాధీనం చేసుకున్న నగదు, బుల్లెట్లు, కత్తులు

ముఠా ఏర్పాటు చేశాడు

చాంద్రాయణ గుట్ట నివాసి ఖాజా వహబుద్దీన్‌ (45) తమ ప్రాంతానికి చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురితో  కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు.మధ్యప్రదేశ్‌నుంచి పిస్టల్‌తో పాటు బుల్లెట్లను కొనుగోలు చేశాడు.  గతనెల 8న మహారాష్ట్రకు చెందిన మహదేవ్‌ బీరూ గోడ్కే తన బొలెరో వాహనంలో గొర్రెలను జియాగూడ మార్కెట్‌ను తీసుకెళుతున్నారు. తెల్లవారుజామున 4.30గంటలకు ఇన్నోవాలో వచ్చిన వహబుద్దీన్‌ ముఠా సభ్యులు పోలీసులమని ఆపారు. వారిని తమతో తీసుకెళ్లి మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద దించేశారు. ఈలోగా మిగతా నిందితులు బొలెరో వాహనంతో పాటు గొర్రెలను ఎత్తుకెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
52 కేసులు... రెండు సార్లు పిస్టల్‌తో  దొరికినా..    
ఖాజా వహబుద్దీన్‌కు సుదీర్ఘ నేరచరిత్రే ఉంది. ఇప్పటి వరకు 52కేసులు నమోదుకాగా గతంలో, పిస్టల్‌ కలిగి ఉండటంతో రెండుసార్లు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తాజాగా అతడిని అరెస్టు చేయగా పిస్టల్‌ ఉన్నట్లు గుర్తించారు. జల్సా జీవితానికి అలవాటుపడిన ఖాజా ఇలా దారిదోపిడీలకు పథకం వేశాడు. ఈ ముఠాకు సహకరించిన తైమూరు, అమీర్‌, షేక్‌ ఇమ్రాన్‌లు పరారీలో ఉన్నారు. వీరిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రమణకుమార్‌ తెలిపారు. ఈ సమావేశంలో పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి, సీఐలు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.


ఈ నెల 13న రెండో ఘటన!

సరిగ్గా ఇలాంటి రీతిలోనే ఈనెల 13న మరో ఘటన జరిగింది. మహారాష్ట్రకు చెందిన షేక్‌ తస్లీం దేశ్‌ముఖ్‌ తన డ్రైవర్‌ కిషన్‌ భజరంగ్‌, మరో వ్యక్తి హనుమాన్‌తో కలిసి గొర్రెలను జియాగూడ మార్కెట్‌కు తరలిస్తున్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారం వద్ద తెల్లవారుజామున 3.30గంటల సమయంలో ఇన్నోవా వాహనంలో వచ్చిన కొందరు దుండగులు వీరి వాహనాన్ని ఆపి తాము పోలీసులమని చెప్పారు. గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో వాహనాన్ని సోదా చేయాలని చెప్పి.. వారిని తమ వాహనంలో ఎక్కించుకున్నారు. మరో ఇద్దరు నిందితులు గొర్రెలను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని తీసుకెళ్లిపోయారు. బాధితుల వద్ద ఉన్న రూ.7వేలు, సెల్‌ఫోన్లు లాక్కొని శామీర్‌పేటలో వదిలిపెట్టి చెంగిచెర్ల వద్ద ఉన్న మీ వాహనాన్ని తీసుకెళ్లండి అంటూ చెప్పారు. వారు అక్కడికి వెళ్లి చూడగా వాహనం ఉన్నా గొర్రెలు కనిపించలేదు. తక్కువ రోజుల వ్యవధిలోనే రెండూ ఒకే తరహా ఘటనలు జరగడంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు... ఖాజా   వహబుద్దీన్‌తో పాటు అతడికి సహకరించిన మహ్మద్‌ తాజుద్దీన్‌ (27), మహ్మద్‌ ఇసాక్‌ (33), మహ్మద్‌ అనీఫ్‌ (35)లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక పిస్టల్‌, రెండు కత్తులు, ఏడు బుల్లెట్లు, రూ.1.51లక్షల నగదు, రూ.3.20లక్షల విలువ  చేసే 60 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ గొర్రెలను సంబంధిత యజమానులకు అప్పగించామని ఎస్పీ రమణకుమార్‌ వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని