logo

నెత్తురోడిన అడవి..!

దండకారణ్యం తుపాకీ తూటాలతో మరోసారి మారుమోగింది. పచ్చందాల అడవి నెత్తురొలికింది. బందూకుల మధ్య ప్రత్యక్ష పోరు కొనసాగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా

Updated : 19 Jan 2022 01:51 IST

వెంకటాపురం మండలంలోని పామునూరు-జెల్ల ప్రాంతం ఈ ప్రదేశంలోనే ఎన్‌కౌంటర్‌ జరిగింది

దండకారణ్యం తుపాకీ తూటాలతో మరోసారి మారుమోగింది. పచ్చందాల అడవి నెత్తురొలికింది. బందూకుల మధ్య ప్రత్యక్ష పోరు కొనసాగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు సమీప కర్రిగుట్ట-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఊసూరు ఠాణా సరిహద్దుల్లో మంగళవారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గ్రేహౌండ్స్‌ బలగాలకు చెందిన కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో మన్యం పల్లెల్లో వాతావరణం వేడెక్కింది.

ఈనాడు, డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వెంకటాపురం, న్యూస్‌టుడే

కొనసాగుతున్న కూంబింగ్‌

జిల్లా సరిహద్దుల్లో పెద్ద ఘటన జరగడంతో ఏజెన్సీ ప్రాంతాలు భయంభయంగా గడుపుతున్నాయి. అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు ఇంకా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. వాజేడు, మంగపేట, వెంకటాపురంలో వాహన తనిఖీలు నిర్వహించారు. అటవీమార్గం గుండా లేదా రోడ్డు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే అవకాశం ఉండటంతో రహదారులపైనా పోలీసులు నిఘా పెట్టారు.

సంయుక్తంగా అడవుల్లోకి బలగాలు

ఛత్తీస్‌గఢ్‌ కీకారణ్యన్ని షెల్టర్‌ జోన్‌గా చేసుకుని మావోయిస్టులు తమ కార్యకలపాలు కొనసాగిస్తున్నారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకత్వంతో పాటు జేఎండబ్ల్యూపీ (జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి), వెంకటాపురం-వాజేడు, ఏటూరునాగారం-మహదేవ్‌పూర్‌, గుండాల-నర్సంపేట, మహబూబాబాద్‌ ఏరియా కమిటీల దళాలు సంచరిస్తున్నట్లు ఎస్‌ఐబీ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా వ్యూహాలు పన్నినట్లు తెలుస్తోంది. దండకారణ్యంలో మావోయిస్టు దళం సంచరిస్తుందనే పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్‌ బలగాలు మూడు రోజుల కిందటే సర్కిల్‌ పోలీసుల సహకారంతో సంయుక్తంగా అడవుల్లోకి చొచ్చుకెళ్లాయి. వెంకటాపురం మండల కేంద్రానికి సుమారు 10 నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న కర్రిగుట్ట ప్రాంతంలో పాగా వేసి మావోయిస్టులపై ముప్పెటదాడి చేసినట్లు తెలుస్తోంది.

మూడు నెలల్లోనే మళ్లీ పేలిన తూటా

గతేడాది అక్టోబర్‌ 25న వాజేడు మండలం పెనుగోలుకు సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో గ్రేహౌండ్స్‌ బలగాలు పంజా విసిరాయి. ఈ ఘటనలో ఏరియా కమిటీ సభ్యుడితో సహ ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మూడు నెలలు గడవక ముందే తాజాగా మావోయిస్టుల షెల్టర్‌జోన్‌లో మళ్లీ తూటాల శబ్దం వినిపించింది.


సంఘటనా స్థలంలో దొరికిన తుపాకులు

దొరికినట్లే దొరికి తప్పించుకున్నారు..!

దండకారణ్యంలో కీలక మావోయిస్టు నేత ముచ్చాకి ఉంగాల్‌ అలియాస్‌ సుధాకర్‌ కేంద్రంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. పక్కా సమాచారంతో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో సుధాకర్‌పై గురి పెట్టినా దొరికినట్లే దొరికి తప్పించుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి ఆయన ప్రస్తుతం జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ దళ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎన్‌కౌంటర్‌లో సుధాకర్‌ మృతి చెందినట్లు పోలీసులు భావించారు. ఈ క్రమంలో ప్రచార మాధ్యమాల్లోనూ విస్తృతంగా చక్కర్లు కొట్టింది. చివరికి ఘటన ప్రాంతం నుంచి తప్పించుకున్నట్లు భావిస్తున్నారు.


ఉదయం 6:00: ఎదురుకాల్పులు ప్రారంభం 8:00: సంఘటన వెలుగులోకి వచ్చింది 9:10: అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు 5:29 జిల్లా ఎస్పీ పేరుతో సంఘటనను ధ్రువీకరిస్తూ ప్రకటన విడుదల


ఆగమేఘాలపై హైదరాబాద్‌కు..

ఉదయం 11.50 గాయపడిన కానిస్టేబుల్‌ మధును వెంకటాపురం హెలిప్యాడ్‌ వద్ద హెలికాప్టర్‌లోకి ఎక్కించుకున్నారు.

12.32 హనుమకొండ సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుంది

12.45 హెలికాప్టర్‌ వద్దకు వైద్య సిబ్బంది చేరుకున్నారు.

12.50 నుంచి 1.40 వరకు: అంబులెన్స్‌లో చికిత్స అందించారు.

1.45 మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు బయలుదేరారు.

వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి పర్యవేక్షణలో సెంట్రల్‌జోన్‌ డీసీపీ కె.పుష్పారెడ్డి, పలువురు పోలీసు అధికారులు పర్యవేక్షించారు.

-వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని