logo
Updated : 22 Jan 2022 06:54 IST

Pushpa: కేశవుడు మనోడే.. మచ్చా!

చిన్నకొడెపాక నుంచి సినిమాల వైపు..
ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ఈలలు, గోలలతో సందడి చేస్తోంది.. హీరో అల్లు అర్జున్‌ ఓ రేంజ్‌లో నటనని పండించారు.. ఆయన  పక్కనే ఎప్పుడూ మచ్చా.. మచ్చా..  అంటూ ఉండే కేశవ ఎవరో కాదు మనోడే.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడెపాకకు చెందిన బండారి జగదీశ్‌ ప్రతాప్‌. అనతి కాలంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టార్‌ హీరో పక్కన నటించి మంచి మార్కులు కొట్టేశాడు.

పుష్ప సినిమా షూటింగ్‌లో..
జగదీశ్‌ ప్రతాప్‌ తల్లిదండ్రులు బండారి చంద్రమౌళి-లలిత, అక్క ఝాన్సీరచన, చెల్లెలు దివ్య.. నాన్న పోస్ట్‌మాన్‌, అమ్మ ఇంటిపనితో పాటు వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. 1 నుంచి ఆరో తరగతి వరకు చిన్నకొడెపాకలో, ఇంటర్‌, డిగ్రీ(బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్‌) హనుమకొండలో పూర్తి చేశారు. 2013లో డిగ్రీ పూర్తయింది. నటనపై ఉన్న మమకారంతో చిన్నచిన్న  ప్రయత్నాలు మొదలెట్టారు. లఘు చిత్రాలకు దర్శకత్వం వహించేవారు.. ఇంటి వద్ద అమ్మతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లడం, ఖాళీ దొరికితే హనుమకొండ, వరంగల్‌కు వచ్చి సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేశారు. ‘నిరుద్యోగ నటులు’ అనే వెబ్‌సిరీస్‌లో నటించి అందరి మన్ననలు పొందారు. తర్వాత ‘మల్లేశం’ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. తర్వాత పలాస 1978, జార్జిరెడ్డి, ఊరికి  ఉత్తరాన సినిమాల్లో అవకాశం దక్కడంతో నటనలో తన మార్కు నిరూపించుకున్నారు.. కొత్తపోరడు, గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి వెబ్‌ సిరీస్‌లో కూడా మెరిశారు.  కడప యాసలో మాట్లాడి మెప్పించారు. ఆ యాసతోనే పుష్పలో అవకాశం దక్కింది.

ఇంట్లో ఇష్టం లేకున్నా..
సినిమాలు, నటన అని తిరుగుతుంటే ఇంట్లో వారు ఒప్పుకోలేదు. ఏదైనా సాధించాలనే తపనతో ప్రయత్నాలు చేశారు. తండ్రి చంద్రమౌళి చిందు యక్షగానం, నాటకాలు వేసేవారు. చిన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని తండ్రి ప్రోత్సహించారు. తండ్రి.. ప్రతాప్‌ను పోలీసుగా చూడాలని భావించి, కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు. అయినా సినిమాలవైపే అడుగులు వేశారు.

అవకాశం వచ్చిందిలా..

పుష్ప కోసం మొదటిసారి ఆడిషన్‌ ఇచ్చి మెప్పించారు. 2019 డిసెంబర్‌లో రెండో ఆడిషన్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌తో ఆరు గంటల పాటు ఆడిషన్‌ ఇచ్చి ఆయనను ఆకట్టుకున్నారు. కేశవ పాత్ర కోసం చిత్తూరు యాసలో మాట్లాడి అవకాశం దక్కించుకున్నారు. వారం రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్‌లోని రోడ్డు ప్రమాదంలో ప్రతాప్‌ తీవ్రంగా గాయపడగా చేయి విరిగింది. దీంతో ఇంత పెద్ద అవకాశం చేజారుతుందోమోనని భయపడ్డారు. చిత్ర యూనిట్‌కు సమాచారం ఇచ్చారు. అంతలోనే కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో కొంతకాలం షూటింగ్‌ నిలిపివేశారు. ఆ తర్వాత కొనసాగిన షెడ్యూల్‌లో పాల్గొన్నారు.

కొత్త జీవితాన్ని ఇచ్చింది.. : బండారి జగదీశ్‌ ప్రతాప్‌(కేశవ)
అల్లు అర్జున్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు మంచి పాత్ర లభించింది. పుష్ప కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలో చేయాలనే ఆలోచన ఉండేది. ఆ దిశగానే ప్రయత్నాలు చేశాను. దర్శకుడు సుకుమార్‌ నాకు జీవితంపై నమ్మకం కల్పించారు.  అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప-2పై దృష్టి పెట్టాను.

Read latest Warangal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని