Uttarakhand: బాబోయ్‌.. కొండలెక్కడం అంత ఈజీ కాదు..!

పర్వతారోహణ చెయ్యడమంటే చాలా మందికి భలే సరదా. అయితే పర్వతారోహణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను తెలుసుకొని, సరైన శిక్షణ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లడం ఉత్తమం అని చెబుతున్నారు  నిపుణులు. ఆ సమస్యలేంటి..? పరిష్కార మార్గాలేంటి?

Published : 04 Oct 2022 18:42 IST

ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా సంభవించిన హిమపాతం కారణంగా 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మంది పర్వతారోహణకు వెళ్లినట్లు తెలుస్తోంది. తక్షణమే స్పందించిన విపత్తు ప్రతిస్పందన సహాయక బృందాలు 8 మందిని రక్షించాయి. మిగతావారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్వతారోహకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది? వాటి నుంచి ఎలా బయటపడాలో  తెలుసుకుందామా?

ఎత్తైన కొండలపై నడుచుకుంటూ ప్రకృతిని ఆస్వాదించడమంటే కొందరికి భలే సరదా. పర్వతారోహణను ప్రతికూల వాతావరణంలో చేసే ఒక రకమైన సాహస క్రీడగానే చెప్పాలి. శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు కూడా ఇది ఓ మార్గమే. అయితే, ట్రెక్కింగ్‌కి వెళ్లే వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనేందుకు ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. అవసరమైతే నిపుణులతో శిక్షణ తీసుకోవాల్సిందే. లేదంటే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదముంది. ఇంతకీ పర్వతారోహకులు ఎదుర్కొనే సమస్యలేంటి?

1. ఊహించని ప్రమాదాలు

మంచుకొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఉన్నట్లుండి హిమపాతం సంభవించొచ్చు. కొన్ని సార్లు పర్వతభాగం కుంగిపోవచ్చు. నునుపైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ చేసే క్రమంలో కాలుజారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందువల్ల పర్వతారోహణకు వెళ్లే ముందు కచ్చితంగా శిక్షణ తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలనన్న నమ్మకం వచ్చిన తర్వాతే పర్వతారోహణకు సిద్ధమవ్వాలి. లేదంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే అవుతుంది.

2. అరికాళ్లలో బొబ్బలు

దాదాపు సగానికిపైగా పర్వతారోహకులు ఎదుర్కొనే సమస్య ఇది. పర్వతాలను అధిరోహించే క్రమంలో బూట్లకు, ఏటవాలుగా ఉన్న కొండ ఉపరితలానికి మధ్య తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఈ క్రమంలో అరికాళ్లలో బొబ్బలు ఏర్పడి.. పర్వతారోహకులకు తీవ్ర సమస్యగా మారతాయి. కొన్నిసార్లు ఇవి పగిలిపోయి గాయాలుగా మారిపోతాయి. అందుకోసం ఇలాంటి సమస్యలు తలెత్తకుండా నిపుణుల సూచన మేరకు సరైన బూట్లను ఎంపిక చేసుకోవాలి. కాళ్లకు కచ్చితంగా సరిపోయేలా చూసుకోవాలి. తేలికగా ఉండి, మడమ మొత్తం బూట్ల అడుగుబాగాన ఆనుకునేలా ఉన్న బూట్లను ఎంపిక చేసుకోవాలి. క్వాలిటీ సాక్సులు ఉండేలా చూసుకోవాలి. పర్వత భాగానికి, కాలికి మధ్య ఏర్పడిన ఒత్తిడిని ఇవి కొంతవరకు తగ్గిస్తాయి.

3. చర్మ సమస్యలు

పర్వతారోహణ కోసం దేశ విదేశాల నుంచి వస్తారు. విభిన్న వాతావరణాల్లో పెరిగిన వారుంటారు.అందువల్ల వారి శరీరం అక్కడి వాతావరణానికి అలవాటుపడి ఉంటుంది. ఒక్కసారిగా ప్రతికూల వాతావరణంలోకి వచ్చేసరికి సాధారణంగానే చిన్నపాటి చర్మ సమస్యలు ఏర్పడతాయి. అలాంటిది పర్వతారోహణ సమయంలో దీని ప్రభావం మరింతగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడే అవకాశముంది. అందువల్ల శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచేలా తేలికపాటి దుస్తుల్ని ఎంపిక చేసుకోవాలి. లో దుస్తుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీ షర్టులు వేసుకున్నప్పుడు వాటిని పూర్తిగా కప్పి ఉంచేలా పొడవాటి మరో చొక్కాను ధరించడం ఉత్తమం. చిన్నపాటి ప్రాథమిక చికిత్సపెట్టెను తమతోపాటు తీసుకెళ్లడం మంచిది.

4. మోకాళ్ల నొప్పులు

ఎత్తయిన ప్రదేశాలను ఎక్కుతున్నప్పుడు కాలి ఎముకలు, కీళ్లు, కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రధానంగా కాలి మోకీళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎదుర్కొనేలా ముందుగా జాగ్రత్త పడాలి. పర్వాతారోహణకు వెళ్లడానికి కొన్ని నెలల ముందునుంచే నడటవటం, వ్యాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. అవసరమైతే నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. పర్వతారోహణకు అనుగుణంగా శరీరాన్ని అలవాటు చేసేందుకు సహజంగా 4 నుంచి 6 వారాలు పడుతుంది. వ్యాయామానికి తగ్గట్టుగా శరీరానికి తగిన విశ్రాంతి కూడా ఇవ్వాలి.

5. మెడ నొప్పి..వెన్ను నొప్పి

పర్వతారోహకులు తమ వెంట దుస్తులు, ఆహారంతోపాటు కొన్ని నిత్యావసరాలను బ్యాగులో వేసుకొని తీసుకెళ్తారు. ఓ వైపు వీటి బరువు మోస్తూనే పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వీరికి భుజాల నొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి లాంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని అధిగమించేందుకు బ్యాగు పట్టీలు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. పర్వతారోహణకు వెళ్లడానికి ముందే కొంత బరువును బ్యాగులో మోస్తూ అలవాటు చేసుకోవాలి. పర్వాతారోహకుల కోసం ప్రత్యేకంగా బ్యాగులను తయారు చేసి విక్రయిస్తుంటారు. వాటిని ఒక్కసారి ప్రయత్నించి చూడటం ఉత్తమం.

6. అతిసార సమస్యలు

పర్వతారోహకులకు ఎదుయ్యే అనారోగ్య సమస్యల్లో అతిసారం ప్రధానమైనది.దీని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పర్వతారోహణ సమయంలో పొట్టలో అలజడి మొదలైతే ఆ బాధ వర్ణనాతీతం. అందువల్ల ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. బాగా కాచిచల్లార్చిన నీటినే తాగాలి. లేదంటే ఫిల్టర్‌ నీటిని వెంట తీసుకెళ్లాలి. శాకాహారం మాత్రమే తీసుకోవాలి. కూరగాయాలు వేడినీటిలో కడిగిన తర్వాత మాత్రమే వండాలి. పర్వతారోహణకు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడి ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాతావరణానికి తగినట్లు అక్కడి ఆహారపు అలవాట్లు ఉంటాయి. అందువల్ల శరీరం ముందుగానే అలవాటుపడుతుంది. ప్రతిసారి చేతులు కడుక్కోవడం సాధ్యం కాదు కాబట్టి.. హ్యాండ్‌ శానిటైజర్‌ని వెంట తీసుకెళ్లడం మంచిది.

7. డీహైడ్రేషన్

పర్వతారోహణ సమయంలో బాగా అలసిపోతారు. అందువల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశముంది. దీని నుంచి బయట పడేందుకు వీలైంత ఎక్కువగా నీటిని తాగాలి. అలాగని పెద్దపెద్ద బాటిళ్లు తీసుకొని వెళ్లడం కుదరని పని. అందువల్ల పర్వతారోహకుల కోసం ప్రత్యకమైన రబ్బరు సంచులు ఉంటాయి. వాటిని మాత్రమే తీసుకెళ్లాలి. ప్లాస్టిక్‌ బాటిళ్లను తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. దీనివల్ల బ్యాగులో స్థలం వృథా అవడంతోపాటు అదనపుభారంగా మారుతాయి.

8. వడదెబ్బ

పైకి వెళుతున్న కొద్దీ గాలిలో తేమ మూలంగా వేడి క్రమంగా పెరుగుతుంది. అంతేకాకుండా రోజుకు దాదాపు ఏడెనిమిది గంటలకు పైగా పర్వతారోహణ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దీనిని నుంచి బయటపడేందుకు సన్‌గ్లాస్‌ కళ్లజోడును వాడటం ఉత్తమం. పెదవులు పొడిబారకుండా ఏదైనా లోషన్‌ ఉపయోగించుకోవాలి. పై జాగ్రత్తలన్నీ పాటిస్తూ, సరైన శిక్షణ తీసుకున్న తర్వాత పర్వాతారోహణకు వెళ్తే..అనుకున్నట్లుగా ఎంజాయ్‌ చెయ్యగలుగుతారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని