UN: 2050 నాటికి మరింత దాహం..దాహం..

ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి ఐదు బిలియన్ల (550కోట్ల)కు పైగా జనాభా నీటి కొరతను ఎదుర్కొంటారని ఐక్యరాజ్యసమితి (UN) ఏజెన్సీ నివేదిక

Updated : 07 Oct 2021 05:13 IST

ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడి

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి ఐదు బిలియన్ల (550కోట్ల)కు పైగా జనాభా నీటి కొరతను ఎదుర్కొంటారని ఐక్యరాజ్యసమితి (UN) ఏజెన్సీ నివేదిక హెచ్చరించింది. 2018 సంవత్సరంలో 3.6 బిలియన్ల జనాభాకు కనీసం ఒక నెలలో నీరు అందలేదని.. ఈ సంఖ్య 2050 నాటికి మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘ది స్టేట్‌ ఆఫ్‌ క్లైమేట్‌ సర్వీసెస్‌-2021: నీరు’ అనే పేరుతో నివేదికను రూపొందించి అందులో ఈ విషయాన్ని వెల్లడించింది.

రాబోయే రోజుల్లో వాతావరణంలో పెనుమార్పులు సంభవించి నీటి సంక్షోభం తలెత్తుతుందని, దీంతో నీటి కొరతతో బాధపడే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) అంచనా వేసింది. నీటి నిర్వహణను మెరుగుపరచాలని.. వాతావరణ మార్పులకు శాస్త్రీయ పద్ధతుల ద్వారా నీటి సమస్యను తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనిపై ప్రపంచ వాతావరణ సంస్థ సెక్రెటరీ జనరల్‌ ప్రొఫెసర్‌ పెట్టెరి టాలస్‌ మాట్లాడుతూ.. ‘వాతావరణంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో భూగర్భ జలమట్టాలు పడిపోయి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. వర్షాలు కురవక పంట దిగుబడి తగ్గిపోతుంది. నీటి లభ్యత సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం ఆహార భద్రత మీదే కాకుండా, ఆర్థికాభివృద్ధిపైనా తీవ్రస్థాయిలో పడుతుంది’ అని పేర్కొన్నారు.

నివేదికలోని ముఖ్యాంశాలివే..

‣ గడిచిన 20 ఏళ్లలో భూఉపరితలం, భూగర్భంలో ఉన్న నీటి మట్టాలు 1 సెం.మీ చొప్పున పడిపోయాయి.
‣ గ్రీన్‌ల్యాండ్‌ ప్రాంతంలో అధికంగా నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో ప్రజలు గణనీయమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొననున్నారు.
‣ గత రెండు దశాబ్దాలతో పోలిస్తే 2000 నుంచి ప్రకృతి విపత్తుల కారణంగా 134 శాతం ప్రమాదాలు పెరగడం గమనార్హం. ఇలాంటి విపత్తులు ఆసియాలోనే ఎక్కువగా ఏర్పడి అధిక ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి.
‣ ఇదే సమయంలో నీటి కొరతతో ఏర్పడిన ప్రమాదాల సంఖ్య కూడా 29 శాతం పెరిగాయి. నీటి కొరతతో ఆఫ్రికాలో అధిక మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలోనూ నీటి సంక్షోభాన్ని నివారించే పరిష్కార మార్గాలతో పాటు, పర్యావరణ పరిరక్షణ చర్యలూ చేపట్టాలని నివేదిక సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని