సరైన వివరాలివ్వండి..

గతవారం రాజ్‌కోట్‌లోని కొవిడ్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సరైన వివరాలివ్వని కారణంగా గుజరాత్ ప్రభుత్వంపై మంగళవారం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెడుతుందన్న ఉన్నత న్యాయస్థానం, ఘటనపై కొత్త అఫిడవిట్‌ను దాఖలు చేయమని ఆదేశించింది.

Published : 01 Dec 2020 23:38 IST

గుజరాత్‌కు ఉన్నత న్యాయస్థానం ఆదేశం

దిల్లీ: గతవారం రాజ్‌కోట్‌లోని కొవిడ్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై సరైన వివరాలివ్వని కారణంగా గుజరాత్ ప్రభుత్వంపై మంగళవారం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపెడుతుందన్న ఉన్నత న్యాయస్థానం, ఘటనపై కొత్త అఫిడవిట్‌ను దాఖలు చేయమని ఆదేశించింది. గత శుక్రవారం రాజ్‌కోట్‌లోని ఉదయ్‌ శివానంద్ ఆస్పత్రిలో మంటలు చెలరేగగా ఆరుగురు కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. మంటలు ఐసీయూ నుంచి వ్యాపించాయని పోలీసులు తెలుపగా, ఆస్పత్రి యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోనందునే ప్రమాదం జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది. ‘‘మీరు చెప్పినట్లు అన్ని సరిగ్గా ఉన్నప్పుడు, మీ ఎలక్ట్రిక్‌ ఇంజనీర్‌ ఇచ్చిన నివేదిక మీరు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఎలా ఉందని’’ సుప్రీంకోర్టు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆస్పత్రిని నిర్వహిస్తున్న గోకుల్‌ హెల్త్‌కేర్‌కు సంబంధించిన ముగ్గురిని సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ డిసెంబరు 3కు వాయిదా వేశారు. తాజా అఫిడవిట్‌లో ప్రభుత్వం అన్ని వాస్తవాలను పొందుపరిచేలా చూడాలని ఉన్నత న్యాయస్థానం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది. అగ్ని ప్రమాదానికి గురైన ఉదయ్‌శివానంద్‌ ఆస్పత్రి సెప్టెంబరు 15న కొవిడ్‌ చికిత్సలకు అనుమతి పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని