టార్గెట్‌ మిస్‌కాని ‘ఇన్సాస్‌ రైఫిల్’‌.. ఇంకెన్నో!

పోలీస్‌ ఆయుధ సంపత్తి ఆధునికతను సంతరించుకుంటోంది. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు గ్రౌండ్స్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని విజయవాడ పోలీసులు ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఆధునిక గ్లార్గ్‌ 9 ఎంఎం పిస్టల్‌ నగర పోలీసులు ..........

Published : 25 Oct 2020 02:12 IST

అధునాతన ఆయుధ సంపత్తి.. విజయవాడ పోలీస్ సొంతం

విద్యార్థుల్ని ఆకట్టుకుంటున్న ఓపెన్ హౌస్‌ కార్యక్రమం

విజయవాడ: పోలీస్‌ ఆయుధ సంపత్తి ఆధునికతను సంతరించుకుంటోంది. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వు గ్రౌండ్స్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని విజయవాడ పోలీసులు ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఆధునిక గ్లార్గ్‌ 9 ఎంఎం పిస్టల్‌ నగర పోలీసులు ఈ ప్రదర్శనలో ఉంచారు. అలాగే, భూమిలో ఉన్న క్లైమోర్‌ మైన్స్‌ను గుర్తించేందుకు ఆధునిక పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్‌ కాలంలో వాడిన 303 రైఫిల్‌ నుంచి అత్యాధునికంగా వాడుతున్న ఏకే 47,  బాంబ్‌లను నిర్వీర్యం చేసే వినూత్న సాంకేతిక పరికరాలనూ ప్రదర్శించారు. ఇలాంటి అత్యాధునిక ఆయుధ సంపత్తితో ఎప్పుడు ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగర పోలీసులు వినియోగిస్తున్న ఆయుధాలపై ప్రత్యేక కథనం..  

100 మీటర్ల దూరంలో ఉన్నా..
ఇదిగో ఇది ఇన్సాస్‌ రైఫిల్‌.. 100 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను కచ్చితంగా దీంతో షూట్‌ చేయవచ్చు. ఎక్కువ దూరం దాటితే మాత్రం వేగం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనలో యాంటీ రాయిటీ గన్‌తో పాటు ఎఎస్‌ఎల్‌ఆర్‌, లైట్‌ మిషన్‌ గన్‌లను కూడా ఉంచారు. విద్యార్థులంతా వచ్చి వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇప్పటిదాకా సినిమాలు, వీడియో గేమ్‌లలో మాత్రమే ఇలాంటి ఆయుధాలను చూసిన విద్యార్థులు.. వీటిని ప్రత్యక్షంగా చూసేసరికి ఎంతో ఆనందపడుతున్నారు. ఇవి ఎలా పనిచేస్తుంటాయి? ఏయే సమయాల్లో వీటిని వినియోగిస్తారు? తదితర అంశాలను అధికారులు విద్యార్థులకు వివరిస్తున్నారు. 


ఇదిగో దీన్ని ఎల్‌ఎంజీ (లైట్‌ మిషన్‌ గన్‌) అంటారు. యుద్ధ సమయాల్లో, దూరంగా ఉన్నవాళ్లను వరుసగా కాల్చేందుకు దీన్ని ఉపయోగిస్తారని అధికారులు వెల్లడించారు.


బ్లాక్‌ పిస్టల్‌

ఇది అమెరికాలో తయారైన బ్లాక్‌ పిస్టల్‌. ప్రస్తుతం ఉన్నవాటిలో ఆధునిక పిస్టల్‌.25మీటర్ల వరకు అక్యురేట్‌ రేంజ్‌ ఉంటుంది. దీని మ్యాగజీన్‌లలో ఆస్ట్రియాకు చెందినదైతే 15 బుల్లెట్ల వరకు లోడ్‌ చేయవచ్చు.. అదే అమెరికాకు సంబంధించినదైతే 17 బుల్లెట్లు వరకు లోడ్‌ చేయవచ్చని చెబుతున్నారు. 


బాంబుల్ని గుర్తించే ఎన్‌ఎల్‌డీజీ

ఇది ఎన్‌ఎల్‌జీడీ. చాలా అధునాతన సాంకేతికతతో కూడిన పరికరం. రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేసే బాంబులను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. నాన్‌ లీనియర్‌ జంక్షన్‌ డిటెక్టర్ (ఎన్‌ఎల్‌జీడీ) అంటారు. సెల్‌ఫోన్‌ బాంబులను, రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేసే బాంబులను గుర్తిస్తుంది. క్రస్టడ్‌ ఐటెంలను కూడా గుర్తిస్తుంది. 


బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వస్తే?

రియల్‌టైం వ్యూయింగ్‌ సిస్టమ్‌ (ఆర్టీవీఎస్‌) కూడా పోలీసుల వద్ద అందుబాటులో ఉంది. ఏదైనా బస్టాండ్‌లోనో, రైల్వేస్టోషన్‌లోనో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్‌ వస్తే ఈ పరికరంతోనే అక్కడికి చేరుకుంటారు. పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగో/సూట్‌కేసునో గుర్తించి వాటిని కదపకుండా వాటిలో ఏం ఉన్నాయి? డిటోనేటర్‌ ఏవైపు ఉంది? పవర్‌ సోర్స్‌ ఎటువైపు ఉందో? ఎక్స్‌ప్లోజివ్‌ ఎంత పరిమాణంలో ఉంది? ఈ పరికరంలోని ఇమేజ్‌లో చేసి డిఫ్యూజ్‌ చేసేందుకు సులువుగా ఉంటుందని చెబుతున్నారు.


డిస్పోజల్‌ సూట్‌లతో సురక్షితమేనా?  

ఎక్కడైనా పెట్టిన బాంబులను నిర్వీర్యం చేసేందుకు బాంబు బ్లాంకెట్స్‌, బాంబ్‌ రింగ్‌, బాంబ్‌ సూట్‌, బాంబ్‌ హెల్మెట్‌, బాంబ్‌ స్టోన్‌గార్డ్‌.. ఇవన్నీ వాడతారు. దీనిపై పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరింపు సమాచారం రాగానే బాంబు సూట్‌ వేసుకుంటాం. ఈ సూట్‌ బరువు సుమారు 60కేజీల వరకు ఉంటుంది. దీన్ని ధరించిన తర్వాత 20 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండలేం. ఆక్సిజన్‌ అందదు. అందువల్ల 20 నిమిషాల లోపే అక్కడికి చేరుకొని టెలిస్కోప్‌ మ్యానిప్యులేటర్‌ పరికరం ద్వారా రింగ్‌ చేసి బాంబ్‌రింగ్‌లో పేలుడు పదార్థం ఉన్న సూట్‌కేస్‌/బ్యాగ్‌ను వేసి దానిపై బాంబ్‌ బ్లాంకెట్‌ను వేసి బ్లాస్ట్‌ చేస్తాం. కచ్చితంగా ప్రాణాపాయం లేకుండా కాపాడతామని కూడా చెప్పలేం.కొంత వరకు మాత్రమే ఇది రక్షణ ఇస్తుంది’’ అని వివరించారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని