బరువు పెరగాలనుకుంటున్నారా?

‘బరువు తగ్గాలంటే కష్టం కానీ.. పెరగడం ఎంతసేపు! తిని కూర్చుంటే చాలు సింపుల్‌గా పెరిగేయొచ్చు’ అంటుంటారు కొందరు. కానీ బరువు పెరగడం అంత సులువేం కాదండోయ్‌! కొందరు సునాయాసంగా బరువు పెరిగి లావెక్కినా.. ఇంకొందరు మాత్రం దానికోసం అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఎంత ఆహారం తీసుకున్నా సన్నగానే కనబడుతుంటారు. మరి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో బరువు పెరగడం మీ లక్ష్యమా? అయితే సింపుల్‌గా ఈ డైట్‌‌ సలహాలు పాటిస్తే బరువుగా పెరగొచ్చని చెబుతున్నారు...........

Published : 08 Dec 2020 12:32 IST


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బరువు తగ్గాలంటే కష్టం కానీ.. పెరగడం ఎంతసేపు! తిని కూర్చుంటే చాలు సింపుల్‌గా పెరిగేయొచ్చు’ అంటుంటారు కొందరు. కానీ బరువు పెరగడం అంత సులువేం కాదండోయ్‌! కొందరు సునాయాసంగా బరువు పెరిగి లావెక్కినా.. ఇంకొందరు మాత్రం దానికోసం అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఎంత ఆహారం తీసుకున్నా సన్నగానే కనబడుతుంటారు. మరి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో బరువు పెరగడం మీ లక్ష్యమా? అయితే సింపుల్‌గా ఈ డైట్‌‌ సలహాలు పాటిస్తే బరువుగా పెరగొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా!  

ఇవి చాలా మేలు
ఖర్జూర పండ్లు బరువు పెరిగేందుకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్లు ఏ, సీ, ఇ, కే, బీ2, బీ6, థయామిన్‌‌, నియాసిన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు ప్రొటీన్‌లు, చక్కెరలు సైతం అధికంగా ఉంటాయి. అనవసర కొవ్వును కాకుండా శరీరానికి మేలు చేసే కొవ్వును మాత్రమే వృద్ధి చేస్తాయి. కండర కొవ్వును పెంచి దృఢత్వాన్ని పెంచుతాయి. వేగంగా బరువు పెరగాలంటే ఈ ఖర్జూరాలను పాలలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం మంచిది.

వెన్నతో మిన్నగా.. 

వెన్న తీసుకోవడం కూడా బరువు పెరగడానికి ఎంతో దోహదం చేస్తుంది. మీ శరీర బరువును పెంచేందుకు అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. ఒక చెంచాడు వెన్నకు ఓ చెంచాడు చక్కెరను జోడించి ఆహారం తీసుకునే ముందు తీసుకోండి. నెలరోజుల పాటు వెన్న, చక్కెర మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా బరువు పెరగాలనుకున్న మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

పండ్లతో పోషకాలు 
అవకాశం ఉంటే ప్రతిరోజు పండిన మామిడి పండ్లను తీసుకోండి. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్‌లు, చక్కెర, ప్రొటీన్‌లు అధిక మోతాదులో ఉంటాయి. దీంతో కండరాల బరువు సులభంగా పెరుగుతుంది. మరింత త్వరగా ఫలితం పొందేందుకు మామిడిని తీసుకున్న అనంతరం ఓ గ్లాసు వేడి వేడి పాలని తాగండి. పాలలో ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, కొవ్వులు ఉంటాయి. బరువు పెంచేందుకు కండరాల తయారీకి పాలు ఉపయోగపడతాయి. ఓ నెల రోజులపాటు ఇలా చేస్తూ బరువు పెరిగే లక్ష్యానికి మీరు ఎంతగా చేరువవుతున్నారో గమనించండి. 

ఇలా ప్రయత్నించండి
వేరుశనగలు తినడం ద్వారా త్వరగా బరువు పెరగవచ్చు. ఇందులో ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలు‌, విటమిన్లు అధిక మోతాదులో లభ్యమవుతాయి. ప్రతిరోజు వేరుశనగను మీ డైట్‌కి జోడించడం ద్వారా సులువుగా బరువవ్వొచ్చు. దీంతోపాటు ‘పీనట్‌ బటర్‌‌’ని బ్రెడ్‌పై రాసి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ సమయంలో తీసుకోవడం ద్వారా ఫలితం ఉంటుంది. బరువు పెరిగేందుకు ఇంటి చిట్కాల్లో ఇది ఉత్తమమైన మార్గం. ఇందులో అత్యధిక కేలరీలు ఉండటం వల్ల త్వరగా లావవుతారు.  

టీ, కాఫీలకు బదులుగా..
ఉదయం నిద్రలేవగానే టీ తాగే అలవాటుందా? అయితే టీకి బదులుగా ‘బనానా షేక్‌’ని ఎంచుకోండి. అరటి పండ్లు త్వరగా శక్తినిచ్చే ఎక్కువ కేలరీలు కలిగిన ఫుడ్‌. అందుకే క్రీడాకారులు ఎక్కువగా ఆట మధ్యలో అరటిపండ్లను ఎంచుకుంటారు. కానీ బరువు పెరగాలంటే ఓ గ్లాసు పాలకు అరటిపండ్లను జోడించి తినండి. అలా బనానా షేక్‌ను తయారు చేసి టీ, కాఫీలకు బదులుగా ఎంచుకోండి. ఇంట్లోనే తయారు చేసుకునే వనిల్లా బెర్రీ షేక్‌, కేరామిల్‌ యాపిల్‌ షేక్‌, చాక్లెట్‌ బనానా నట్‌ షేక్‌ తదితర ప్రొటీన్‌ షేక్‌లను ఎంచుకోవచ్చు.

బరువు పెరగడమంటే కొవ్వు పెరగడం కాదు
బరువు పెరగడం అంటే కొవ్వు పెరగడం కాదు. కేవలం శరీరానికి అవసరమైన కొవ్వులను అందించడం. అందుకు ప్రొటీన్‌ ఫుడ్ చాలా అవసరం. ఇందుకోసం చేపలు, గుడ్లు, మాంసం, సోయాబీన్‌ తదితర ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇవి కండరాల పెరుగుదలకు సాయపడటంతో పాటు వాటిని దృఢంగా తయారుచేస్తాయి. బరువు పెరగడంతోపాటు ఫిట్‌గానూ తయారవుతారు. కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉంటే బ్రౌన్‌రైస్‌, ఓట్స్‌, బ్లూ బెర్రీస్‌, బంగాళదుంపలు తదితర వాటిని కూడా ప్రయత్నించండి.  

తగిన కసరత్తులూ అవసరమే
కేవలం బరువు తగ్గేందుకే కాదు.. బరువు పెరిగేందుకు సైతం వ్యాయామం అవసరమే. కసరత్తుల ద్వారా అనవసరపు కొవ్వు కరిగి మిమ్మల్ని ఫిట్‌గా, అందంగా ఉంచుతుంది. మరి బరువు తగ్గేందుకు డైట్‌తో పాటు ఇంట్లోనే పుష్‌అప్స్‌, సిట్‌ అప్స్‌, పుల్‌ అప్స్‌, క్రంచెస్‌, స్క్వాట్స్‌ తదితర బేసిక్‌ వ్యాయామాలు చేస్తే సరిపోతుంది.  

అలా ఓ కునుకేయండి..
వీలైతే మధ్యాహ్నం సమయంలో కాసేపు విశ్రాంతి తీసుకోండి. కొన్ని అధ్యయనాల ప్రకారం మధ్యాహ్న సమయంలో ఓ గంట నిద్రతో సులువుగా బరువు పెరిగేస్తారట. ఇది మీ మెదడు, కండరాలకు ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు ఇలా ఓ కునుకేయడం ద్వారా రాత్రి సమయంలోనూ ప్రశాంతంగా నిద్రపడుతుందట. ఇక ప్రతిరోజూ రాత్రి సమయంలో 8గంటల పాటు నిద్ర బరువు పెరగాలన్న మీ లక్ష్యానికి మరింత చేరువచేస్తుంది.

అలవాట్లు మార్చాల్సిందే..
బరువు పెరగకపోవటానికి చాలా కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా ఒత్తిడి. దీంతో పాటు సమయానికి భోజనం చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక దృఢత్వం లేకపోవడం, కొన్నిసార్లు జన్యుకారణాల వల్లనూ బరువు పెరగకపోవచ్చు. అందుకే బరువు పెరిగేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. రోజులో వీలైనన్నిసార్లు ఆహారం తీసుకోండి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయండి. అనవసరపు కొవ్వును వృద్ధి చేసే ఆహారానికి దూరంగా ఉండండి.  

ఇవి చేయొద్దు!
బరువు పెరగాలన్న మీ లక్ష్యానికి పైన పేర్కొన్న ఆహార నియమాలు, పానీయాలు, వ్యాయామం మాత్రమే చేస్తే సరిపోదు. వీటితోపాటు మీరు చేసే కొన్ని పనులు మీ లక్ష్యానికి మిమ్మల్ని దూరం చేయొచ్చు. భోజనానికి ముందు నీరు, టీ, కాఫీలు తీసుకోకూడదు. ఇవి మీ ఆకలిని తగ్గిస్తాయి. మీ భోజనానికి మధ్య అరగంట వ్యవధి ఉండేలా జాగ్రత్త వహించాలి. బరువు పెరిగేందుకు శాస్త్రీయ ఆధారాలు లేని మందులు, పౌడర్లు వాడటం ద్వారా అనవసరపు ఆరోగ్య సమస్యలు రావొచ్చు. అందుకే ఆరోగ్యకరమైన డైట్‌నే పాటించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని