
‘థార్’ ఎడారిలో నది ఆనవాళ్లు
జైపూర్ : మన దేశంలోనే అతిపెద్ద ఎడారి అయిన థార్‌లో పూర్వం నది ప్రవహించేదని ఓ పరిశోధనలో తేలింది. 1,70,000 సంవత్సరాల కిందట రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతానికి సమీపంలో ప్రవహించిన నది అప్పట్లో మనుషులకు జీవనాడిగా ఉండేదని పరిశోధకులు పేర్కొన్నారు. జర్మనీలోని ది మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడు రాష్ర్టంలోని అన్నా విశ్వవిద్యాలయం, కోల్‌కతాకు చెందిన ఐఐఎస్‌ఈఆర్ పరిశోధకులు సంయుక్తంగా నదిపై అధ్యయనం చేశారు.
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ఇటీవల క్వాటర్నరీ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. థార్ ఎడారి మధ్యప్రాంతంలోని నాల్ క్వారీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఖనిజాలపై అధ్యయనం చేసిన పరిశోధకులు నది అవశేషాలను కనుగొన్నారు. రాతియుగం నాటి మనుషులు ఈ నది పరివాహక ప్రాంతంలో నివసించినట్లు పరిశోధనలో తేలింది.
‘ల్యూమినిసెన్స్ డేటింగ్’ ద్వారా తాము ఎడారి అంతర పొరలోని నిక్షేపాల కింద నది ప్రవహించిన ఆధారాలను సేకరించినట్లు అన్నా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హేమ అచ్యుతన్ వివరించారు. దీంతో పాట ఉపగ్రహ ఛాయచిత్రాల ఆధారంగానూ ఇక్కడ నది ప్రవహించిన ఆనవాళ్లు ఉన్నట్లు తాము గుర్తించామని పరిశోధకులు తెలిపారు.