మాస్క్‌లు అతిగా వాడితే ప్రమాదమా?

కరోనా కారణంగా మాస్క్‌లేనిదే బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. మాస్క్‌లు అతిగా వాడటం వల్ల కలిగే ఇబ్బందులు

Published : 03 Oct 2020 01:11 IST

హూస్టన్‌: కరోనా కారణంగా మాస్క్‌లేనిదే బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. మాస్క్‌లు అతిగా వాడటం వల్ల కలిగే ఇబ్బందులు ఇవేనంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొడుతున్నాయి. మాస్క్‌ల కారణంగా కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయులు పెరిగి, ఊపిరితిత్తుల సమస్యకు దారితీస్తుందని ప్రచారం చేస్తున్నారు. తాజా అధ్యయనమొకటి ఈ వార్తలను ఖండించింది. మరీ ముఖ్యంగా మాస్క్‌ల వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ ఈ విషయమై అధ్యయనం చేసింది.

మాస్క్‌లు ధరించడం వల్ల ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఆక్సిజన్‌, కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయుల్లో మార్పులు జరిగి అనారోగ్యం పాలవుతారన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అయితే, అందరిలోనూ అలా జరగకపోవచ్చని ముఖ్యంగా క్రానిక్‌ అబ్‌స్ట్రాక్టివ్‌ పల్మనరీ డీసీజ్‌(సీఓపీడీ)తో బాధపడేవారిలో ఈ సమస్య ఎదురుకావొచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. ఎందుకంటే సీఓపీడీ సమస్య ఉన్న వాళ్లు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ‘మాస్క్‌ ధరించడం వల్ల అతి తక్కువ మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదీ కూడా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి ఇది ఇంకాస్త ఎక్కువగా ఉండవచ్చు’ అని అధ్యయన కర్తల్లో ఒకరైన మైఖేల్‌ కాంపోస్‌ తెలిపారు.

సౌకర్యవంతమైన, గాలి పీల్చుకునేందుకు వీలైన మాస్క్‌లు ధరించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని, అయితే, మాస్క్‌లను బిగుతుగా ధరించడం, వేగంగా నడవడం వల్ల శ్వాస ఆడక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇతరులకు దూరంగా ఉన్నప్పుడు మాస్క్‌ను తొలగించవచ్చని కాంపోస్‌ చెప్పారు. అయితే, అదే సమయంలో కరోనాను అడ్డుకట్టవేయడంలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని కూడా అన్నారు. సర్జికల్‌ మాస్క్‌లు ధరించలేని వారు రెండు పొరలతో కూడిన క్లాత్‌ మాస్క్ ధరించాలని అమెరికాకు చెందిన సెంటర్స్‌‌‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సూచించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని