అంతుచిక్కని ఏకశిల.. ఇప్పుడు నెదర్లాండ్స్‌లో..

నిర్జర ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతూ కొద్దిరోజులకు మాయమవుతూ పరిశోధకుల మెదళ్లను తొలుస్తున్న ఏకశిల ఈ సారి నెదర్లాండ్స్‌లో ప్రత్యక్షమైంది. ఉత్తర ఫ్రైస్‌ల్యాండ్ ప్రావిన్స్‌లోని కీకెన్‌బర్గ్ ప్రకృతి రిజర్వ్ సమీపంలో....

Published : 08 Dec 2020 12:48 IST

ప్రత్యక్షమవుతూ మాయమౌతున్న వింత స్తంభం

ది హేగ్‌: నిర్జన ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్దిరోజులకే మాయమవుతూ పరిశోధకులను పరుగులు పెట్టిస్తున్న ఏకశిల ఈ సారి నెదర్లాండ్స్‌లో ప్రత్యక్షమైంది. ఉత్తర ఫ్రైస్‌ల్యాండ్ ప్రావిన్స్‌లోని కీకెన్‌బర్గ్ ప్రకృతి రిజర్వ్ సమీపంలో హైకర్లు ఓ ఏకశిలను కనుగొన్నారు. ఈ విషయాన్ని డచ్ ఫారెస్ట్రీ కమిషన్ ప్రతినిధి ఇమ్కే బోర్మా ఏఎఫ్‌పీ అనే న్యూస్‌ ఏజెన్సీకి వెల్లడించారు. ఓ ప్రైవేటు భూమిలో దానిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆదివారానికి ముందు అక్కడ ఎటువంటి నిర్మాణం లేదన్నారు. ఆదివారం రోజు ఆ వింత నిర్మాణాన్ని కొందరు గుర్తించినట్లు ఇమ్కే బోర్మా పేర్కొన్నారు. కానీ, దాన్ని ఎవరు, ఎందుకు పాతిపెట్టారో తెలియడంలేదన్నారు. ఆ వింత స్తంభాన్ని ఎవరు పాతిపెట్టారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత నవంబర్‌ 18న అమెరికాలోని యుటాలో ఓ ఏకశిల దర్శనమిచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అక్కడి రెడ్‌ రాక్‌ ఎడారిలో వన్యప్రాణి సిబ్బంది ఓ వింత స్తంభాన్ని గుర్తించారు. అయితే, జన సంచారం లేని ఎడారిలో ఆ వింత స్తంభాన్ని ఎవరు పాతిపెట్టారో అధికారులకు అంతుచిక్కలేదు. కొద్దిరోజుల అనంతరం అది అకస్మాత్తుగా మాయమైపోయింది. తర్వాత 24 గంటలు గడవకముందే రొమానియాలో అదే తరహా స్తంభాన్ని కొందరు గుర్తించారు. పరిశోధకులు దానిపై పరిశోధనలు చేస్తుండగానే అది కనిపించకుండాపోయింది. దాన్ని ఎవరో తవ్వి తీసుకెళ్లిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. అది మాయమైన కొద్దిరోజులకే బ్రిటన్‌లో ప్రత్యక్షమైంది. మళ్లీ అక్కడ నుంచి కూడా మాయమైంది. ప్రస్తుతం అదే తరహా ఏకశిల నెదర్లాండ్స్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ వింత ఆకారంపై అధికారులు, పరిశోధకులు దృష్టి సారించారు. 

ఇవీ చదవండి...

ఏం జరుగుతోంది?.. మళ్లీ మాయమైన ఏకశిల

కలవరపెడుతున్న ఏకశిలల రహస్యం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని