ఇంట్లో తయారీ మాస్కులూ ఉత్తమమైనవే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణతో ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరైంది. మహమ్మారి విలయతాండవానికి అమెరికా అధ్యక్షుడి నుంచి అతి సామాన్యుడి వరకు మాస్క్‌ ధరించకతప్పడం లేదు.

Published : 24 Jul 2020 18:48 IST

తాజా పరిశోధనల్లో వెల్లడి

మెల్‌బోర్న్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణతో ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరైంది. మహమ్మారి విలయతాండవానికి అమెరికా అధ్యక్షుడి నుంచి అతి సామాన్యుడి వరకూ మాస్క్‌ ధరించక తప్పడం లేదు. ఈ సందర్భంలో మార్కెట్‌లోకి రకరకాల మాస్క్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కొందరేమో వాడి పారేసే మాస్కులు ధరిస్తుంటే, మరికొందరు మాత్రం దాదాపు 95శాతం వైరస్‌ నిరోధించగలవని చెప్పే మాస్కులు ధరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ మాస్కులు ధరించాలనే దానిపై సందిగ్ధం కొందరిలో నెలకొంది. అయితే ఇంట్లో వస్త్రంతో తయారుచేసిన మాస్కులే వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధించగలవని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

మాస్కుల నాణ్యత, వైరస్‌ను నిరోధించే సామర్థ్యంపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌వేల్స్‌కు చెందిన నిపుణులు పరిశోధన జరిపారు. ముఖ్యంగా ఒకేపొరతో ఉండే సర్జికల్‌ మాస్క్‌, ఇంట్లో వస్త్రంతో రెండు పొరలతో తయారుచేసిన మాస్కును పోల్చి చూశారు. దీనికోసం ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌తోపాటు అత్యాధునిక‌ వీడియో కెమెరాలను ఉపయోగించారు. సింగిల్‌ లేయర్‌తో తయారు చేసిన మాస్కు కంటే రెండు లేయర్లతో ఇంట్లో తయారు చేసిన మాస్క్ ‌నుంచి తక్కువ తుంపర్లు బయటకు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దగ్గు, తుమ్ము వల్ల వచ్చే తుంపర్ల వ్యాప్తిని నిరోధించడంలో ఇంట్లో తయారుచేసిన మాస్క్‌ మెరుగ్గా ఉన్నట్లు తేల్చారు. ముక్కు, నోరును పూర్తిగా కప్పి ఉంచడానికి ఇవి అనువుగా ఉన్నట్లు తేల్చారు. అయితే మూడు లేయర్లతో కూడిన సర్జికల్ మాస్క్‌ కూడా ఉత్తమమైందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ రైనా మెక్లెంటైర్‌ స్పష్టం చేశారు. తాజాగా ఈ పరిశోధన థోరాక్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఆరోగ్యవంతులను వైరస్‌ బారినపడకుండా కాపడడంలో మాస్కులు ఎంతో కీలకమనే విషయం తెలిసిందే. అంతేకాకుండా వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాప్తి చెందకుండా మాస్కులు నిరోధిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మాస్కులకు భారీ డిమాండ్‌ పెరగడంతో పలుచోట్ల కొరత కూడా ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో పలు ఆరోగ్య సంస్థలతోపాటు అమెరికా సీడీసీ వంటి అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఇంట్లో తయారుచేసిన మాస్కులను వాడటమే ఉత్తమమని ఇప్పటికే సిఫార్సు చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు